16.ఇంగ్లీషునే లింకు లిపిగా చేస్తే?
23-12-2003న పార్లమెంటు 100వ రాజ్యాంగ సవరణ ద్వారా బోడో, డోగ్రి, మైతిలి, సంతాలీ భాషల్ని 8వ షెడ్యూల్‌లో చేర్చే బిల్లును ఆమోదించింది. కాబట్టి ఇక మీదట షెడ్యూల్‌లో ఉన్న భాషల సంఖ్య 22కు పెరుగుతుంది. ఇంకో 35 భాషల్ని షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండు ఉన్నట్లు అప్పటి ఉపప్రధాని అద్వానీ చెప్పారు.
1991 జనాభా లెక్కల ప్రకారం ఇండియాలో ఇంగ్లీషు మాట్లాడే వారి సంఖ్య 1,78,598. అదే మన రాజభాష. షెడ్యూల్‌లో ఈ భాషలేదు అయినా మకుటంలేని మహారాజు. సింధీ, కాశ్మీరీ, నేపాలీ, కొంకణి, మణిపురి, సంస్కృతం లాంటి భాషలు ఇప్పటికే షెడ్యూల్‌లో ఉన్నాయి. అయితే షెడ్యూల్‌లో చేర్చినంత మాత్రాన ఈ భాషలకు ఒరిగిందేమిటో అర్థం కావటం లేదు.
హిందీ మొదలుకొని అస్సామీ వరకు మొదటి 12 భాషల్నీ ఆయా భాషలు మాట్లాడే జనసంఖ్యను బట్టి షెడ్యూల్‌లో చేర్చారు. బాగానే ఉంది. కానీ అక్కడి నుండి ఏ కారణాల వల్లనో జనసంఖ్యను ప్రాతిపదికగా తీసుకోలేదు. భాషీయుల సంఖ్యను బట్టి షెడ్యూల్‌లో 23 భాషలుండాలంటే 13 నుండి 23 స్థానాలు ఇలా వస్తాయి:-
స్థానం భాషపేరు భాషస్తుల సంఖ్య
(1991 జనాభా) 2001 జనాభా
13. బిలి / బిలోడి 55,72,308
14. సంతాలి 52,16,325
15. కాశ్మీరీ 31,.76,975
16. గోండి 21,24,852
17. సింధి 21,22,848
18. నేపాలీ 20,76,645
19. కొంకణి 17,60,607
20. తులు 15,52,259
21. కురక్/బరావో 14,26,618
22. మణిపురి 12,70,216
23. బోడో/బోరో 12,21,881
ఇలా షెడ్యూల్ చేస్తే 10 లక్షల పైబడిన జనం మాట్లాడే భాషలన్నీ షెడ్యూల్‌లోకి వచ్చి ఉండేవి. కానీ బిలి, గోండి, తులు, కురుక్ భాషలకు ఆ భాగ్యం ఇంకా కలుగలేదని అర్థం అవుతోంది. వీటికంటే చిన్న భాషలైన సంస్కృతం (50 వేలు), డోగ్రి (90 వేలు), షెడ్యూల్‌లో చేరాయి. మైతిలి (78 లక్షలు) హిందీ భాషా కుటుంబానికి చెందినదే అయినప్పటికీ మరొక భాషలాగా దానిని షెడ్యూల్‌లో చేర్చటం విచిత్రం!
భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తరువాత రాజస్థానీ భాష, కోటి ముప్పయి మూడు లక్షల మందికి మాతృ భాష అయినా ఇంకా షెడ్యూల్‌లో చేర్చలేదు. అది హిందీ కుటుంబంలోనే కలిసిపోయింది. 63 వేల మంది మాట్లాడే ఎరుకల భాషను తమిళ కుటుంబంలో కలిపి వేశారు. 1,04,686 మందికి మాతృభాష అయిన ''వడరీ''ని తెలుగు కుటుంబంలో కలిపారు. ఈ వడరీ అనే పదమే మనం వినలేదు. కానీ వడరీ, కామాటీ, బేరాదీ అనే తెలుగు మాండలికాలు ఆంధ్రేతర ప్రాంతాల్లో ఉన్నాయట! ఒక్క హిందీలోనే 48 యాసలున్నాయి. అంటే మైతిలిని వంక పెట్టుకొని భోజ్‌పురి (2.31 కోట్లు), బుందేల్ ఖండీ (16 లక్షలు), ఛత్తీస్ ఘరీ (1.06 కోట్లు), ఘర్‌వాలీ (18 లక్షలు), మగదీ (1.06 కోట్లు) లాంటీ హిందీ యాసలన్నీ పోటీకి రావొచ్చు.
27-5-2004న ఐక్యప్రగతిశీల కూటమి రూపొందించిన ఉమ్మడి కనీస ప్రణాళికలో ''తమిళాన్ని ప్రాచీన భాషగా గుర్తిస్తాం'' అన్నారు. తమిళులు పదవులను సాధించడమే గాక వారి భాషను కూడా రక్షించుకుంటూ ముందుకెళుతుంటే, వారి కంటే ఎక్కువ మంది ప్రజలు మాట్లాడే తెలుగు భాష అభివృద్ధి కోసం కేంద్రాన్ని అడిగే నాయకులు కరువయ్యారు. అసలీ భాష గురించి ఎవరూ అడగనే లేదు. అడగకపోతే అమ్మయినా పెట్టదంటారు గదా! తమిళులతోపాటు మన వాళ్ళూ అడగనక్కరలేదా?
పూర్వం మన భాష నశించిపోతుందే అని కొంత మంది నాయకులైనా బాధపడేవారు. కానీ ఇప్పుడు తెలుగు ఎందుకూ పనికిమాలిన భాషనీ, ఇంగ్లీషు, హిందీ వస్తే మనం ఎక్కడైనా చలామణీ కావొచ్చనీ, పదవులు దక్కాలన్నా, పరపతి పెరగాలన్నా కేవలం తెలుగు వస్తే చాలదనీ, హిందీ, ఇంగ్లీషు భాషలు తప్పనిసరిగా నేర్వాలనీ, చచ్చిపోయే ముసలి భాషను ఎవరూ బ్రతికించలేరనీ మన తెలుగు మేధావులే వాదిస్తున్నారు. మన నాయకులు అందుకు వంతపాడుతున్నారు. ఇక వీళ్ళు తెలుగుకు అధికార పీఠం దక్కనిస్తారా? 8 కోట్ల తెలుగు జనం ఉద్యోగాల కోసం, విజ్ఞానం కోసం ఇంగ్లీషును ఆశ్రయించక తప్పదంటున్నారు మన మేధావులు.
''తెలుగు మీడియంలో బోధన-చదువులోనూ పేదరికాన్ని పెంచుతోంది'' అనే వ్యాసంలో (వార్త 22-5-2004) ప్రొఫెసర్ చందు సుబ్బారావు గారు అందుకు కొన్ని కారణాలు చెప్పారు. అవి:
1. పేద గ్రామీణ విద్యార్థులను విద్యా ఉద్యోగ రంగాలలో పైకి రానివ్వకుండా మాతృభాషా మాధ్యమం వారికి కట్టు గొలుసుగా మారుతోంది. వెనుకబడిన కులాల విద్యార్థులే తెలుగు మీడియంలో చేరుతున్నారు.
2. లెక్చరర్లు తప్పులతోనైనా ఇంగ్లీషులోనే బోధించగలుగుతున్నారు. కానీ తెలుగు మీడియంలో విజయవంతంగా చెప్పలేకపోతున్నారు.
3. తెలుగు మీడియం విద్యార్థులు ఆత్మన్యూనతా భావంతో ఇంగ్లీషులో జవాబులు చెప్పలేక మౌనం వహిస్తున్నారు.
పై కారణాలను బట్టి మన పిల్లలంతా ఇంగ్లీషు మీడియంలోకి మారకపోతే వారికి మంచి భవిష్యత్తు దొరకదని ప్రొఫెసర్‌గారు చెప్పకనే చెప్పారు. మరి తెలుగు విద్యార్థులకు మరోదారి లేదా?
మన నాయకులు తలచుకుంటే దారి ఉంది. కానీ వాళ్ళు తలుచుకోరు. ఎందుకంటే ఇంగ్లీషు రాకపోతే అంతర్జాతీయంగా పనికిరాని వాళ్ళమవుతామనీ, హిందీ రాకపోతే జాతీయ జీవనస్రవంతిలో ఉండని ఒంటరిగాళ్ళ మవుతామనీ భయం. గాడిదలాగా పరుగెత్తావెందుకురా అంటే, గుంపులో చేరబట్టి నా భయం తీరిందన్నాడట ఒకడు. హిందీ, ఇంగ్లీషు రాని వాళ్ళకు కేవలం తెలుగు మాత్రమే వచ్చిన వాళ్ళకు బ్రతుకు భయంకరంగానే ఉంది. 24-5-2004న ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు విభాగాధిపతి పర్వతనేని సుబ్బారావు గారిని కలిశాను. ''యుద్ధాలు చేసి గెలిచిన జాతుల భాషలే అధికార భాషలయ్యాయి. పరాజితుడు విజేత భాష నేర్చుకోక తప్పదు. కానీ స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్ళయినా మాతృభాషలో పాలన జరగకపోవటానికి కారణం మన పాలకులు గత్యంతరం లేక పరాయి భాషకు పట్టం గట్టారు. అభివృద్ధి చేసుకుంటే తెలుగు అధికార భాష అవుతుంది. కానీ చేసే వాళ్ళేరి?'' అన్నారాయన. ''అధికార భాషగా తెలుగు'' అనే అంశం మీద పి.హెచ్.డి. కూడా ఎవరూ చేయలేదట. పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం నుండి గొడుగు నిర్మల గారు ఈ అంశం మీద పి.హెచ్.డి చేసినట్లు తెలిసింది.
తెలుగు అధికార భాష కావాలంటే ఇంగ్లీషు స్థాయికి దానిని అభివృద్ది చెయ్యాలి. తెలుగు నేర్చుకునే వాళ్ళ సంఖ్య పెరగాలి. ఇంగ్లీషు హిందీ నేర్చుకునే వాళ్ళ సంఖ్య తగ్గాలి. ఎందుకు? ఎలా? అని మన పాలకులు, ప్రజలు ప్రశ్నించుకోవాలి. చందు సుబ్బారావు గారి వాదన ప్రకారం అయితే మన ప్రభుత్వం నడుపుతున్న స్కూళ్ళన్నీ ఇంగ్లీషు మీడియంలోకి మారిస్తే చాలు. ఒక్క చర్యతో అన్నిసమస్యలూ పరిష్కార మవుతాయి. కానీ, ఇప్పుడున్న ఇంగ్లీషు మీడియం స్కూళ్ళన్నింటినీ తెలుగు మీడియం లోకి మార్చాలంటే అడుగడుక్కీ అడ్డంకులొస్తాయి. ముందు ఇంగ్లీషులో తీర్పులిచ్చే కోర్టులే అడ్డుపడతాయి. కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతుంది. గవర్నర్లు, ఇతర భాషల ఐ.ఎ.యస్. ఆఫీసర్లు అడ్డుపడతారు.
2010 నాటికి అమెరికాలో కంటే ఇండియాలోనే ఇంగ్లీషు మాట్లాడే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుందట. ఆ మేరకు మన భాషలు నాశనం అయిపోతాయి. దీనికి ప్రధాన కారణం మన దేశానికి లింకు భాష కావాల్సి రావటం. జాతీయ, అంతర్జాతీయ భాషల్ని మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా దేశం కోసం మోస్తూ, మన భాషను గత్యంతరం లేక నిర్లక్ష్యం చేస్తూ పోవటం.
ఒక్కో భాష మాట్లాడేవారు ఒక్కో జాతి వారికో దేశం ఉండాలి అనే సిద్ధాంతం అమలయినట్లయితే ఎవరి భాషను వాళ్ళు ఉద్ధరించుకొని వారి భాషలోనే పాలన జరుపుకునేవాళ్ళు. కానీ ఇన్ని భాషల వాళ్ళకూ దేశాలివ్వకుండా, రాష్ట్రాలిచ్చి భారత దేశంగా, భారతీయులుగా కలిసి ఉండమన్నారు. మొగలాయిలు, బ్రిటీష్ వాళ్ళు రాక ముందు ప్రజల భాషలే పాలక భాషలుగా ఉండేవి. ఎవరి భాష వారికి గొప్ప. 'దేశ భాషలందు తెలుగు లెస్స' అని మనమంటే కాదు హిందీయే గొప్ప అంటారు ఉత్తరాది వాళ్ళు. ఇంగ్లీషు కంటే ముందే రాజ్యమేలిన ఉర్దూ లింకు భాష కావటానికి ఆమోదం దొరకలేదు. ఇక ఇంగ్లీషే భారతీయులందరికీ ఇష్టమైన లింకు భాషగా తప్పనిసరి అయ్యింది. నిరాఘాటంగా ఇండియాను పాలిస్తోంది.
మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇంగ్లీషు భాషను పాశ్చాత్యులే కాకుండా భారతీయులు కూడా సాంకేతికంగా, శాస్త్రీయంగా ఎంతో అభివృద్ధి చేశారు. కోట్లాది మంది భారతీయులు ఇంగ్లీషు నేర్చారు. అఆలు రాకపోయినా ABCD లు వచ్చేస్తున్న రోజులివి. తప్పదు మరి. వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని భవిష్యత్తు ప్రణాళిక వేసుకోవాలి. ఇంగ్లీష్ వాళ్ళు I,II,III, IV లాంటి రోమన్ అంకెలు వాడేవారు. తరువాత 1,2,3,4,5,6,7,8,9 అనే అంకెల్ని అరబ్బుల నుండి, '0' ను ఇండియా నుండి తీసుకెళ్ళి తమవిగా చేసుకున్నారు. ఏమీ సిగ్గుపడలేదు. దొంగతనంగా భావించలేదు. పరాయి భాషలకు చెందిన అంకెలని ద్వేషించలేదు. తమ అంకెలు నామ రూపాల్లేకుండా పోతున్నాయే అని బాధపడలేదు. కేవలం సౌకర్యం చూసుకున్నారు. తమ భాష చెలామణీ కావటం చూసుకున్నారు.
మరి మనవాళ్ళు లింకు భాషగా ఇంగ్లీషును ఎన్నుకున్న రోజున, ఇంగ్లీషు లిపిని కూడా లింకు లిపిగా నిర్ణయించినట్లయితే భారతీయ భాషల నడక వేగం పెరిగి ఉండేది. దేశ వ్యాప్తంగా అన్ని భాషల వాళ్ళకూ ఒకే లిపి నేర్పబడేది. భారతీయ భాషలు శబ్ద రూపంలో ఎన్ని విన్యాసాలు చేసినా, ఒకే లిపిలో ఉంటే కనీసం దేశస్తులంతా చదివే వాళ్ళు. ఒక లిపికి అలవాటైన మనిషి తన భాషను మరో లిపిలో రాయటానికి, తన భాషను మరో లిపిలో చదవటానికి అంత సుళువుగా ఇష్టపడడు. లిపి మారితే తన భాషే మారిపోయినట్లుగా ఫీలవుతాడు. కానీ ఈనాడు మనం మన పొరుగు భాషలను కూడా చదవలేకపోతున్నాం. దేశమంతటికీ ఒకే లిపి ఉన్నప్పుడు ఇరుగు పొరుగు భాషలు అర్థం కాకపోయినా, మాట్లాడలేకపోయినా కనీసం చదవటం వస్తుంది. ఏ భాష వాడికైనా చదివిపెట్టడం వస్తుంది. వంద రూపాయల నోటు మీద 18 లిపుల్లో ముద్రించనక్కరలేదు. ఆయా భాషల వాళ్ళు వందరూపాయల్ని ఏమని పలుకుతారో ఆ శబ్దాన్ని ఇంగ్లీషు లిపిలో ముద్రించవచ్చు. వందరూపాయల్ని ఏ భాష వాళ్ళు ఏమని పిలుస్తారో మిగతా అన్ని భాషల వాళ్ళూ చదివి తెలుసుకోవచ్చు. దీన్ని Transliteration అంటారు. సంస్కృత శ్లోకాల్ని మనం తెలుగు లిపిలో రాసుకుంటున్న మాదిరిగానన్న మాట.
మన ఆర్టీసీ బస్సుల మీద తెలుగు అంకెలు వేశారు కానీ అరబీ అంకెల్ని అంటే నేటి ఇంగ్లీషు అంకెల్నే జనం చదువుతున్నారు. కాలగమనంలో పారవేయబడిన వాటిని వెతికి తీసుకొచ్చి జనానికి అలవాటు చేస్తామంటున్న భాషాప్రియులు, అంతకంటే సుళువుగా జనమందరికీ అలవాటైన వాటితోనే భాషాభివృద్ధి చేయవచ్చు. వాక్కు రూపంలో ఉండే భాషకు మనిషి కల్పించిన రూపమే లిపి. లిపిరాని వాడికీ భాష ఉంటుంది. అసలు భాషే రాని వాడికి లిపి ఏముంటుంది? భాషను చదవటానికీ, రాయటానికీ పెట్టుకున్న గుర్తులే అక్షరాలు. అవి మన దేశంలో ఉచస్త్ర పిల్లల దగ్గర నుండి ప్రొఫెసర్ల దాకా అందరికీ ABCD ల రూపంలో నేర్పబడ్డాయి. ''అఆ'' అనే అక్షరాలొచ్చిన పిల్లలు దేశమంతటా ఉండరు కానీ ABCD అనే అక్షరాలొచ్చిన పిల్లలు దేశమంతటా ఉన్నారు. వండి వడ్డించిన దాన్ని తినటానికి తిరస్కరించినందువల్ల మన జాతి శుష్కించిపోతున్నది. తెల్లవాడు అందరివీ దొంగలించి తిని బలిసిపోయాడు. నల్లవాడు అలిగి నీలిగి నీరసించాడు.
సుప్రీం కోర్టు నుండి, ఈ దేశ సర్వోన్నత పాలక పీఠాల నుండీ ఇక ఇంగ్లీషును తొలగించటం సాధ్య కాదు గనుక రకరకాల లిపుల్ని సంస్కరించి యావత్తు భారత జాతికీ అర్థం అయ్యేలా చేయటం అసాధ్యం గనుక, ఆంగ్ల లిపిని స్వంతం చేసుకుని, దేశంలోని అన్ని భాషలకూ దాన్నే లిపిగా అమలు చేస్తే మనకు ఎన్నో కష్టాలు తగ్గుతాయి. అంతర్జాతీయంగా ఆంగ్లభాష లిపికి సమకూరిన యాంత్రిక ప్రయోజనాలన్నీ మన దేశీయ భాషలకూ సమకూరుతాయి. ఈ మార్పుకొక తరం పడుతుంది. వివిధ లిపులకు అలవాటు పడిన పెద్దలు తప్పనిసరిగా ఇబ్బంది పడతారు. కానీ కొత్తగా నేర్చుకునే పిల్లలు సునాయాసంగా ఇంగ్లీషుతోపాటే తమ మాతృభాషల్నీ ఒకే కీ బోర్డుతో సాధన చేస్తారు. ఇంగ్లీషు అక్షరమాలలో లేని కొన్ని శబ్దాలకు కొత్త అక్షరాలను జోడించుకోవటం కన్నా, ఉన్న అక్షరాలకే కొన్ని గుర్తులు జోడించటం ద్వారా ఈ శబ్దం వస్తుందని శాసనం చేయవచ్చు. దేశీయ భాషల మధ్య నిఘంటువుల తయారీ కూడా సుళువవుతుంది. భాషలు నేర్చుకోవటం కూడా తేలికవుతుంది.
ఈ మధ్య ఈ -సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు ఫిర్యాదులు పంపుతున్నారు. ఇంగ్లీషు రాని వాళ్ళు కూడా ఇంగ్లీషు లిపిలో తమ ఫిర్యాదుల్ని ఎంతో చక్కగా పంపించారు. ఒక ఫిర్యాదు ఇలా ఉంది:-
Ayyaa,
NAA BHARTHA CHANIPOYI NAALUGELLAYYINDI. KUTUMBHA
SANKSHEMA PADHAKAM KINDA NAAKU SAHAYAM INKAA
ANDALEDU. TAMARU DAYATO AA SAHAYAM IPPINCHAGALARU.
ఈ ఫిర్యాదు యధాతథంగా కలెక్టర్ నుండి MROకు వెళితే, MROకూడా Telugu లోనే చక్కగా జవాబిచ్చాడు. పనిలో వేగం పెరిగింది. ఆంగ్ల భాష రాకపోయినా, అనువదించి కూర్చుకునే నేర్పు లేకపోయినా భావం చక్కగా చేరాల్సిన చోటికి చేరింది. ఆంగ్ల లిపి ద్వారా ఒన గూడే ఈ సదుపాయాన్ని మనం ఎందుకు స్వంతం చేసుకోకూడదు? నేటి పెద్దలు ముందు చూపుతో చేసే త్యాగాలే రేపటి పౌరులకు సుఖమైన జీవితాన్నిస్తాయి.
గుండ్రని అందమైన నా లిపి అంతరిస్తోందనే బాధ నాకూ ఉంది. కానీ లిపిని అంకెల్ని యంత్రానికి తగ్గరీతిలో ఆంగ్లేయులు అభివృద్ధి పరిచారు. వాళ్ళ అంకెల్ని మనం ఎలాగూ వాడుతూనే ఉన్నాం. ఇక అక్షరాలను కూడా వాడుకుంటే అధికార భాషగా రోమన్ తెలుగును ఫైళ్ళలో కంప్యూటర్ల ద్వారా అమలు చేయటం ఎంతో సుళువవుతుంది. లిపిసమస్య సాకుతో అధికారభాష అమలును ప్రక్కన పెట్టటం కంటే అంతర్జాతీయంగా అమలవుతున్న లిపినే మన భాషకు వాడుకుంటే మేలు జరుగుతుందని ఆశ. రానున్న రోజుల్లో దేశమంతటికీ ఉమ్మడి లిపిగా ఆంగ్లాక్షరాలను ఉపయోగించుకునే విషయమై విస్తృతంగా చర్చలు జరగాలి. దేశ భాషలన్నింటికీ జవసత్వాలను సమకూర్చే నిర్ణయాలు జరగాలని ఆశిద్దాం.
“ముత్యాలలాంటి తెలుగక్షరాలంటూ లిపిమీద లేనిపోని సెంటిమెంట్లు పెట్టుకోవడం మాని రోమన్ లిపిలో(a,aa,i,ee ఈ విధంగా) తెలుగును నేర్పితే అప్పుడు మన దేశం ఆధునిక యుగం లోనికి ప్రవేశిస్తుందని నా నిశ్ఛితాభిప్రాయం. ప్రపంచ తెలుగుమహాసభ వారు ఈ విషయమై ఆలోచించడం మంచిదని నేననుకుంటున్నాను”.--మహాకవి శ్రీ శ్రీ , ప్రజాతంత్ర (18.4.1976) "అనంతం" పేజీ196
“ముత్యాలలాంటి తెలుగక్షరాలంటూ లిపిమీద లేనిపోని సెంటిమెంట్లు పెట్టుకోవడం మాని రోమన్ లిపిలో(a,aa,i,ee ఈ విధంగా) తెలుగును నేర్పితే అప్పుడు మన దేశం ఆధునిక యుగం లోనికి ప్రవేశిస్తుందని నా నిశ్ఛితాభిప్రాయం. ప్రపంచ తెలుగుమహాసభ వారు ఈ విషయమై ఆలోచించడం మంచిదని నేననుకుంటున్నాను”.--మహాకవి శ్రీ శ్రీ , ప్రజాతంత్ర (18.4.1976) "అనంతం" పేజీ196
భాషల మద్య పోటీ అనివార్యం అయ్యింది. ఏ భాష నేర్చుకుంటే ఉపాధి లబిస్తుందో, ఆ భాష వైపుకే మనిషి పరుగులు తీస్తాడు. అది అతని అవసరం. తెలుగుభాష మాత్రమే వచ్చిన వాడికి కూడా శాస్త్ర విజ్ఞానం, ఉపాధి లభిస్తుందనే హామీ దొరికిన నాడు తెలుగు తప్పని సరిగా బ్రతుకుతుంది. ఆ మంచి రోజుల కోసం ప్రతి ఒక్కరం ప్రయత్నిద్దాం.
(గీటు రాయి 11-6-2004)
Acha telugu padalane vaadaalane meeru aangla lipini teluguku aruvu techukovaalanatam vintagaane vunna, alaa cheyatam moolanga telugu bhasha punarujjeevam pondi nirantaramga saagutundanadam lo aematram sandeham ledu. Maha kavi Sri Sri kooda lipi kosam english phonetics ni adopt chesukovalani soochincharanedi gamanarham.
రిప్లయితొలగించండిIndulo vinta emi ledu sir , fact maatrame undi. Manam online chatting lo telugu maatalni english lipi lo elaagaithe upayogistunnaamo ikkada kuda komchem alaage cheyyotchu.
తొలగించండిhttps://www.facebook.com/photo.php?fbid=1166889493343039&set=a.233025936729404.60739.100000659993594&type=3&theater
రిప్లయితొలగించండి