20.అధికార భాషా సంఘానికి అధికారం కావాలి!
రాష్ట్ర అధికార బాషా, సంఘం ప్రస్తుత అధ్యక్షుడు ఏబికె ప్రసాద్‌గారు ప్రభుత్వానికి కొన్ని మంచి సిఫారుసులు చేసారు. (ఈనాడు: 19-5-2005)
1) తెలుగు మీడియంలో చదివిన వారికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలి. 2) ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలల్లో కూడా అన్ని స్థాయిల్లో పదో తరగతి వరకు తెలుగు మీడియం ఉండాలి. 3) వ్యాపార సంస్థలు, దుకాణాలన్నీ తెలుగులో బోర్డులు ఏర్పాటు చేయకపోతే వాటి లైసెన్సులు రద్దు చేసే అధికారం కన్నడ అధికార భాషా సంఘానికి ఉన్నట్లుగా, తెలుగు అధికార భాషా సంఘానికి కూడా ఉండాలి. 4) తమిళాన్ని ప్రాచీన భాషగా గుర్తించిన పద్ధతిలో తెలుగును కూడా ప్రాచీన భాషగా కేంద్రం గుర్తించాలి. దీని కోసం రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చెయ్యాలి. 5) తమిళనాడులో తెలుగు మాట్లాడే వాళ్ళు రెండవ స్థానంలో ఉన్నందున ఆ రాష్ట్రంలో తెలుగును రెండవ అధికార భాషగా ప్రకటించాలి. 6) రాజ్యాంగంతో సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలను వాడుక బాషలోకి తేవాలి. 7) ఎనిమిదో షెడ్యూల్డ్‌లో పేర్కొన్న బాషలన్నిటినీ అప్పటికప్పుడు తర్జుమా చేసే విధంగా పార్లమెంటులో ఏర్పాటు చేయాలి. 8) స్థానిక న్యాయస్థానంలో తీర్పులు అధికార భాషలో ఉండేలా చర్యలు తీసుకోవాలి. 9) మండల స్థాయి నుండి సచివాలయం వరకు అధికార భాషను అమలు చెయ్యని అధికారులపై చర్యలు తీసుకునే అధికారం అధికార భాషా సంఘానికి ఇవ్వాలి.
వావిలాల గోపాలకృష్ణయ్య గారి దగ్గర నుండి ఏబికె ప్రసాద్ గారి వరకు అధికార భాషా సంఘం అధ్యక్షుల్లో ఎక్కువ మంది ఈ కోర్కెలను పదేపదే ప్రభుత్వానికి విన్నవించారు కాని ఫలితం దక్కలేదు. ఇవి కొత్తగా కోరిన కోర్కెలు కావు. దీర్ఘకాలంగా అమలుకు నోచుకోని తెలుగు ప్రజల డిమాండ్లు. ఇప్పటికైనా పాలకులు ఈ కోర్కెలు తీర్చి తెలుగుకు అధికారం ఇస్తారని ఆశిద్దాం!
భాషను వాడటానికి అనుకూలంగా మార్చినపుడు ప్రజలే ఆ భాషను అధికారంలోకి తెస్తారు. వాడకానికి అనువుగా భాషను మార్చడం అంటే అనుదిన జీవితంలో, శాస్త్ర, సాంకేతిక విషయాలలో అవసరమైన పదసంపద నిరంతరం సమకూర్చుకుంటూ పోవటం, కంప్యూటర్లలో ఈ భాషను ఎటువంటి ఆటంకాలు లేకుండా సులభంగా ఉపయోగించ గలగటం కోసం లిపిని తీర్చిదిద్దటం, లేదా ఇప్పటికే మనలో పాతుకుపోయిన అంతర్జాతీయ ఆంగ్ల లిపిని జాతీయం చేసుకోవటం. ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది సంప్రదాయం, ఇది అప్రాచుర్యం అంటూ పండితులు చర్చలు జరుపుతూ ప్రజల్ని నియంత్రిస్తూ పోతే భాష వర్ధిల్లదు. ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా తమ భాషను ఎన్ని రూపాల్లోనైనా వినియోగించుకునే అవకాశం ఇవ్వాలి. విస్తృతంగా వాడబడే భాష వికసిస్తుంది. విడనాడబడిన భాష నశిస్తుంది. తెలుగు లిపి రాని తెలుగు వాళ్ళు ఇంగ్లీషు వారైనా సరే తెలుగు భాషను అమలు చేయవచ్చు
ఒక భాష ఏ లిపిలోనైనా వ్రాయవచ్చు. భాష భాషే, లిపి లిపే. భాషకు లిపికి సంబంధం శాశ్వత సంకెల లాగ చేయకూడదు. శాతవాహనులు, ఇక్ష్వాకులు, కాకతీయుల నాటి తెలుగు లిపి ఇప్పుడుందా? ఒకవేళ ఆనాటి లిపిలోకి నేటి తెలుగు సాహిత్యాన్ని మార్చితే చదవగలిగే వారున్నారా? ప్రయత్నిస్తే చదవచ్చు. కాని అది కొద్దిమంది పరిశోధకులకు మాత్రమే పరిమితమై ప్రజాబాహుళ్యానికి సాధ్యం కాదు. అధికార భాషా సంఘానికి అపరిమితమైన అధికారాలిచ్చి చిత్తశుద్ధితో పని చేసే అధికారుల్ని నియమిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
రోమన్ ఉర్దూలో ఉన్న బైబిల్ చూసాను. నాకు ఉర్దూ రాదు, చదవటం అసలే రాదు. కాని ఆ బైబిల్ చదవగలిగాను. కారణం ఆ ఉర్దూ ఇంగ్లీషు లిపిలో ఉండటం. ఈ రకంగా ఒక భాషను మరో భాష లిపిలోకి మార్చడాన్ని లిప్యంతరీకరణ (Transliteration) అంటారు. వత్తులు, గుణింతాలతో బాధలు పెడుతున్న తెలుగు లిపి క్లేశాలకీ పద్ధతి సిద్ధౌషదంలాగా పనిచేస్తుంది. మనకు ఇష్టమున్నా లేకపోయినా ఆంగ్ల లిపి భారతీయు లందరికి వచ్చేసింది. ఆ ఆలు రాకపోయినా జుఔ్పుఈ లు ఇండియా అంతటా అలుముకు పోయాయి. కంప్యూటర్లు, ఇంటర్‌నెట్‌లు వచ్చాక జుఔ్పుఈ లేకుండా ఎవరూ ఏ పని చేయలేని పరిస్ధితి దాపురించింది. ఒకవేళ ఎవరి లిపి వాళ్ళు వాడుకుందా మనుకుంటే రక రకాల లిపి క్లేశాలు ఎదురౌతున్నాయి. భాష అర్ధం కాకపోయినా చదవగలిగే స్థాయికి వాడగలిగే స్థాయికి మెజారిటీ జనాన్ని చేర్చవచ్చు. అయితే ఈ పద్ధతికి అధికార భాషా సంఘం ఆమోద ముద్రవేస్తే అధికారులు ముందుకొచ్చి అమలు చేస్తారు. ఆమోద ముద్ర వేసే అధికారాన్ని అధికార భాషా సంఘానికి, రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టాలి. ఉర్దూ ఇండియాలో పుట్టిన భాష. అయితే అరబీ, ఫారశీ భాషల లిపుల్ని వాడుకుంది. గిడుగు రామ్మూర్తి పంతులుగారు సవరభాషకు మరో లిపి తయారుచేసారు. లిపుల సంఖ్య ఎంత తగ్గితే ప్రపంచ ప్రజలకు అంత మేలు జరుగుతుంది. లిపినే భాషగా భావించే సంకుచితత్వం పండితులు వదిలేస్తే భాషలు స్వేచ్ఛగా నర్తిస్తాయి. అక్షరం ముక్క రాకపోయినా అయిదారు భాషలు మాట్లాడే వాళ్ళున్నారు. భాష వాడకానికి అక్షరాలే ఆటంకాలైతే ఆ లిపి బాధలు తొలగించే పనిని అధికార భాషా సంఘం ఎందుకు చేపట్టకూడదు?
మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ భారతీయ భాషల్లో వాడకంలోకి తెస్తున్నది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖాధిపతి ఆంధ్ర-ఆంగ్ల యంత్రానువాదం కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి కుమారుడు మళ్ళ ప్రశాంత్ కిరణ్ ఇటువంటి సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసి ప్రశంసలు పొందాడు. కంప్యూటర్ లోని ఇంగ్లీషు టెక్ట్స్‌ను తెలుగులోకి తుర్జుమా చేయటం, వెబ్ పేజిలు తెలుగు లిపిలో చూడటం, డౌన్‌లోడ్ చేసుకున్న ఇంగ్లీష్ ఫైళ్ళను తెలుగు లిపిలో పొందటం, తెలుగు టెక్స్ట్‌కు ఇంగ్లీషు లిపిలో Transliteration పొందటం ఈ సాఫ్ట్‌వేర్ ప్రత్యేకతలు. ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్ మెంబర్ కిరణ్ చంద్ర (స్వేచ్ఛ సాఫ్ట్‌వేర్)తో ప్రశాంత్ కిరణ్‌ను కలిపాను. వీళ్ళంతా ఒక గ్రూపుగా ఏర్పడి తెలుగు సాఫ్ట్‌వేర్‌ను మరింత అభివృద్ధి పరచాలని కోరాను. వాళ్ళు ఆ ప్రయత్నంలో ఉన్నారు. ఇలాంటి నిపుణుల్ని అధికార భాషా సంఘం ఉపయోగించుకోవాలి. ఇందుకోసం నిధులు కేటాయించాలి.
అధికార భాషా సంఘం ఆధ్వర్యంలో నిరంతరం వాడుక భాషపై పరిశోధన జరుగుతూ ఉండాలి. వివిధ ప్రభుత్వ శాఖల్లో అవసరమైన తెలుగు పదకోశాల్ని ఎప్పటికప్పుడు తాజా పరుస్తూ, వాటిని కంప్యూటర్లలో వాడేటప్పుడు తలెత్తే సమస్యలకు సత్వర పరిష్కారాలను సమకూర్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ ఉండాలి. చందస్సుతో కూడిన సాహిత్యం పండితులకు వదిలేసి, ప్రజలు మాట్లాడే భాష పరిపాలనా రంగంలోకి వచ్చేందుకు, అధికారులంతా ఆ భాషను కార్యాలయాల్లో వాడేందుకు ఎక్కడెక్కడ ఎలాంటి ఆటంకాలు వస్తున్నాయో కనుక్కోవాలి. ఉద్యోగుల్నే అడగాలి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని. మంచి మంచి సూచనలు వస్తాయి. అమలు చెయ్యాలి. తెలుగు మీడియంలో చదివిన వాళ్ళకు మాత్రమే (చదివినా కూడా) ప్రభుత్వ ఉద్యోగాలిస్తామంటే తెలుగెందుకు చదవరు? సంతోషంగా చదువుతారు. తెలుగు బిడ్డలకా సంతోషం నిలవాలంటే అధికార భాషా సంఘం కోరిన కోర్కెలు తీర్చాలి. దానికి అధికారం ఇవ్వాలి.
(గీటురాయి 3-6-2005)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి