18, జులై 2012, బుధవారం

తెలుగు భాష విశిష్టత

                                                    1.తెలుగు భాష విశిష్టత
*తెలంగా, తెలింగా, తిలాంగ్‌ అనేవి జాతికి, భాషకి, లిపికీ పేర్లు. తెలుంగులు వ్రాసే లిపిని ఆంధ్రీ లిపి అంటారు.                        -అల్‌ బెరూనీ క్రీ.శ.1014
*తెలుగు తూర్పు దేశాలలో ఇటలీభాషలాంటిది            -నికొలాకాంటి 1420
*తెలుగులిపి ఒరియా లిపిలాగా గుండ్రంగా ఉంటుంది. గంటంతో అడ్డగీతలు గీస్తే తాటాకు చినిగి పోతుంది కాబట్టి గుండ్రంగా రాసేవాళ్ళు.      -జె.డి. ఆండర్‌సన్‌ 1913
*దేశభాషలందు తెలుగులెస్స     -శ్రీకృష్ణదేవరాయలు
*తెలుగు కష్టమయిన భాషే కానీ సంస్కారయుతమైన భాష. భావాలను సొంపుగా సౌలభ్యంతో చక్కగా వ్యక్తం చేయవచ్చు.                        -విలియంకేరీ 1814
*శబ్ద సంపదలో, శబ్దసౌష్టవంలో, భావ వ్యక్తీకరణంలో, శ్రావ్యతలో తెలుగుతో మిగతా దేశ భాషలు సాటిరావు. వీనుల విందుగా ఉండబట్టే తెలుగును ఇటాలియన్‌ ఆఫ్‌ది ఈస్ట్‌ అన్నారు. తెలుగు భాష అభివృద్ధి చెందుతున్న కొద్దీ తనకు దగ్గరగా వచ్చే చాలా శబ్దాలను ఆయా ప్రాచీన కావ్యభాషల నుండి గ్రహించింది కాబట్టి ''ఇంగ్లీష్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌'' అనవచ్చు. సంస్కృతం తనంతటతాను వాడుక భాష కాలేకపోయింది. కానీ సరళమయిన సులభ మయిన తెలుగు భాష ద్వారా సంస్కృతం వాడకంలోకి వచ్చింది.    -ఎ.డి.క్యాంప్‌బెల్‌ 1816
*అన్ని ప్రాంతీయ భాషలకంటే జెంటూ (తెలుగు) భాష మధురమైనది. -మూల్‌బర్నెల్‌ 1837
*తెలుగు భాషలో అచ్చులు ఎక్కువగా ఉండటం వలన ఇటాలియన్‌ ఆఫ్‌ది ఈస్ట్‌ అనే పేరు వచ్చింది. -మోనియల్‌ విలియమ్స్‌ 1878
*ద్రావిడ భాషల్లో తెలుగే అతిమధురమైనది ప్రాచీనతలో రెండవది     - రెవరెండ్‌ రాబర్ట్‌ కాల్‌వెల్‌ 1857
*తెలుగు వీనులకు విందు. ద్రావిడ భాషల్లోకెల్లా మధురాతి మధురం. చదువురానివాడు మాట్లాడినా చెవుల కింపుగా ఉంటుంది. దీనిని ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌ అనడం ఎంతో సమంజసం.   - హెన్రీమోరిస్‌ 1890
*తూర్పు దేశాల భాషల్లో కెల్లా తెలుగు అతి మృదువైన భాష. తెలుగువారి సంస్కృతోచ్చారణ కాశీ వాసుల సంస్కృతోచ్ఛారణ లాగా ఉంటుంది.   -మాన్యువల్‌ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌, మద్రాసు 1893
* ద్రావిడ భాషల్లో కెల్లా తెలుగే శ్రావ్యమైనది. ప్రతిపదం అజంతం. అందుకే అది ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌ అనిపించుకుంది                         -జి.ఎ.గారిసన్‌, 1906
* తెలుగు ద్రావిడ భాషా కుటుంబంలో ఉత్తరాదిది. ఆర్య భాషా కుటుంబంలో దక్షిణాదిది. రెంటిలక్షణాలూ కొద్దిగా దీనిలో ఉన్నాయి. పొందిక గల శక్తి వంతమయిన భాష, వ్యాకరణ సౌలభ్యం గల భాష ఇతర భాషల్ని తేలికగా తనలో కలుపుకుంటుంది. సహజంగా శ్రవణానందకరంగా ఉంటుంది. పరభాషా పదాలను ఉపయోగించినా ఔదార్యంతో అన్ని భాషలను స్వీకరిస్తుంది. దానికి సంకుచితత్వం లేదు.-జి.హోమ్‌ ఫీల్డ్‌ మెక్‌లాయిడ్‌ 1958
* బ్రిటీష్‌ పరిపాలన అంతమయి ఆంధ్రులకు ప్రత్యేకరాష్ట్రం ఏర్పడ్డనాడు వారి భాషలోనే వారిపాలనా వ్యవహారాలు సాగించడానికి తప్పక ప్రయత్నం చేయాలి. -ఆర్‌.కాలెట్టిల్‌ 1935
* భారతీయ భాషలన్నింటిలోకీ, పరభాషాపదాలను తెలుగు గ్రహించినంత సులభంగా మరే భాషా స్వీకరించలేదు. కాబట్టి ఎప్పటికైనా సైన్సు, మెడిసిను,ఇంజనీరింగ్‌ల బోధనలో హిందీకి తెలుగే ధీటైన ప్రత్యర్ధి అవుతుంది. జాతీయ భాషకు కావలసిన అన్ని లక్షణాలు తెలుగు భాషకు ఉన్నాయి.               -జె.బి.యస్‌.హాల్‌డేన్‌ 1958
* సుందరమైన తెలుగు పాట పాడుతూ సిందూ నదిలో పడవ నడుపుదాం       -సుబ్రహ్మణ్య భారతి
* ఏ భాష చెణుకైన, ఏ యాస చినుకైన  తనలోన కలుపుకొని తరలింది తెలుగు   -సి.నారాయణ రెడ్డి
* తక్కిన ద్రవిడ భాషలకు మహానిఘంటువులు సిద్దమయినాయి గానీ, తెలుగువారి దురదృష్టమేమో! తెలుగు భాషకు లేవు. వేదం వేంకటరాయ శాస్త్రి, గిడుగు వేంకట రామమూర్తి వంటి మహా విద్వాంసులను కాదని సూర్యరాయాంధ్ర నిఘంటువును సిద్ధం చేసి నవ్వుల పాలయినారు, ఆంధ్ర సారస్వత పరిషత్తు వారు తెలుగు అకాడవిూ ఏర్పడ్డ తరువాత శబ్దసాగరమని ఒక మహానిఘంటువు నిర్మించాలని ప్రయత్నించారు గాని అఖండ భాషాభిమానులయిన పాలకులు అది నెరవేరకుండా శక్తి వంచన లేకుండా శ్రమించారు.    -బూదరాజు రాధాకృష్ణ 2001
* తల్లిపాలతో తేన్చిన తెలుగు భాష
సర్వభావాలకు రుచులు నేర్పిన అమృతాంగి
ఎంత చక్కని నాదం నా తెలుగు భాష
మాటలు మందారాలు-పదాలు సుందర శిల్పాలు
నాతల్లి నాకందం - నా భాష నాకానందం
నా భాషా రవళే నా జీవన హేళి                     -గురుకులమిత్రా 1998

    1961 సెన్సస్‌లో తెలుగుజనం తమ మాతృభాషగా చెప్పుకొన్న తెలుగు యాసలు:- తెలుగు, ఆంధ్ర, బేరాది, బుడబుక్కల, చెంచు, డొక్కల, దాసరి, దొమ్మరి, ఎకిడి, గొడారి, గోలారి, జోగుల, కామాటి, కమ్మర, కాశీకావిడి, కొడువ, కొండరెడ్డి, మేదరి, మాలబాస,  మాతంగ,  నగిలి,  పద్మశాలి, పిచ్చుకుంట్ల, పాముల, సగర, వడగ, వడరి, వాల్మీకి, యానాది, తెలంగాణా, బగట తెలుగును తమిళులు 'వడుగ' అంటే ఒరిస్సా వాళ్ళు 'బడగ' అంటారు.

3 కామెంట్‌లు:

  1. తెలుగే దేవభాష --- ఆచార్య ప్రభోదానంద యోగి
    "భాష అనగా భావమును వ్యక్తము చేయునది మాత్రమే.భాషలో అక్షరములుండవచ్చును, ఉండక పోవచ్చును.ముందు 'భాష' పుట్టుతుంది.తర్వాత 'లిపి' పుట్టుతుంది.ప్రపంచ వ్యాప్తముగా యున్న భాషలు 7,105 కాగా అందులో లిపి యున్నవి 3,570 భాషలు.లిపి లేని భాషలు 696.మిగతా 2839 భాషలు మారుమూల ప్రాంతములలో తక్కువ జనాభా మధ్య గలవు.కొన్ని భాషలు లిపిలేనివయినా భావము మాత్రము శబ్దముతోనే యుండుట వలన ఆ శబ్దమును భాష అని అన్నారు.తెలుగు భాష ''జ్ఞానచిహ్నము''గా భూమి మీద తయారయినది కానీ ఆ విషయము ఇంతవరకు ఎవరికీ తెలియదు.మన భాషకు ''తెలుగు'' అని పేరు పెట్టిన వాడు సూర్యుడని ఎవరికీ తెలియదు.నేడు సూర్యునకున్న పేర్లన్నీ తెలుగు భాషలోనివే. ఆదిత్యుని చేత పేరు పెట్టబడిన ఆదిభాష 'తెలుగు'. చాలా భాషల పేర్లలో అర్థము లేదు. అట్లే భాషయొక్క లిపిలో కూడా అర్థము లేదు. భాషకు అర్థము, మరియు భాషయొక్క లిపికి అర్థము ఒక్క తెలుగు భాషకే ఉంది ,ప్రపంచములో మొదట పుట్టిన భాష తెలుగు భాష అయినందున, సూర్యుడు భూమిమీద తన జ్ఞానమును తెలుగు భాషలోనే తెలియజేసియుండుట వలన, తెలుగు భాష దైవజ్ఞానమునకు దగ్గరగా అర్థములను కలిగియుండుట వలన తెలుగు భాషను అన్ని విధములా దైవభాషగా చెప్పవచ్చును.తెలుగు భాష ప్రపంచములో మొట్టమొదట పుట్టిన భాష. అయినా ఆనాడు భాషకు పేరులేకుండాయుండెడిది.సంస్కృతము చాలా వెనుక పుట్టినదని తెలియవలెను. తెలుగు భాషలో యున్నన్ని అక్షరములు మరి ఏ ఇతర భాషలో లేవు. అందువలన ఏ చిన్న శబ్దమునయినా, ఎంత కఠినమైన శబ్దమునయినా తెలుగు భాషలోని లిపి వలన వ్రాయవచ్చును.సంస్కృత భాషకు లిపిలేదు.సంస్కృతమును వ్రాయుటకు ఇతర భాషలను వాడుకోవలసి వచ్చినది. భాష అన్న తర్వాత అది భావమును తెలుపుటకే ఎక్కువగా ఉపయోగపడవలసి యుండగా, సంస్కృత భాష మాత్రము భావమును తెల్పు సందర్భములలో బహుతక్కువగా వాడబడుచున్నది.అర్చనలందును, పొగడ్తలందును, మంత్ర జపములందును వాడుకొంటున్నారు.అంతేకాక మొదట పుట్టిన తెలుగు భాషలోని పదములను ఎక్కువగా సంస్కృతములో పెట్టుకోవడము జరిగినది.ప్రపంచములో మొదట పుట్టిన భాష తెలుగు. ప్రపంచములో అన్నిటికంటే పెద్దదయిన బ్రహ్మవిద్యను చెప్పబడిన భాష తెలుగు.ప్రపంచములోని ఎన్నో భాషలలో తెలుగు భాషా బీజములు కనిపించుచున్నవి.తెలుగు పదములు అన్ని భాషలలో ఉన్నాయి. తెలుగు కంటే పెద్ద భాష ఏదీ లేదు.వాస్తవానికి ప్రపంచ భాషలన్నిటికీ రాజుగా ,చక్రవర్తిగా తెలుగు భాష ఉండాలి.శ్లోకము తప్ప పద్యము వ్రాయుటకు పనికిరాని సంస్కృతము కంటే పద్యమును శ్లోకమును రెండిటినీ వ్రాయగల తెలుగే గొప్ప.ఆధ్యాత్మికమునకు తెలుగులో యున్నంత అర్థము, వివరము వేరే భాషలో లేదు.''ఆత్మ'' అను పదము తెలుగు భాషలోనే పుట్టినది.వాస్తవముగా తెలుగు భాష దైవభాషయే". --- ఆచార్య ప్రభోదానంద యోగి (లు అంటే ఏమిటి? 2016)

    రిప్లయితొలగించండి