21.ఆంగ్లప్రదేశ్‌కు స్వాగతం
''విశాఖపట్నం కార్పోరేషన్ పరిధిలోని 97 ప్రాధమిక పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి 1, 2 తరగతుల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన ప్రారంభిస్తారు. దశలవారీగా అన్ని తరగతులకు ఇది విస్తారిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్ని పూర్తి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళుగా మార్చడం మన రాష్ట్రంలో ఇంతవరకు ఎక్కడ జరగలేదు. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇలాంటి విధానం అమల్లో లేదు. ఆ ఘనత పూర్తిగా విశాఖ నగరపాలక సంస్థకే దక్కుతుంది. వాస్తవానికి ఇంగ్లీష్ మీడియం బోధనకు నగరపాలక సంస్థ గత సంవత్సరమే శ్రీకారం చుట్టింది. కార్పోరేషన్ హైస్కూళ్ళలో ఆరు ఏడు తరగతుల పిల్లలకు ఆంగ్లంలో బోధన ప్రారంభించింది. చిన్నప్పటినుంచే ఇంగ్లీషులో బోధిస్తేనే ప్రయోజనం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నగర పాలక సంస్థ కమీషనర్ శ్రీకాంత్ వివరించారు. కార్పోరేషన్ స్కూళ్ళలో ఇకపై అన్ని సబ్జెక్టుల్ని ఆంగ్లంలోనే బోధిస్తారు. తెలుగు ఒక పాఠ్యాంశంగా మాత్రమే ఉంటుంది. ఒకటి, రెండు తరగతులకు బోధిస్తున్న 150 మంది టీచర్లకు ఇంగ్లీష్ మీడియంలో బోధింటానికి ప్రైవేటు పాఠశాలల టీచర్లతో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తారు.'' (ఈనాడు, విశాఖపట్నం 22-5-2005)
''గవర్నమెంటు డిగ్రీ కాలేజీల్లోని మన ఇంగ్లీషు లెక్చరర్లకు యాంకీ యాక్సెంట్ (అమెరికన్ యాస) నేర్పటానికి త్వరలో హైదరాబాదుకు అమెరికా నుంచి నిపుణులు రాబోతున్నారు. కాలేజీ విద్యా కమీషనరేట్ ఉద్యోగులు వివిధ కాలేజీల నుండి లెక్చరర్లను ఈ శిక్షణ కోసం ఎంపిక చేస్తున్నారు. మన ఇంగ్లీషు లెక్చరర్లకు ఇంగ్లీషు ఎంత బాగా వచ్చినా ఆంగ్లేయుల యాస రాలేదు. పిల్లలకు ఈ తప్పుడు యాసే వీరు నేర్పుతున్నారు. పిల్లలందరికీ సరైన అమెరికన్ ఉచ్ఛారణ నేర్పటం కంటే గురువులందరికీ నేర్పితే శిష్యులకు వాళ్ళే నేర్పుకుంటారు అని ఓ అధికారి అన్నాడు''. (డక్కన్ క్రానికల్ 28-5-2005)
తన దూడ పొదుగు కుమ్మి పాలు తాగితే ఊరుకుంటుంది గాని, పరాయి దూడ పాలు తాగితే ఉరుకుంటుందా? జంతువు కూడా తన పరబేధం పాటిస్తుంది. తెల్ల వాడు పాటిస్తున్నాడు కాని తెలుగువాడే విచిత్రంగా వ్వవహరిస్తున్నాడు. ఇది తన చేతగాని తనమా లేక వెర్రి వ్యామోహమా అర్ధం గావటం లేదు. ఏ లాభం లేకుండా అమెరికా వాళ్ళు మన పిల్లలకు, పెద్దలకు తమ భాషను ఎందుకు నేర్పుతారు? దోచుకునే స్వభావం ఉన్నవాళ్ళకు దోచిపెట్టే బుద్ధి ఉంటుందా? తమ భాష ద్వారా ఆంగ్లేయులు ప్రపంచాన్ని ఏలగలుగుతామని సగర్వంగా చెప్పుకుంటున్నారు. అందుకోసం నిరంతరము శ్రమ పడుతున్నారు. 'కృషితో నాస్తి దుర్భిక్షం' అని చెప్పుకునే మనం మన తెలుగు భాష రోజురోజుకి కృషించిపోవటానికి అన్ని విధాలా కృషి చేస్తున్నాం. తనను గట్ట తాళ్ళు తానే తెచ్చుకున్నట్లు తెలుగువాడు ప్రవర్తిస్తున్నాడు. కారణాలేమిటి?
''పరువు మాలిన నీ యనాదరణ కతన,
మేటి నీ భాష పొలిమేర దాటలేదు'' -గుర్రం జాషువా, తెలుగు వెలుగు
''ఇందులో ఏదో ఉందిరోయ్ అని మూర్ఖులు భయపడేటట్లు భాష ఉన్నప్పుడే మూర్ఖులు దణ్ణం పెట్టి ఒప్పుకునేది'' -భమిడి పాటి, తుక్కుముక్కల హక్కు చిక్కు
''మనుష్యుడు ఇంత భాషను పెంచుకున్నది ఆలోచనలు కలవ కుండా ఉండేందుకా? -మహీధర, దేశంకోసం
ఈ మూడు ముక్కల్లో 1. పరువుమాలిన తనం 2. అనాదరణ 3. పొలిమేర దాటకపోవటం 4. పరాయి భాషలోనే పాలించే సత్తా ఉందనే భావన 5. పాలకుల భాష సామాన్య ప్రజానీకానికి అర్ధం కాకుండా ఉండాలనే తత్వం కారణాలుగా కనిపిస్తున్నాయి, వీటికి విరుగుడు చర్యలు ఏ పాలకులు అమలు చేస్తారో ఆ పాలితులు సుఖపడతారు. ఆ ప్రజలు గౌరవించబడతారు. ఆ ప్రజల సహజసిద్ధ జ్ఞానం అభివృద్ధి చెంది గొప్ప శాస్త్రవేత్తలు తయారౌతారు. అనుకరణకు బదులు అన్వేషణ మొదలౌతుంది.
1. పరువు నిలపాలి : ప్రతి వ్యక్తి మాతృభాషకు ఏదో ఒక స్థాయి పరువు ఉంటుంది. పరువు బాగా ఉంటే ప్రతిష్ట అదే వస్తుంది. భాష మాట్లాడే జనానికి ముందు ఆ భాష మీద గౌరవాభిమానాలు ఉంటే వాళ్ళు ఆ భాష పరువు నిలబెడతారు. తమ భాష మీద తమకే చిన్నచూపు ఉంటే, తమ భాష కంటే పరాయి భాషే గొప్పదని వాళ్ళు భావిస్తే, తమ భాష పరవు తీస్తారు, పరభాషా వ్యామోహులై తమ భాషను నాశనం చేసుకుంటారు. సొంత ఇంట్లోనే గౌరవం పొందలేని భాషకు పరువుపోతూ ఉంటుంది. తెల్లవాడు ఇంగ్లీషు పరువు నిలపటానికి ఏమేం పనులు చేశాడో, తెలుగు వాడు కూడా ఆయా పనుల్ని చేయాలి.
2. ఆదరించాలి: సొంత భాషలో చదువు నేర్పాలి. ఇంటి భాషగాని ఎటువంటి యాస గాని నిఘంటువులో చేర్చాలి. చదువులో, పాలనలో పరిశోధనల్లో సొంత భాషను బాగా వాడాలి. ఇప్పుడు దేశంలో ఇంగ్లీషును ఆదరించినంతగా తెలుగును కూడా ఆదరించాలి. తెలుగు మీడియంలో చదివినా ఉద్యోగాలొస్తాయనే వాతావరణం కల్పించాలి.
3. పొలిమేర దాటాలి: ఇంగ్లీషు తన జన్మస్థానాన్ని దాటి ప్రపంచ వ్యాప్తం అయ్యింది. అరబీ తన స్వస్థలాన్ని దాటి ప్రపంచ వ్యాప్తం అయింది. ఇలా పొలిమేరలు దాటి మిగతా ప్రాంతాలను ఆక్రమించిన భాషలే రాజ్యాలు ఏలుతున్నాయి. దేశమంతటా హిందీ రాజభాషగా అమలవుతూ పొలిమేరలు దాటింది. దేశంలో రెండవ జాతీయ అధికార భాషగా తెలుగు అమలుకావాలి. ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో తెలుగు నేర్పే వాళ్ళను ప్రోత్సహించాలి. ఇంగ్లీషు నేర్చుకోవటానికి ఎందుకు జనం ఎగబడుతున్నారో, అందుకే తెలుగు నేర్చుకోవటానికి కూడా జనం ఎగబడేలా చెయ్యాలి. ప్రపంచీకరణ ప్రక్రియ ద్వారా 15వ స్థానం నుండి 10వ స్థానానికి క్రమంగా ఎగబాకాలి.
4. పాలించే సత్తా తేవాలి: శాస్త్ర సాంకేతిక విద్యలు, చట్టాలు, శాసనాలు, కోర్టు తీర్పులు, ఇంగ్లీషులో ఎలా సునాయాసంగా సాగిపోతున్నాయో, అవన్నీ తెలుగులో కూడా అంత సులువుగా అమలు చేసే సత్తా తెలుగువాళ్ళకుందని నిరూపించుకోవాలి. తెలుగు సుతిమెత్తని భాషే కాదు తెలుగు వాడి జీవన రంగాలన్నింటిలో అలవోకగా అమలు చేయగల భాష కావాలి. సంస్కృత మంత్రానికి, ఇంగ్లీషు తీర్పుకు, అరబీ సూరాలకు ఎంతటి సత్తా ఉందో తెలుగులోని వాటికీ అంతటి సత్తా కావాలి.
5. ప్రజలకు అర్ధం కావాలి: పురోహితుల భాష, పండితుల భాష, పాలకుల భాష, ప్రత్యేకంగా ఉంటే, అది పామరులైన ప్రజలకు అర్ధం కాకుండా ఉంటే, వాళ్ళ ఆలోచనలు కలవవు. జాతి ఐక్యంగా పురోగమించదు. అధికారి రాసిన రాత పల్లెటూరిలో నివసించే నిరక్షరాస్యుడికి సయితం వినిపించినప్పుడు అర్ధమవుతూ ఉంటే ఆ పాలన ప్రజారంజకంగా ఉందని అర్ధం. క్రమేణా ఆ ప్రజల భాషా సంపద పెరుగుతుంది. పరిపాలన పారదర్శకంగా ఉంటుంది. ప్రజలు తమ భాషలో విన్నపాలు చేసుకుంటారు. తమ భాషలో నిలదీస్తారు. తమ భాషలోనే తీర్పులు తెచ్చుకుంటారు. ప్రజా జీవితంలోని అన్ని కార్యకలాపాలు తమ భాషలోనే స్వయంగా నిర్వహించుకుంటారు. అంతకంటే అదృష్టం ఏముంటుంది?
కాకపోతే మొదటి నుంచీ చెప్పుకుంటున్నట్లే పైన చెప్పిన అయిదు పనులూ మనవాళ్ళు తెలుగు భాష కోసం చేయకుండా ఇంగ్లీషు కోసం చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు. ఆంధ్రులు ఆంగ్లాన్ని ఆదరించారు. దాని పరువు పెంచారు. పొలిమేరలు దాటి ఆంగ్లాన్ని బ్రతుకు తెరువు చూపే భాషగా వాడుతున్నారు. ఆంగ్లంతోనే పాలిస్తున్నారు. అసలు ఆంగ్లంలో మాట్లాడితేనే ఒకరికొకరు అర్ధం అవుతున్నారు. ఇక ప్రైవేటు స్కూళ్ళతో పోటీపడి ప్రభుత్వ స్కూళ్ళలో కూడా తెలుగు బాలలకు ఇంగ్లీషు ఉగ్గుపాలు పడుతున్నారు. డబ్బురాని తెలుగు విద్య దారిద్య్రానికే అనే సంగతి బాగా గ్రహించారు. అందుకే ఆంధ్ర ప్రదేశ్ ను ''ఆంగ్లప్రదేశ్'' గా మార్చే పని తలకెత్తుకున్నారు.
''కంచెయే నిజముగా చేసు మేసిన కాదనువారెవరు
రాజే ఇది శాసనమని పలికిన ప్రతిఘటించువారెవరు'''
( గీటురాయి 1-7-2005)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి