18.అయ్యయ్యో...తెలుగు
ఈనాడు దిన పత్రికలో ఈ శీర్షికతో 22-06-2004 న పడిన వార్తలోని అంశాలు ఇలా ఉన్నాయి.
''చట్టాలు రూపొందించే శాసనసభలోనే రాష్ట్ర అధికారభాష తెలుగుకు అవమానం జరిగింది. ఒక బిల్లు ముసాయిదా ప్రతిని ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించిన క్రమంలో భాషాదోషాలు చోటుచేసుకున్నాయి. అనువాదాలు చేయటంలో భాషాపరమైన ఉదాసీన వైఖరినీ, తప్పిదాలు అలవోకగా జరిగిపోవటాన్నీ సమావేశం తప్పుపట్టింది. ముసాయిదా రూపకర్తలు ఆంగ్లంలో ఆలోచించి ఆంగ్లంలో రచించి వాటికి తర్జుమాలు చేయించడం... అది కూడా భాషపై చిత్తశుద్ధి, నిబద్దత లేకుండా జరుగుతుండటంవల్ల ఈ దుర్గతి పడుతోందని సీనియర్ సభ్యుడయిన చెన్నమనేని రాజేశ్వరరావు పేర్కొనడం వాస్తవస్థితికి అద్ధం పడతోంది. అలాకాకుండా తెలుగు అధికార భాష అయిన రాష్ట్రంలో తెలుగులో ఆలోచించి తెలుగులో రచించిన ప్రతుల్ని ఆంగ్లంలోకి అనువదించడం సమంజసంగా ఉంటుందని ఆయన సూచించారు.
శాసనసభకు సంబంధించి, వివిధ సమాచార పత్రికల్లో ప్రభుత్వ అధికారిక ప్రకటన ప్రతుల్లో, బిల్లు ముసాయిదాల్లో వాడుతున్న తెలుగుభాష దారుణంగా ఉంటోందని, వాడుక భాషే కనిపించడం లేదనే విమర్శలున్నాయి. అనువాదాలు నాణ్యత కొరవడి పేలవంగా, మృతభాషలా ఉంటున్నాయని యువ సభ్యులతోపాటు సీనియర్ ఎమ్మేల్యేలూ అభిప్రాయపడుతున్నారు. సరళమైన వాడుక భాష బాగా వృద్ధిచెందిన ఈ రోజుల్లో కూడా పడికట్టు పదజాలంతో ఉండే శాసనసభా ప్రతుల్ని రూపొందిస్తున్నారనీ, వాటిని చదవలేక పోతున్నామనీ వారంటున్నారు. మచ్చుకొక భాగం ఇలా ఉటుంది:-
2. ఉపపరిచ్చేదములు (3) మరియు (4) యొక్క నిబందనలకు లోబడి ఆంధ్రప్రదేశ్ (తెలంగాణా ప్రాంత) జిల్లా పోలీసు చట్టము 1329 ఫసలీ ఈ చట్టము ప్రారంభమైనట్టి నుండి సైబరాబాదు మహానగర ప్రాంతములకు వర్తించుట సమాప్తం కావలెను.
3. అట్టి సమాప్తము వలన (ఎ) సైబరాబాదు మహానగర ప్రాంతములో కూడియున్నట్టి ప్రాంతము విషయములో ఆంధ్రప్రదేశ్ (తెలంగాణాప్రాంత) జిల్లా పోలీసు చట్టము 1329 ఫసలీ పూర్వ అమలుకు ఎట్టి ప్రభావము ఉండదు...
ఇదే క్రమంలో సాగుతుంది. తెలుగు తెలిసిన వారికెవరికైనా ఇది అర్ధమౌతుందా? అని శాసన సభ్యుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.(ఈనాడు 22-06-2004)
తెలుగు రాష్ట్రంలో చట్టాలు చేయవలసిన తెలుగు శాసన సభ్యులకు వారి భాషే వారికి అర్థంకాని రీతిలో అనువాదం చేస్తున్నారు, మన తెలుగు పండితోద్యోగులు. వీళ్ళు తమ ఇళ్ళల్లో ఇలాంటి భాషే మాట్లాడితే భార్యాబిడ్డలు కూడా పిచ్చి పట్టిందంటారు.
ఉపపరిచ్చేదము, అర్ధాధికారలేఖ, కార్యవర్తనములు, ఉపవలయాదికారి.... లాంటి సంస్కృత పదాలతో తెలుగు జనాన్ని హడలగొడుతున్నారు. ఇంతకంటే వాడకంలో ఉన్న ఇంగ్లీషు పదాలనే వాడితే ఎంతో సుఖంగా ఉంటుంది: ప్రజలు వాడని కృతకమైన సంస్కృతపదాలు తెలుగు అనువాదం పేరుతో తెలుగు చట్టాలలోకి పండితులు చొప్పించినా, అవి జనం నాలుకల పైకి చేరి నాట్యం చేయడం లేదు. వేమన పద్యం తెలుగు వాడి నోటికి వచ్చినట్లుగా నన్నయ పద్యం వస్తుందా? రానేరాదు ఎందుకని? మన తెలుగు అనువాదకులు తమను తామే ప్రశ్నించుకోవాలి. ఎంత అర్థంగాకుండా సంస్కృత పదాలతో అనువాదం చేస్తే అంత గొప్ప అనువాదకు లనుకుంటారేమో మరి.
ఈ పరిస్థితి మారాలంటే చట్టం ముసాయిదా బిల్లు ముందు తెలుగులోనే తయారై ఆ తరువాత ఆంగ్లంలోకి అనువదించబడాలి. సమస్య తెలుగు వాళ్ళది. ఆ సమస్య పరిష్కారం కోసం ఏం చెయ్యాలను కుంటున్నారో చెప్పే చట్టనిర్మాతలు తెలుగు శాసన సభ్యులు. మరి చట్టం ఇంగ్లీషులోనే మొదట తయారవుతున్నదేమిటి? ప్రజలు తెలుగులో మొరపెడుతున్నారు. శాసనసభ్యులు, మంత్రులు తెలుగులోనే చట్టం ఇలా చెయ్యాలని చెబుతున్నారు. వాళ్ళ మాటల్లోనే మొదట తెలుగులో చట్టం చేస్తే, చట్టం వాడుక భాషలో సజీవభాషలో అందరికీ అర్ధమయ్యే తెలుగులో తయారవుతుంది. ఆ తరువాత ఇంగ్లీషులోకి అనువదించుకోవచ్చు.
కొంత మంది ఉత్తరాది అధికారుల ఆంగ్ల ఉచ్చారణ పిసాపిసామని పిల్లిని పిలిచి నట్లుంటుంది. జర్మనీవాళ్ళు, అరబ్బులు మాట్లాడే ఇంగ్లీషు ట,డ అనే అక్షరాలు పలకలేని నత్తివాళ్ళ పద్ధతిలో ఉంటుంది. ణ,ళ, అనే అక్షరాలు ఎన్నో భాషల వాళ్ళుపలకనే లేరు. వాళ్ళకా ధ్వనులే లేవు. ఇన్ని రకాల శబ్ధాలుండీ తెలుగువాడి భాష పేదదయ్యిందే! ఒకడు ఇంగ్లీషులో, ఒకడు హిందిలో, మరొకడు సంస్కృతంలో, ఇంకొకడు ఉర్దూలో తెలుగువాడిని హడలగొడుతున్నారు. తెలుగుకంటే ఈ భాషలన్నీ గొప్పవి అనే భావం కల్పించారు. తెలుగును వదిలేసి వాటిని నేర్చుకుంటేనే బ్రతుకుతెరువు, గౌరవం దొరుకుతాయనే సామాజిక వాతావరణం సృష్టించారు. తెలివి ఉండీ పామరుడయ్యాడు తెలుగువాడు. ఉపాయముండీ మూగ వాడయ్యాడు తెలుగువాడు. నోరున్నా తెరువలేడు. మెదడు మొద్దు బారింది. సొంత భాషలో స్వేచ్ఛగా జవాబులిచ్చే మేధావి, ఇంగ్లీషులో వేసే ప్రశ్న అర్ధంకాక, ఇంగ్లీషులో చెప్పటానికి భాషరాక ఏవిూ తెలియని అజ్ఞాని అనిపించు కోవటం ఎంత అన్యాయం? ప్రజలు ఎన్నుకొని తమ నాయకులుగా అసెంబ్లీకి, పార్లమెంటుకీ పంపిన తెలుగువాళ్ళు సైతం, ఇంగ్లీషో, హిందీనో వస్తేనే చట్టసభల్లో రాణించగలుగుతున్నారు. మాతృభాషలో నోరుతెరవలేని దీనస్థితి వారిది.
ఇక ఇప్పుడు ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలల్లో కూడా ఇంగ్లీషు విూడియం మొదలు పెడుతున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి ప్రకటించారు. భేష్! ఆ ఉన్న కాస్త తెలుగు ఇక తుడిచిపెట్టుకుపోయే రోజులు రాబోతున్నాయన్న మాట. అంతేలే, ఎన్ని భాషలు చరిత్రలో గతించిపోలేదు. ఇంగ్లీషొచ్చినోడే ఘనుడు, బలవంతుడు, భగవంతుడు అన్న మానసిక స్థితికి ఎన్నో దేశాలొచ్చాయి. బకాసురుడికి వంతుల వారీగా ఆనాడు జనం విందైనట్లు ఈనాడు ఇంగ్లీషుకి వంతులవారీగా భాషలు బలైపోతున్నాయి.
ఎలిమెంటరీ స్కూలు నుంచే ఇంగ్లీషు విూడియంలో చదివిన వాళ్ళకు మాతృభాష తెలుగే అయినా, తెలుగు లిపి బాగా రాదు. వచ్చినా మన లిపిలో చదవటం, రాయటం వారికి బాగారాదు. ఇక మన భాష శబ్దరూపంలోనే చలామణిలో ఉంటుంది. లిపి వాడకం తగ్గాక భాష గ్రంధస్తం కాదు. గ్రంధస్తంకాని భాష క్రమేపీ నశిస్తుంది. 2010 నాటికి ఇండియాలో ఇంగ్లీషు మాట్లాడే వాళ్ళసంఖ్య అమెరికా మొత్తం జనాభాకంటే ఎక్కువ ఉంటుందట. కాబట్టి మన భావితరాల వాళ్ళు ఇంకా, ఇంకా ఇంగ్లీషునే ఆశ్రయిస్తుంటారు. అలాంటప్పుడు వారికి మన తెలుగు పుస్తకాలను రోమన్ తెలుగు (తెలుగు వాక్యాలను ఇంగ్లీసు లిపిలోకి మార్చటం)లో ప్రచురించి ఇస్తే, మన భాష మరికొన్ని వందల ఏళ్ళు నిలిచి ఉంటుంది. మన తెలుగు చాటువులు, సామెతలు, జాతీయాలు, పద్యాలు, పాటలు, ఆంగ్ల లిపిలోకి మార్చి భధ్రపరచటం వల్ల తెలుగు అంతరించి పోకుండా కాపాడవచ్చు. ఎన్నో భాషల బైబిళ్ళు రోమన్ లిపిలోకి మార్చారు.
ఉద్యోగాల కోసం, గౌరవం కోసం, పాలనా సౌలభ్యం కోసం అంతా ఇంగ్లీషు వైపు ఎగబడి పరుగులుతీస్తున్నారు. కాబట్టి, మన రాష్ట్రప్రభుత్వం కూడా ప్రజల ఆంగ్ల కాంక్షకు అనుగుణంగానే నడుచుకుంటున్నది కాబట్టి, మన భాషను ఇంకొంత కాలం రక్షించుకోటానికి ఆఖరి ప్రయత్నంగా ఈ రోమన్ తెలుగులోకి మన మంచి పుస్తకాలను మార్పించి పుణ్యం కట్టుకోవాలి.
ఈనాడు మన శాసనసభలో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గారు, జానారెడ్డిగారు, రోశయ్య గారు, ధర్మాన ప్రసాదరావు గారు ఇంకా ఎంతో మంది శాసనసభ్యులు చక్కని తెలుగులో సుళువుగా మాట్లాడుతున్నారు. తెలుగు ప్రజలు వారిమాటల్ని ఆనందంగా ఆలకిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. కారణం వీళ్ళందరూ గ్రాంధికంలో కాకుండ వాడుక భాషలో మాట్లాడుతున్నారు. వీళ్ళువాడే వాడుక పదజాలంతోటే చట్టాలు తయారైతే తెలుగు జాతికదే పదివేలు.
ప్రక్కన కర్ణాటకలో నాలుగవ తరగతివరకు కన్నడంలో ప్రాధమిక విద్యా బోధన తప్పనిసరి చేశారు. మహారాష్ట్రలో ఎనిమిదవ తరగతి వరకు మరాఠీ భాషను నిర్భంధం చేశారు. తమిళనాడులో ప్రభుత్వ పాఠశాలల్లోగానీ ప్రభుత్వ సహాయం పొందే ప్రైవేటు పాఠశాలల్లోగాని ఆంగ్ల మాధ్యమం అనుమతించడం లేదు. పైగా ఇంజనీరింగ్, వైద్య శాస్త్రాల్లో కూడా తమిళ మాధ్యమం ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. మన ఇరుగు పొరుగు రాష్ట్రాలు వారివారి భాషల రక్షణ కోసం ఇలాంటి చర్యలు తీసుకుంటుంటే, 'ఆంగ్ల ప్రదేశ్'' సాధన కోసం మన వాళ్ళు శక్తివంచన లేకుండా కృషి చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచారు.
'తెలుగుతల్లి' అని ఎంతో గౌరవంతో మన భాషను పిలుచుకుంటున్నాం. కన్న తల్లిలాగా మన భాషను గౌరవించాలనుకున్నాం కాబట్టి మన బాసకు తెలుగుతల్లి అనే పేరు పెట్టాం. తన తల్లి బాగోలేదని మరొకడి తల్లిని గౌరవించేవాడిని ఏమనాలి? తన తల్లిని పస్తులుంచి మరొకడి తల్లికి భోజనం పెట్టే వాడిని ఏమనాలి? తన తల్లి రోగాలతో కృశిస్తుంటే మరొకడి తల్లికి బలవర్ధక ఔషధాలను సమకూర్చే వాడిని ఏమనాలి? నీ వంటికి బట్టలుకూడా పెట్టకుండా ఆంగ్లామ తల్లికి అలంకరణలు చేస్తూ ఉన్న నీ తెలుగుబిడ్డల్ని ఏమనాలో నీవే చెప్పు తెలుగుతల్లీ!
(గీటురాయి 16-7-2004)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి