5. తెలుగు అధికార భాష కావాలంటే...
తెలుగును అధికార భాషగా విస్తృతంగా వ్యాపింపచేయడానికి ఒక కొత్త పథకాన్ని రూపొందిస్తున్నట్లు అధికార భాషా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి పి. యశోదారెడ్డి ప్రకటించారు. ఆ పధకం ప్రకారం ఎం.ఎ స్థాయిలో అధికార భాష వాడకంపై ఒక పాఠ్యాంశం ప్రవేశపెట్టాలని అన్ని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్‌లర్లను కోరతారట. తెలుగును బాగా వాడుకలోకి తేవాలని అధికార భాషా సంఘం ఎన్నో అవస్థలు పడుతోంది. రకరకాల ప్రయోగాలు చేస్తోంది. కాని ఆ సంఘం ఏమీ చేయలేకపోతున్నది. ప్రజలను ఓదార్చటం కోసం ఆ సంఘాన్ని స్థాపించారే తప్ప, ఆ సంఘానికి అవసరమైన అధికారాలను అప్పగించి ప్రోత్సహించలేదు. అధికార భాషా సంఘం ఒక సలహా సంఘం లాంటిదే గాని దానికి ఎలాంటి చట్టబద్ధమయిన అధికారాలూ లేవు. తెలుగుభాషను అమలు జరపని అధికారులవిూద చర్యలు తీనుకునే అధికారం అధికార భాషా సంఘానికి దత్తం చెయ్యాలి.
ప్రపంచ భాషలన్నిటిలో తెలుగు 15వ పెద్ద భాష. ఇండియాలో రెండవస్థానాన్ని ఆక్రమించిన భాష. అయినా అతిగా నిర్లక్ష్యం చెయ్యబడిన భాష.ఇంగ్లీషు, హిందీ, ఉర్ద్దూ, సంస్కృతం లాంటి భాషల దురాక్రమణకు బాగా గురయిన భాష. ఐ.ఎ.యస్. అధికారులు మొదలు అటెండర్ల వరకు చిన్నతనంగా భావించి ఈసడించే బాష. భాషా ప్రాతిపదికమీద రాష్ట్రం ఏర్పడి 34 ఏళ్ళ గడిచినా పాలకులు చట్టాలు ఇంకా చెయ్యలేక పోతున్న భాష. పబ్లిక్ సర్వీస్ కమీషన్, సచివాలయం మొదలైన కార్యాలయాల్లో అడుగడుగునా అవమానాలకు గురౌతూ, ఆంగ్ల సవతిపోరు అనుభవిస్తున్న భాష. ఇంతవరకు ఒక సమగ్రమైన శాస్త్రీయమైన నిఘంటువును సైతం సమకూర్చుకోలేక పోయిన భాష. మమ్మీ, డాడీల డాబుసరి చదువుల ముందు సిగ్గుతో ముడుచుకు పోయిన భాష. ఇన్ని బాధల వలయంలో ఉన్న మన భాషను రక్షించుకొని, దానికి పరిపాలక భాషగా పట్టం కట్టాలంటే ఎన్నో పనులు చేయవలసి ఉంటుంది. అయితే తెలుగు తెలుగు అని తెగ అరుస్తూ, ఎలాంటి అభివృద్ధి చేయకుండా పాలకులు కాలం గడపటం అనవాయితీ అయ్యింది. పాలకులకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ క్రింది చర్యలు అమలు జరపాలి.
1. నాయకులు, అధికారులు ముందు తమ మనసుల్లో తెలుగుభాష పట్ల గౌరవాన్ని పెంచుకోవాలి. ఆ భాషపట్ల అభిమానాన్ని పెంచుకోవాలి. ఆ భాష మర్యాదను కాపాడటానికి శపధం తీసుకోవాలి. ఎంతో విలువనిస్తూ ఆ భాషను మాట్లాడాలి, వాడుకలోకి తేవాలి, అభివృద్ధి చెయ్యాలి. పిల్లలను తెలుగు మాధ్యమంలో చదివించాలి.
2. రాష్ట్ర ప్రభుత్వం తన చట్టాలన్నీ తెలుగులోకి అనువదించి, ముద్రించి అన్ని కార్యాలయాలకు సరఫరా చెయ్యాలి. వాటి ఆధారంతో పబ్లిక్ సర్వీస్ కమీషన్ శాఖాపరమైన పరీక్షలన్నీ తెలుగులోనే జరపాలి. అన్ని పోటీ పరీక్షల్లో తెలుగు భాషా పరిజ్ఞానం మీద ఒక ప్రశ్నాపత్రం ఉండాలి. తెలుగులో పట్టభద్రులైన వారికి 5 శాతం మార్కులు గ్రూప్ 1 పరీక్షల్లో కూడా ఉచితంగా ఇవ్వాలి. ఆ విధంగా జిల్లా అధికారుల స్థాయిలో తెలుగు పట్టభద్రులను ప్రోత్సహించాలి.
3. సచివాలయంలోని ఇంగ్లీషు టైపు మిషన్లన్నీ తీసివేసి, వాటి స్థానంలో తెలుగు టైపు మిషన్లు ఉంచాలి. ప్రతి జి.వో. తెలుగులో రావాలి. లిపి సంస్కరణ జరిపి తెలుగు టైపును సులభతరం చెయ్యాలి.
4. రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న ఇంగ్లీషు మీడియం పాఠశాలలన్నిటినీ తెలుగు మీడియంలోకి మార్చాలి. తెలుగు మీడియం పాఠశాలలకు మాత్రమే ప్రభుత్వ సహాయం అందాలి. విశ్వవిద్యాలయాల్ల్లోని చదువులన్నీ క్రమంగా తెలుగులోకి మార్చాలి.
5. రాష్ట్ర ప్రభుత్వం ఒక సమగ్రమైన తెలుగు-తెలుగు నిఘంటువును తయారు చేయించాలి. తెలుగు జాతీయాలను, సామెతలను, మాండలికాలను, వివిధ ప్రాంతాలలోని యాసపదాలను క్రోడికరించి ప్రామాణిక గ్రంధాలుగా వెలువరించాలి. స్నాతకోత్తర పరిశోధన విద్యలను కూడా తెలుగులో నడపటానికి వీలుగా శాస్త్ర, సాంకేతిక గ్రంథాలను తెలుగులోకి మార్చుకోవాలి.
6. దూరదర్శన్ రెండవ ఛానెల్‌ను తెలుగు కార్యక్రమాల కోసం సాధించాలి. తెలుగును దేశంలో రెండవ అధికార భాషగా ప్రకటించేందుకు కేంద్రం మీద వత్తిడి తేవాలి.
7. తెలుగు మాధ్యమం ద్వారానే కళాశాల స్థాయి వరకు చదివిన అభ్యర్ధులకు అన్ని ఉద్యోగాల్లో కొంతశాతం రిజర్వేషన్ కల్పించాలి. ముఖ్యంగా గ్రూప్ 1 సర్వీసుల్లో ఇలాంటి రిజర్వేషన్ ఉండాలి. అలాగే స్నాతకోత్తర విద్యను కూడా తెలుగులోనే పూర్తిచేసిన ఉద్యోగులకు ప్రమోషన్ విషయంలో ప్రోత్సాహకాలు ప్రకటించాలి. అధికార భాషగా తెలుగు బాగా అమలు కావాలంటే తెలుగుబాగా వచ్చిన అధికారులు అధికంగా ఉండాలి.
8. ఇక అచ్చతెలుగు వాడాలనే ఛాందస నియమాలు వదులుకొని ఇప్పటికే తెలుగులో బాగా పాతుకుపోయిన ఇతర బాషల పదాలను యధాతథంగా వాడుకోనివ్వాలి. అనువదించటానికి వీలులేని మాటలు, తెలుగులో వేరే పదాలులేక బహుళ ప్రచారం పొందిన పరభాషా పదాలను, వాడుకభాషలోని సంకర పదాలను స్వేచ్ఛగా ఫైల్స్‌లో రాసుకోనివ్వాలి.
ఈ పనులు చేసేందుకు రాష్ట్ర పాలకులు నడుం బిగించాలి. ప్రజల భాషకు ద్రోహం చేస్తే ప్రజలకే ద్రోహం చేసినట్లవుతుంది. (ఆంధ్రపత్రిక 15-7-90)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి