14. దస్త్రాలన్నీ తెలుగు భాషలోనే...
అమ్మ భాషలోనే మన ఆలోచనలు వికసిస్తాయి. అందులోనే మన భావాలను సూటిగా, స్పష్టంగా రాయగలం. అందుకే నా కార్యాలయ దస్త్రాలన్నీ తెలుగులోనే నిర్వహిస్తా’నంటూ సగర్వంగా చెబుతున్నారు నూర్‌బాషా రహంతుల్లా. తెలుగు మాట్లాడేవారన్నా, తెలుగు రచనలన్నా ఎందుకో తక్కువ చూపు చూసే ఎందరో చిన్నదెబ్బ తగిలితే అమ్మా అనే కదా అంటారు. అంటారాయన.
రహంతుల్లా చిన్ననాటి నుంచి తెలుగు భాషాభిమాని. మహ్మదీయుడిగా పుట్టినా నా మాతృభాష తెలుగే. నేను ‘‘తెలుగు ముస్లిం’’ ని అంటారాయన. గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలోని కంకటపాలెం ఆయన స్వగ్రామం. అక్కడే తెలుగు మాధ్యమంలో డిగ్రీ వరకు చదివారు. 1985లో తెలుగు మాధ్యమంలో గ్రూప్2 పరీక్షల్లో విజయం సాధించి, రెవెన్యూ విభాగంలో ఉద్యోగంలో చేరారు. తొలి రోజు నుంచి తన దస్త్రాలన్నింటినీ తెలుగులోనే రాసేవారు. అందరూ ఆయనను ఇంగ్లీష్‌రానివాడిగా, తక్కువస్థాయివాడిగా చూసినా చలించలేదు. అమ్మభాష కోసం ఎన్నో మాటలు పడ్డారు. కానీ కాలక్రమంలో సహోద్యోగుల మధ్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. ప్రస్తుతం విజిటిఎం ఉడా భూసేకరణ విభాగంలో ప్రత్యేకాధికారిగా పని చేస్తున్నారు.
ఎన్నో ‘తెలుగు’ విజయాలు : రహంతుల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో తహసీల్దారుగా పని చేస్తున్న కాలంలో 23 రిట్‌పిటిషన్లకు తెలుగులోనే సమాధానాలు రాసి పంపారు. దీంతో పై అధికారులు ఆగ్రహించారు. అలా కుదరదన్నారు. కానీ రహంతుల్లా చలించలేదు. చివరకు న్యాయస్థానంలో విజయం సాధించారు.
తహసీల్దారుగా పనిచేస్తున్న సమయంలోనే త న కార్యాలయంలో దరఖాస్తులు, అభ్యర్థన పత్రాలన్నింటికీ తెలుగు నమూనాలు తయారు చేయించి, రైతులు కూడా స్వయంగా పూర్తి చేసుకునేలా వాటిని తీర్చిదిద్దారు. దీంతో దళారుల ప్రమేయం తగ్గింది. పట్టాదారు పుస్తకాలు, విద్యార్థులకు వివిధ ధృవీకరణపత్రాలు తెలుగులో జారీ చేశారు.
ఇస్లాం క్రైస్తవ మతాల మీద తులనాత్మక అధ్యయనం చేస్తూ తెలుగులో 10 పుస్తకాలు రాశారు. 1986 నుంచి 1991 వరకు ‘గీటురాయి’ వారపత్రికలో తెలుగు సామెతలతో ‘ఉబుసుపోక’ అనే శీర్షికలో వ్యంగ్య వ్యాసాలు రాశారు. ఈయన రాసిన ‘తెలుగు అధికార భాష కావాలంటే’ పుస్తకాన్ని రెండవసారి తెలుగు ఇస్లామిక్‌ప్రచురణ సంస్థ ప్రచురించింది. 37 ఏళ్ళుగా వివిధ పత్రికల్లో తెలుగు భాషా పరిరక్షణ తదితర అంశాలపై వ్యాసాలు రాస్తున్నారు. 2003లో అధికార భాషా సంఘం నుంచి ‘‘విశిష్ట భాషా పురస్కారం’’ అందుకున్నారు.
తెలుగు రాజభాష కావాలి : తెలుగులో డిగ్రీ చదివిన వారికి ఉద్యోగాల్లో 5% ప్రాధాన్యత మార్కులు ఇవ్వడం వల్లే నాకు ఉద్యోగం వచ్చి ఈ స్థితికి రాగలిగాను. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. తిరిగి ప్రభుత్వం ఆ ఉత్తర్వులిస్తే తెలుగులో పరిపాలనా వ్యవహారాలు నడిపే అధికారులు వస్తారు. ఇంకా, తెలుగు మాట్లాడేవారంటే చిన్నచూపు పనికిరాదు. కిందిస్థాయి నుంచి ప్రతి కార్యాలయంలో తెలుగులోనే దస్త్రాలు తయారవ్వాలి. తెలుగు లిపి సంస్కరణ, మహానిఘంటు నిర్మాణం జరగాలి. (ఈనాడు 29.8.2011)
ఈనాడు 23.4.2008
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి