5. శ్రీకృష్ణ దేవరాయలు ఇప్పుడుంటే ఏం చేస్తారు?
శక్తి చాలనివాడు సాధుత్వం వహించినట్టుగా ప్రాంతీయ భాషలన్నీ జాతీయ భాషను, అంతర్జాతీయ భాషనూ నెత్తిన మోస్తూ ఇచ్చిన కూలీ తీసుకొని బతకవలసిందే గాని, మరో మార్గంలేదు. అమృత భాషలు మృతభాషలు కాలేదా? ఎన్నో భాషామతల్లులు చనిపోయాయి. పేద జనానికి తెలుగు, ధనవంతులుకు ఇంగ్లీషు నేర్పుతూ అంతరాలను కొనసాగిస్తున్నారనే వాదం ఈ మధ్య గట్టిగా వినిపిస్తోంది. ఇంగ్లీషును దేశబాషగా మారిస్తే, ఇంగ్లీషునే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బోధిస్తే, అన్ని కులాల వారు విమానాలెక్కే స్థాయికి వస్తారని కొందరు అంటున్నారు. ఈ రకమైన ఆశ తప్పేమీ కాదు. కానీ ఇంగ్లీషు భాష వల్లనే దళితులు, వెనుకబడిన తరగతుల వారు, ముస్లింలు.. బాగుపడతారా? అభివృద్ధికీ, అంతర్జాతీయ సౌకర్యాలు పొందడానికి ఆంగ్లమే శరణ్యమని ప్రజలు ఎగబడడానికీ కారణాలు ఏమిటి? ఆ కారణాలను అన్వేషించి మన భాషకు కూడా ఆంగ్లమంతటి శక్తిని తెచ్చే ప్రయత్నాలు చేయకూడదా? ఆంగ్లానికున్నంత శక్తి తెలుగుకు రాదా? మన ప్రజలు తలుచుకుంటే ఇది సాధ్యంకాదా?
భాషకూ కులానికీ ముడిపెట్టడం అనవసరం. పెద్ద పెద్ద చదువులు ఇంగ్లీషులో చదివినవాళ్లే అమెరికా వెళ్ళినా కుల సంఘాలు వదలడంలేదు. కులతత్వాన్ని, మత ఛాందసాన్ని ఇంగ్లీష్‌పోగొట్టదు. పైగా తెలుగువాడిని ఇంగ్లీషులో హడలగొట్టే వాళ్ళు తయారయ్యారు. తెలుగు ముస్లింలను ఉర్దూ, అరబీలతో, తెలుగు హిందువుల్ని సంస్కృతంతో బెదిరించి బానిసలుగా చేసినట్టే, తెలుగు ప్రజల్ని నేడు ఇంగ్లీషుతో పాలిస్తున్నారు. అయినా ఇంకా తెలుగు చచ్చిపోలేదు.
దేశానికి లింకు భాష కావలసిరావడమే మన భాషకు దౌర్భాగ్యం. మనదేశ భాషలన్నీ స్వయంపోషకత్వాన్ని కోల్పోయి, వాడిపోయి రాలిపోయే దశకు చేరుకుంటున్నాయి. ఇంగ్లీషు లింకు తెగితే ఆక్సిజన్‌సరఫరా ఆగిపోయినట్లు దేశాలు విలవిలలాడుతున్నాయి. దేశభాషలన్నింటికీ ఇంగ్లీషు సెలైన్‌బాటిల్‌వలె పనిచేస్తోంది. వరల్డ్‌వైడ్‌వెబ్‌లో ఈగల్లా చిక్కుకున్న అన్ని భాషల్నీ ఇంగ్లీష్‌అనే సాలెపురుగు పీల్చి పిప్పి చేసింది. ఇంగ్లీష్‌లేకుండా ఎవరి భాష వాళ్ళకు తెలిసే అవకాశం కూడా లేదనే పరిస్థితి దాపురించింది. ఇవన్నీ నిజాలు. మన భాషను ఇలాంటి స్థితిలో ూద్ధరించడం సాధ్యమవుతుందా? మన భాష ద్వారా ఐఎఎస్, ఐపిఎస్‌అధికారులు రాగలరా? ఉపాధినిచ్చే భాషను ప్రజలు ఎగబడి నేర్చుకుంటారు. లక్షలాది మందికి ఉపాధిని, విజ్ఞానాన్ని అందించగల స్థాయికి మన భాషను తీసుకుపోగలమా? అలాంటి ఆశ, అంకితభావం గల వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మన పొలాన్ని మరొకడికి కౌలికిచ్చి, వాడి దగ్గరే కూలీగా పనిచేస్తున్నట్టుంది మన పరిస్థితి.
1984లో వావిలాల గోపాలకృష్ణయ్య ఇలా అన్నారు.‘‘ఆనాడు మన దేశంలోనే మనం బానిసలం. 1947లో బ్రిటీష్‌వాళ్ళ నుంచి స్వేచ్ఛను పొంది మన భాష అభివృద్ధి చెందుతుం దనుకున్నాం. కానీ మన భాషాభివృద్ధికి అవసరమైన ప్రభుత్వం మనకు రాలేదు. అమెరికా పోయే నలుగురికోసం అంతా ఇంగ్లీష్‌చదవాలా? అమెరికా వెళ్ళే వాడితోపాటు మా ఊళ్లో ూన్న గుమస్తాకు, తలారి కూడా ఇంగ్లీష్‌నేర్పాలట. ఎందుకో మరి? మన ప్రభుత్వం ప్రజలకు అర్థం కాకుండా పోయింది. ఇంగ్లీష్‌మోజు దారులు మాకు ఇంగ్లీష్‌అలవాటైపోయిందండీ అంటారు. మొదట పొరపాటు, తరువాత గ్రహపాటు. ఆ తరువాత అలవాటు. ఈ అలవాటు అనే ప్రమాదకరమైన శత్రువును నిషేధించకపోతే మనం ఇక ఈ స్థితిలో కూడా నిలవం. ప్రజాపాలన ప్రజల మాతృభాషలో ఉండాలి. తెలుగు ఇవాళ చదవకపోతే భాష మరిచిపోతాం. భాష ఎంత మాట్లాడుతుంటే అంత వస్తుంది. ఎన్ని విషయాలు మాట్లాడితే అంత పదజాలం పెరుగుతుంది. మన భాషను నిరంతరంగా వాడితేనే తాజాగా ఉంటుంది, ప్రవహిస్తుంది. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా ఇంగ్లీష్‌వాళ్ళే మనల్ని పరిపాలిస్తున్నట్లుగా ఉంది. కాన్వెంట్‌స్కూళ్ళు అంటువ్యాధికంటే ప్రమాదకరమైనవి. తెలుగురాని పిల్లవాడికి ఇంగ్లీషు నేర్పుతున్నారు. మన భాష ఏమైపోతుంది?
పూజారి నోట్లోని సంస్కృత మంత్రంలా, ముల్లా నోట్లోని అరబీ సూరాలా ఇంగ్లీషు గొప్పశక్తి సంపాదించుకుంది. మంత్రాలొస్తేనే గదా పూజారి అయ్యేది? అలాగే ఇంగ్లీషు వస్తేనే అధికారం, ఉద్యోగం దక్కుతున్నాయి. ఇంగ్లీష్‌వాడికంటే ఎక్కువ జ్ఞానం తెలుగులో సంపాదించినా వ్యర్థం. ఎందుకంటే బోలెడంత విషయ పరిజ్ఞానంతో కూడిన తెలుగుకంటే, అసలు ఏ పరిజ్ఞానం లేకపోయినా సరే. వట్టి ఇంగ్లీష్‌భాష వస్తేచాలు బతుకుదెరువు దొరుకుతుందని హామీ ఇస్తున్నారు. ఆంగ్ల భాషావాదుల అవసరం అలాంటిది మరి! హిందీ, ఇంగ్లీష్‌రాని తెలుగువాళ్ళు ఒంటరి వారిలా బతుకెలా గుడుస్తుందోననే భయంతో ఉన్నారు. పరాజితులు విజేతల భాష నేర్చుకోక తప్పదు. గత్యంతరం లేకే తెలుగు వాళ్ళు హిందీ, ఇంగ్లీషులకు పట్టం గట్టారు. బతుకుదెరువు కోసమే ఆ భాషల పంచన చేరారు. ఇంగ్లీషు గుంపులో చేరితేనే, ‘ఇక ఫరవాలేదు బతుకుతాను’ అనే నమ్మకం కలుగుతోంది. ఇంగ్లీష్‌రాని శ్రీకృష్ణదేవరాయలు ఇప్పుడుంటే ఏం చేస్తారు?
పక్షులు తమ కూతను మార్చుకోకపోయినా వలసవెళ్ళిన ప్రాంతాలనుబట్టి తమ అరుపుల్లో యాసను మారుస్తాయట. అవసరం అన్వేషణకు తల్లి అంటారు. పశువులు, పక్షులే తమతమ భాషలతో ఆటలాడుకుంటుంటే మనిషి ఊరుకుంటాడా? గుంపులు కట్టి కొన్ని భాషల్ని అధికారపీఠం మీద కూర్చోపెడతాడు. కొన్ని భాషల్ని అణిగిమణిగి పడి ఉండమని ఆదేశిస్తాడు. ఒకదానిని దేవభాష అంటాడు. ఒకదానిని అధికారభాష అంటాడు. మరొకదానిని బానిస భాష, పనికిమాలిన భాష అంటాడు. ఏమైనా శక్తిచాలనివాడు సాధుత్వం వహించినట్టుగా ప్రాంతీయ భాషలన్నీ జాతీయ భాషను, అంతర్జాతీయ భాషనూ నెత్తిన మోస్తూ ఇచ్చిన కూలీ తీసుకొని బతకవలసిందేగాని, మరో మార్గం లేదు. అమృతభాషలు మృతభాషలు కాలేదా? ఎన్నో భాషామతల్లులు చనిపోయాయి. అమ్మా తెలుగుతల్లీ, ఇక చచ్చిపో. ఎంతకాలం మంచం మీద రోగిష్టిలా ఉంటావ్! నిన్ను బాగుచేయించే ఆర్థిక స్థోమత మాకులేదు. అంత గొప్ప వైద్యమూ లేదని స్పెషలిస్టులూ తేల్చిచెప్పారు. నీవు ఇంట్లో వాళ్ళందరికీ అడ్డమైపోయావు అని నీ పిల్లలే విసుక్కుంటున్నారు. మొండి ప్రాణమే తల్లీ నీది. నీమీద మాకు ఎంత ప్రేమ ఉన్నా ఏమీ చేయలేని అశక్తులం. బానిసలం. రెక్కాడితేగాని డొక్కాడని వలసకూలీలమయ్యాం. నిన్ను పోషించనందుకు మమ్మల్ని క్షమించమ్మా!
(12.9.2008, గీటురాయి వారపత్రిక,7.10.2006 వార్త)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి