18, జులై 2012, బుధవారం

తెలుగు మహా నిఘంటు నిర్మాణం జరగాలి


23.తెలుగు మహా నిఘంటు నిర్మాణం జరగాలి
                ప్రతి ఏటా ఫిబ్రవరి 21వ తేదీన 'అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం' జరుపుకోవాలని 1999 నవంబర్‌ 17న యునెస్కో ప్రకటించింది. ఇందుకు ముఖ్యకారణం బంగ్లాదేశ్‌లో జరిగిన బెంగాలీ భాషోద్యమం. 1952 ఫిబ్రవరి 21న బెంగాలీ భాషా ఉద్యమకారులు కొంతమంది పాకిస్తాన్‌ ప్రభుత్వం జరిపించిన కాల్పుల్లో మరణించారు. అప్పట్లో తూర్పు బెంగాల్‌ తూర్పు పాకిస్తాన్‌గా ఉండేది. దరిమిలా అదే బంగ్లాదేశ్‌గా ఏర్పడి బెంగాలీలో ఆ దేశపాలన జరుగుతోంది. మాతృభాషకు ఆదేశ ప్రజలు పట్టం గట్టారు. మతం కంటే భాషే ఒక జాతిని శక్తివంతంగా కట్టడి చేస్తుందనీ, చైతన్య పరుస్తుందనీ రుజువయ్యింది. మతం కూడా తన భాషలో లేనప్పుడు మనిషి చెవులున్నా చెవిటివాడిలా, కళ్ళున్నా కబోదిలా, నోరున్నా మూగవాడిలా,  జీవచ్ఛవంలా, కట్టు బానిసలా తయారై  మొక్కుబడిగా పాటిస్తుంటాడు. ఇక తెలివి తేటలు ఉపయోగించాల్సిన వ్యవహారాలు తన భాషలోకాక ఇతర భాషల్లో నడవటం వికలాంగుడి విన్యాసంలా ఉంటుంది. జాప్యం, మధ్యవర్తుల మోసం, అర్ధంకాని తనం, నోరు తెరవలేని తనం జాతిని కృంగదీస్తాయి. బానిసల మెదళ్ళు సృజనాత్మకతను కోల్పోయి, ఎదురు చెప్పకుండా ఆదేశాలను పాటించే చందాన పరభాషా పాలనలో మగ్గిపోయిన జాతి మెదడు బూజుపడుతుంది.
                మాతృభాషాభిమానం వల్ల ఏర్పడిన బంగ్లాదేశ్‌, భాషా ప్రాతిపదిక మీద ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తమ తమ భాషల్లో, పాలించికోవటంలో ఏ మేరకు పురోగతి సాధించాయో విశ్లేషించుకుంటే విచారం లుగుతుంది. భారతీయ భాషల్ని చాలాకాలం సంస్కృతం కబళిస్తే ఇప్పుడు ఆంగ్లం అన్ని భాషల్ని నమిలి మింగేస్తోంది.
                తెలుగు భాషకు సంస్కృతం, ఇంగ్లీషు, అరబీ భాషలకున్న స్థాయి, పదసంపద, దైవాశీస్సులు లేవని మనవాళ్ళే కొంతమంది వాదిస్తున్నారు. అసలు ఈ తెలుగుభాష ఇక బతికుండటం అనవసరమనీ, కేవలం తెలుగునే నమ్ముకుంటే భుక్తి కూడా దొరకదని, ఇంగ్లీషొస్తే చాలు ఎక్కడైనా ట్యూషన్లు చెప్పుకొనైనా బ్రతకొచ్చు, తెలుగు ట్యూషన్‌ ఊరికే చెబుతామన్నా పిలిచేవాళ్ళు లేరనీ మన తెలుగు వాళ్ళే కొంతమంది చీదరిస్తున్నారు.
                తెలుగు వాళ్ళకు రెండువేల ఏళ్ళ చరిత్ర ఉంటే, వెయ్యేళ్ళ సాహిత్యం ఉందనీ, ఇప్పుడు కేవలం వాడుక భాషగా మిగిలి చివరికి లిపిని కూడా కోల్పోబోతున్నదనీ కొందరు బాధపడుతున్నారు. అయితే కేంద్రీయ విశ్వ విద్యాలయం మాజీ వైస్‌ ఛాన్సలర్‌ భద్రిరాజు కృష్ణమూర్తి 19వ శతాబ్దానికి ముందు తెలుగు పాఠశాలలనేవి లేనేలేవనీ, కేవలం సంస్కృత పాఠశాలలు మాత్రమే  ఉన్నాయనీ, సంస్కృతం నేర్చుకున్న వాళ్లు తప్ప మిగతా తెలుగు జనం అందరూ నిరక్షరాస్యులేనని తేల్చిచెప్పారు (వార్త: 22-2-2005). అంటే రెండువేల సంవత్సరాల నుండి నిరక్షరాస్యులే తెలుగు భాషను బ్రతికించుకున్నారన్నమాట. బడిలో తెలుగు నేర్పకపోయినా, తమ బిడ్డలకు ఒడిలోనే తెలుగు నేర్పుతూ ఈ భాషను ఇన్నేళ్ళపాటు బ్రతికించిన ఘనత నిరక్షరాస్యులైన తెలుగు తల్లులదన్నమాట!
                ఎంత అద్భుతం? ప్రభుత్వ సహాయం, కవుల సహకారం, సాహితీ సంపదలాంటివి పెద్దగా లేకపోయినా, రెండువేల సంవత్సరాలు ఒకభాషను సామాన్యజనం కాపాడుకుంటూ రావటం నిజంగా అద్భుతమే. ఇంత శక్తిసామర్ధ్యాలు, మాతృభాష పట్ల మమకారం ఉన్న మన గ్రామీణజనం ప్రభుత్వ సహాయం, మతపెద్దల సహకారం మన భాషకోసం అందజేస్తే తప్పకుండా తెలుగు భాషకు పట్టం గడతారు, జవజీవాలను అందజేస్తారు.
                అయితే ప్రపంచంలోని 6700 భాషల్లో మూడువేల భాషలు కాలగర్భంలో కలసి పోతున్నాయనీ, మొత్తం జనాభాలో ఒక భాష నేర్చుకునేవాళ్ళ సంఖ్య 30 శాతం కంటే దిగువకు పడిపోతే ఆ భాష క్రమేణా నశించి పోతుందని ఐక్యరాజ్యసమితి లెక్క తేల్చిందట. మరి మన తెలుగు చదవడం, రాయడం వచ్చిన వాళ్ళ సంఖ్య 35 శాతం దగ్గర ఉందట. అంటే ఓ 6 శాతం తెలుగు భావిపౌరుల్ని మనం ఇతర భాషలకు ధారాదత్తం చేస్తే చాలు ఇక మన తెలుగు అంపశయ్య మీదకు చేరినట్లేనట!
                అందుకేనేమో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ''తెలుగు భాషను కాపాడండి'' అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ వ్యవహారాల్లో తెలుగు వాడకాన్ని తప్పనిసరి చేయాలని, రాష్ట్రంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో అయిదో తరగతి వరకూ తెలుగులోనే బోధించాలనీ, వృత్తి విద్యాకోర్సులు కూడా తెలుగులోనే ఉండాలనీ, ఆంధ్రేతర ప్రాంతాల్లో నివసించే తెలుగువాళ్ళలో తెలుగును ప్రోత్సహించాలనీ కోరారు (ఈనాడు 22-2-2005) అయితే వీరి పాలనాకాలంలో గ్రూప్‌-1, గ్రూప్‌-2(ఎ) పరీక్షల్లో తెలుగు మీడియంలో డిగ్రీ చదివిన అభ్యర్ధులకిచ్చే 5 శాతం వెయిటేజి మార్కులు ఇవ్వకూడదని హైకోర్టు తీర్పు ఇస్తే దానిపై అపీలు చేయలేదు. సరికదా ఈనాటి వరకు తెలుగ మీడియంలో చదివిన విద్యార్ధులకు ఉద్యోగాల్లో ఎటువంటి ప్రోత్సాహకాలూ ప్రకటించకపోగా, కొన్ని ప్రభుత్వ ప్రాధమికపాఠశాలల్లో కూడా ఇంగ్ళీషు మీడియం ప్రవేశ పెట్టారు. ఇక తెలుగు వాడకం ఎలా పెరుగుతుంది? తెలుగు ఎలా బ్రతుకుతుంది?
                మరో ప్రక్క ఇంగ్ళీష్‌ వాళ్ళను చూడండి. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం వాళ్ళు ఈ మధ్య వెలువరించిన డిక్షనరీలో సెల్‌ఫోన్‌లో వాడే సంక్షిప్త సందేశాలు (ఎస్‌. ఎమ్‌. ఎస్‌) కూడా చేర్చారట. జుఊఔ (ఆల్‌ ద బెస్ట్‌), |ఊ (కీప్‌ ఇన్‌ టచ్‌), ఖఖంఔ (మైండ్‌ యువర్‌ ఓన్‌ బిసినెస్‌) లాంటి పదాలతో పాటు నవ్వు, ఏడుపు, ఆశ్చర్యం, అర్ధంగాకపోవటం, చికాకు వంటి భావాలను తెలిపే గుర్తులు కూడా నిఘంటువులో చేర్చారట. (ఈనాడు: 22-2-2005) మరి మన విశ్వవిద్యాలయాల వాళ్ళు మన తెలుగు నిఘంటు పద సంపదను పెంచేందుకు ఏ మేరకు కృషి చేస్తున్నారు? ఈ మధ్య తెలుగు అకాడమీ తెలుగు-తెలుగు నిఘంటువు చాలా కష్టపడి ముద్రించింది. సంపాదకవర్గం ముందుమాటలో ''నిష్పన్నం'' అనే మాటకు అర్ధం కోసం వెదికితే ఆ మాట నిఘంటువులోనే లేదు. ఇదేం నిఘంటువు? ఆ పదం అర్ధం కోసం మరో తెలుగు నిఘంటువులో చూడాలా?
                అసభ్యమనో, మొరటు అనో, గ్రామీణమనో, ఛండాలమనో పేర్లు పెట్టి మన తెలుగు పదాలెన్నింటినో నిఘంటువులోకి ఎక్కకుండా నిషేధించారు. నిఘంటువులోకి చేర్చకపోయినా ఆ పదాలు వందలు, వేల సంఖ్యలో తెలుగు జనం నాలుకలపై పలుకు తున్నాయి. ఏటా వందలాది పరభాషా పదాలను సైతం తమ నిఘంటువులో చేర్చుకొని బలిసిపోతున్న ఇంగ్లీషు వాళ్ళను తెలుగు పండితులు ఆదర్శంగా తీసుకోవాలి. పరభాషా పదాలు పక్కన బెట్టినా కనీసం మన రాష్ట్రంలోనే వివిధ ప్రాంతాల జనం మాట్లాడే తెలుగు పదాలనైనా నిఘంటువుకు ఎక్కించే కృషి జరగలేదు. విశాఖపట్నం ఏరియాలో కాలువను గెడ్డ అంటారు, తిరునాళ్ళను పరస అంటారు. మరి ఈ గెడ్డ, పరస తెలుగు పదాలు కావా? ఇలాంటి వేలాది తెలుగు పదాలను జాతి కోల్పోతున్నది. నిఘంటువులో పదాల సంఖ్యను బట్టి భాష స్థాయిని నిర్ధారించవచ్చు. నీ పదాలను నీవే వాడకుండా నిర్మూలించుకుంటూ పరభాష చొరబడుతోందని గావు కేకలు పెట్టడం విచిత్రం.
                కొంతకాలం క్రితం ఓ ఉన్నతాధికారి మరో మహిళాధికారిని పిర్ర మీద చరిచాడు. ఆమె కోర్టుకెళ్ళి నెగ్గింది. తెలుగు పత్రికల్లో వృష్టభాగం అన్నారు గాని పిర్ర అనలేదు. ఈ పదాలు తెలుగు ప్రజల వాడుకలో ఉంటాయి గాని, నిఘంటువులో దొరకవు. అదే ఇంగ్లీషు డిక్షనరీ చూడండి. అన్ని అసభ్య పదాలు ఉంటాయి. సభ్యత, అసభ్యత అనే తేడా లేకుండా, నాగరిక, అనాగరిక అనే తేడా లేకుండా జాతి మాట్లాడే పదజాలమంతా గుదికూర్చిందే సమగ్ర నిఘంటువంటే. కేవలం సంస్కృత సభ్య పండితులు దయతలచి గ్రంథస్తం చేసిన పదాల చిట్టా మాత్రమే సమగ్ర నిఘంటువు అవుతుందా? తెలుగు భాష అసలు సిసలు రక్షకులైన బడుగు జీవుల పదజాలమంతా ఏమైపోయింది? అదంతా నిఘంటువు లోకి ఎక్కాలి.
గవర్నరు ఐ.ఎ.యస్‌., ఐ.పి.యస్‌. అధికారులు ఇతర రాష్ట్రాల వాళ్ళు వస్తున్నారు. ''ప్రజలకోసం పనిచేయాల్సిన సివిల్‌ సర్వెంట్లకు ప్రజల భాషరాదు. ప్రజల ఘోష పట్టదు. ఇలాంటి అధికార శ్రేణుల వల్ల తెలుగు భాషకు రాష్ట్ర ప్రజానీకానికి వాటిల్లుతున్న చేటు అంతా ఇంతా కాదు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు, చట్టాలు, న్యాయ స్థానాల్లో వాదనలు, తీర్పులు వంటివన్నీ తెలుగులోనే జరిగిన నాడు 'ప్రజల వద్దకు పాలన' నిజమవుతుంది.'' (ఈనాడు: సంపాదకీయం 22-2-2005)
అధికారులకు తెలుగులో చట్టాలు అందించటం, తెలుగులో సాంకేతిక విద్యలు అందించటం, తెలుగులో చదివిన వారికి ఉద్యోగాలివ్వడం, తెలుగులో వృత్తి పదకోశాలు నిరంతరం తాజాపరచటం, మహా నిఘంటువు నిర్మించటం నేటి అవసరాలు.
                                                                                                                 (గీటురాయి 11-3-2005)

 https://www.facebook.com/nrahamthulla/media_set?set=a.823100821055243.1073741838.100000659993594&type=3

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి