29.వాపు కాదు బలుపే
కాలగమనంలో ప్రతి భాషా మారుతూనే ఉంది. ఇతర భాషల నుంచి మాటలను తనలో విలీనం చేసుకుంటూ అభివృద్ధి చెందుతోంది. కొత్తదనాన్ని సంతరించుకుంటోది. ఇతర భాషల నుంచి అవసరాన్ని బట్టి మాటలను చేర్చుకోటం ప్రతి భాషకు అవసరం. ఇందులో తప్పు పట్టడానికేమీ లేదు. అయితే కొందరు సంప్రదాయ వాదులు ఇటువంటి మార్పును సహించలేరు. భాష అభివృద్ధి చెందుతుందని కాక భ్రష్టుపట్టిపోతుందని వారు బాధపడుతుంటారు. కాని అటువంటి బాధ అర్థం లేనిది. రోజురోజుకూ ప్రపంచం కొత్తదనంతో పల్లవిస్తూ ఉంటుంది. కొత్త అభిప్రాయాలు కలుగుతుంటాయి. కొత్త సంఘటనలు సంభవిస్తాయి. నూతన వస్తువులు పుట్టు కొస్తుంటాయి. వీటన్నిటి కోసం కొత్త మాటలు వెతుక్కోవాల్సి ఉంటుంది. అవసరమైతే ఇతర భాషలలోని పదాలను స్వీకరించాల్సి ఉంటుంది. ఇటువంటివన్నీ సహజ పరిణామాలే. అవసరం ఉన్నా లేకపోయినా ఇతర భాషలకే ప్రాధాన్యం ఇస్తూ పరభాషా మోజును పెంచుకుంటూ మాతృభాషను చులకనగా చూడటం మాత్రం తగని పని. ఇతర భాషలు సొంత భాషపై పెత్తనం చేసే పరిస్థితినీ కల్పించకూడదు.
ఏ భాష అయినా ఒక నది వంటిది. నదులు తమ ప్రవాహ వేగంలో ఇతర ఉపనదులను కలుపుకొని మహానదులుగా మారి కదిలిపోయినట్లుగా భాషలు కూడా ఇతర భాషల్లోని పదాల నెన్నిటినో తమలో విలీనం చేసుకొని విస్తరిస్తుంటాయి. సంస్కృత, ఇంగ్లీషు, హిందీ, ఉర్దు, పారశీక భాషలలోని ఎన్నో పదాలు తెలుగులో కలిసిపోయి తెలుగు మాటలుగానే చెలామణీ అవుతున్నాయి.
ఇతర భాషా పదాలను తనలో కలుపుకోటంలో ఇంగ్లీషు మరీ ముందంజలో ఉందని చెప్పాలి. మొదటినుంచీ ఇంగ్లీషు అనేక భాషల సమ్మేళనంగానే వర్థిల్లుతూ వచ్చింది. ఇటీవల ఆ ధోరణి మరీ ఎక్కువైంది.
ఈ విధంగా అన్యభాషా పదాలను ఇంగ్లీషులోకి చేర్చుకోవటం వల్ల ఆ భాష తన స్వచ్ఛతను కోల్పోతుందనీ ఆ విధంగా సాధించే అభివృద్ధి వాపే కాని బలుపు కాదని సంప్రదాయవాదులు ఆ వాదనతో ఏకీభవించటంలేదు. దేశాల మధ్య దూరాలు తగ్గిపోతూ ప్రపంచమంతా ఏకమవుతున్న ఈ తరుణంలో ఇతర భాషలలోని పదాలను తనలో ఐక్యం చేసుకుంటూ ఇంగ్లీషు గణనీయమైన అభివృద్ధిని సాధిస్తోందని ఇది బలుపే కాని వాపు కాదని వారంటున్నారు!
(ఈనాడు సంపాదకీయం 25 జూలై 2004)
''దేశభక్తి అంటే మాతృభాష విూద అభిమానమే. మాట్లాడుతున్న భాషను కాదని మృతభాషను పూజించటం ఎలాంటిదంటే, ఆకలితో మాడిచస్తున్న సాటిమనిషికి అన్నంపెట్టకుండా, చనిపోయిన వారి పేరుతో శ్రాద్ధభోజనం పెట్టడం లాంటిది''. - గిడుగు వేంకటరామమూర్తి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి