3.తెలుగు భాషలో నమాజు
ఖురాను గ్రంధాన్ని వివిధ భాషలలోనికి అనువాదంచేసి దైవసందేశాన్ని సర్వభాషల వారికి అందించాలని ఎందరో మహాత్ములు విశ్వ ప్రయత్నం చేశారు. కొందరు తమ ప్రయత్నంలో సఫలులుకాగా మరికొందరు మత చాందసుల చేతిలో హింసించబడ్డారు. ఖురాను గ్రంధాన్ని ఏ భాషలోనికి అనువదించకూడదని మూర్ఖంగా వాదిస్తూ హత్యలకు తలపడినవారూ కొన్ని దేశాలలో ఉన్నారు.
సర్వభాషలూ దేవునివే అని ఒక ప్రక్క చెబుతూనే మరో ప్రక్క అరబ్బీ భాషను సర్వజనంపై నిర్భంధంగా రుద్దజూస్తున్న వారి బెడద నేడు తీవ్రమైంది. ఖురాను గ్రంధం సర్వమానవాళి కోసం వచ్చిందని చెప్పేవారే ఆ మానవాళికి దేవుడు వివిధ మాతృభాషల నిచ్చాడని మరిచిపోయి అరబ్బీని తప్పనిసరి చేస్తున్నారు.
ప్రతి ప్రవక్తకూడా తన మాతృభాషలోనే మత ప్రచారం చేసేవారు. అసలు దైవసందేశం కూడా ప్రవక్తల యొక్క మాతృభాషలోనే వచ్చేది. ఎందుకని? ప్రవక్తకు ముందు అర్ధం కావాలి. ఆ తరువాత ఏ ప్రజలకైతే చెప్పబోతున్నాడో ఆ ప్రజలకు అర్ధం కావాలి. అర్ధమయ్యిందే మతం.
ఈ మర్మం ఖురాను లోనే విప్పి చెప్పబడింది. ఖురానును దేవుడు అరబ్బీ లోనే ఎందుకు పంపాడు?
''నీకు అర్థం కావాలని ఖురానును అరబ్బీభాషలోనే పంపాము.'' (ఖురాను 12:2)
మేము ఖురానును అరబ్బుకాని వారికెవరికైనా పంపిన తరువాత వారు దాన్ని చదివి అరబ్బులకు వినిపిస్తే వారు దాన్ని నమ్మరు (ఖురాను 26 :198, 199.).
అరబ్బులు గ్రహించడం కోసం అది ఖురానుగా చేయబడింది. '' మీరు గ్రహించటం కోసం మేము అరబ్బీ ఖురానుగా చేసితిమి '' (ఖురాను 43 :2,3).
మరి తెలుగు వాళ్ళు గ్రహించాలంటే అది తెలుగు ఖురానుగా చేయబడవద్దా? ఖురాను అరబ్బీలో ఎవరికోసం వచ్చింది?
''నీవు మక్కావారిని చుట్టుపక్కల ఉన్నవారిని హెచ్చరించటం కోసం అరబ్బీ భాషలో ఖురాను ను నీవద్దకు పంపాము.'' (ఖురాను 12:7)
మరి మచిలీపట్నం వారిని హెచ్చరించాలంటే అరబ్బీ భాషలో ఎంత అరచినా వారికి అర్థంకాదు, ''దేవుని తీర్పు సింహాసనం ముందు మనమంతా ఒక రోజు నిలబడతాము'' అని తెలుగులో చెప్పి హెచ్చరించవచ్చు గదా! అర్థం కాని కర్మకాండ బండెడు చేసేకంటే అర్థవంతమైన సత్క్రియ ఒక్కటేచాలు.
స్వర్గప్రాప్తి కోసం మనిషి చేయవలసింది ఏమిటి?
'' దేవుడే మాప్రభువు అని, ఎవరు సద్వర్తనులై ఉంటారో వారికి ఎలాంటి భయంగాని దుఃఖగాని లేవు. వారు స్వర్గనివాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు. అది వారు చేసుకున్న కర్మల ఫలితం.'' (ఖురాను 46:13,14)
అంటే సత్క్రియల ఫలితమే స్వర్గం! ఈ పరమ సత్యాన్ని అన్నిమతాలు బోధిస్తున్నవి. వివిధ ప్రాంతీయ భాషలలోనికి చొచ్చుకొని వెళ్ళి, ఆయా ప్రజల సంస్కృతిని దెబ్బతీయకుండా వారివారి భాషల్లోనే ''ఏకేశ్వరోపాసన'' వ్యాప్తి చేయవచ్చు. అర్థం కాని, అరబ్బీని ఆంధ్రముస్లింలపై రుద్దటం కంటే ....... తెలుగులోనే వారిని ఖురాను చదువుకోనివ్వటం, నమాజు చేసుకోనివ్వటం, వివాహాలు జరుపుకోనివ్వటం మేలు. ఈ విషయంలో సంస్కరణలు జరగాలి.
(ఆంధ్ర పత్రిక 19.7.87)
https://www.facebook.com/photo.php?fbid=293944773970853&set=a.233025936729404&type=3&theater
రిప్లయితొలగించండి