6, జులై 2012, శుక్రవారం

11. ఇంటి భాషంటే ఎంత చులకనో !11. ఇంటి భాషంటే ఎంత చులకనో !
                భాషను కేవలం కొన్ని కులాల వాళ్ళే పుట్టించరు. వివిధ కులాల వాళ్ళు వాళ్ళ వృత్తుల్ని బట్టి, అవసరాలను బట్టి పదాలను పుట్టిస్తూ, వాడుతూ ఉండటం వల్ల ఆ భాష అభివృద్ధి చెందుతుంది. అన్ని పదాలూ మా గ్రంథాల్లోనే న్నాయనే అహంకారం పనికిరాదు. అన్ని కులాల వాళ్ల భాషనూ, వాళ్ళు వాడే పదాల్నీ నిజాయితీగల భాషా శాస్త్రజ్ఞుడు గుర్తిస్తాడు, గౌరవిస్తాడు. గ్రంథస్తం చేస్తాడు. కొన్ని కులాల వాళ్ళ భాషనూ, వాళ్ళు వాడే పదాలను అపహాస్యం చేస్తూ, నీచంగా భావిస్తూ, అసలు గ్రంథాల్లోకి ఎక్కతగని భాషగా చిత్రీకరిస్తూ, భాష సంపన్నం కాకుండా గతంలో అడ్డుతగిలారు. అలా అడ్డుతగిలే పని ఈనాటికీ చేస్తూనే ూన్నారు. మన పల్లె భాషను గౌరవించుదాం. మన పక్కెలు, జెల్లలు, గెడ్డలు, మదుములు, పరసలు, వరజలు... ఇంకా నీచమని భావించి మన సంస్కృతాభిమాన పండితులు వదిలేసిన తెలుగు పదాలన్నీ తెలుగు నిఘంటువుల్లోకి ఎక్కిదాం.
                కొల్లేరు ప్రాంతానికి వెళ్ళిన విలేఖరులకు అక్కడి ప్రజలు ఎన్ని రకాల చేపలు, పక్షుల పేర్లు చెప్పారో చూడండి : మట్టగిడస, కర్రమోను, బొమ్మిడాయి, శీలావతి, గొరక, ఇంగిలాయి, జెల్ల, బొచ్చె, జడ్డువాయి, చేదు పరిగె, కొరమీను, వాలుగ, పండుకప్ప, గండి బొగడ, కొయ్యంగ, మునుగపాము, గడ్డుగాయి, చేమరాయి, పొట్టిదిలాసు,కట్టినెరసు, బుడపార, చాకరొయ్య, గడ్డికొయ్య, మాల తప్పడాలు, ఏటిజెల్ల, మార్పులు, పల్లెంకాయ, పాలజెల్ల, పారాటాయి...
                పరజ, గూడ, అసాబాతు, కళాయి, చేతన బాతు, నల్లముక్కులు, సముద్రపు చిలుక, నత్తకొట్టుడు...
                ‘‘భాషా సమృద్ధే స్వతంత్రతా భీజం’’ అన్నారెవరో మహానుభావుడు. పై పదాలన్నీ తెలుగు పదాలు కావా? వృత్తి పదకోశాల్లోకి ఎక్కించడానికి గతంలో కొంత ప్రయత్నం చేశారు. ఏడాదికి సగటున 5 కొత్త యూనివర్శిటీలు ఏర్పడుతున్నా ఇండియాలో 7 శాతం మించి పి.జి. స్థాయికి చేరటం లేదు. దానికి కారణం పేదరికం కాదు, ఇంగ్లీషు భాషపై పట్టులేకపోవటమేనని రాష్ట్ర న్నత విద్యాచైర్మన్‌కె.సి.రెడ్డి అన్నారు. (ఆంధ్రజ్యోతి 18.10.2005)
                అంటే ఇంగ్లీషు భాష మీద పట్టులేకపోతే మన దేశంలో ఏ వ్యక్తీ, అతనికి ఎంత జ్ఞానం, విజ్ఞానం న్నప్పటికీ న్నత విద్యలోకి ప్రవేశించలేడన్నమాట. ఇంగ్లీషొస్తేనే జ్ఞాని, విద్యావంతుడు. ఇంగ్లీషు రాకపోతే అజ్ఞాని, అనాగరికుడు అని మనమే నిర్ధారించుకుంటున్నాం. ఇంగ్లీషే అన్నింటికి మూలం అన్నట్లుగా మారింది పరిస్థితి.
                తెలుగును ప్రాచీన భాషగా ప్రకటించాలని అన్ని పార్టీలవాళ్ళూ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించారు. కేంద్రానికి పంపారు. కోర్టుకు గూడా వెళ్ళారు. కొద్దిరోజులకే జార్జిబుష్‌హైదరాబాద్‌రావటం, సిలికాన్‌వ్యాలీలో ూన్న ప్రతి ముగ్గురు భారతీయ ద్యోగుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారేనని తేల్చటం, దిల్‌కుష్‌అతిథి భవనంలో అమెరికా వెళ్ళటానికి వీసాలిచ్చే కేంద్రం పెడతామనటం, మన మధ్యతరగతి కుటుంబాలన్నిటికి  ఇంగ్లీషు చ్చుబిగించిపోవటం చకచకా జరిగిపోయాయి. మరోసారి తాజాగా తెలుగుతల్లి సాక్షిగా ద్యోగాల కోసం మన పెద్దలు మోకరిల్లారు : ఇలా ఆంగ్లాన్ని స్తుతించారు.
                ఆంగ్లమేరా జీవితం ` ఆంగ్లమేరా శాశ్వతం
                ఆంగ్లమే మనకున్నది ` ఆంగ్లమేరా పెన్నిధీ
                ఆంగ్లమును ప్రేమించు భాయీ ` లేదు అంతకు మించి హాయీ ఆంగ్ల
                తెలుగును విడిచీ ` ఆంగ్లము నేర్చీ
                అమెరికా పోదామూ ` బానిసలౌదామూ
                డాలర్లు తెద్దామూ ఆంగ్ల
అంటూ పాటలు కూడా పాడుతున్నారు. తెలుగుకంటే ఇంగ్లీషెందుకు ముద్దో కారణాలతో సహా వివరిస్తున్నారు.
1.            తెలుగులో పెద్దగా విజ్ఞాన సాహిత్యం లేదు. తెలుగు భాషా దురభిమానం ప్రదర్శించడం తప్ప మన పాలకులు, పండితులు మన భాషలో పాలనకు పెద్దగా ప్రోత్సాహించటం లేదు. తెలుగులో చదివితే ద్యోగాలూ లేవు.
2.            పెద్ద కులాలవాళ్ళు, ఆస్థిపరులు ఇంగ్లీషులో చదువుకుంటూ, పేదకులాల వాళ్ళకు ఇంగ్లీషు చదువులు దక్కకుండా చేయటానికి తెలుగు భాషా ద్యమాలు చేయిస్తున్నారు.
3.            నిర్భంద చట్టాలతో తెలుగుభాషను తేవాలని చూసినా, పారిభాషిక పదజాలం యావత్తూ సంస్కృతమయం చేస్తూ, పండితులు తెలుగుభాషను తెలుగువాళ్ళకు రాకుండా చేస్తున్నారు. తెలుగు చదువు కృత్రిమమై ఇంగ్లీషు చదువే సులువుగా ఉంటోంది.
4.            దేశం మొత్తానికీ కలిపి ఒకే లిపిలేదు. మరో రాష్ట్రం వెళితే దుకాణాల బోర్డుల పేర్లు చదవాలన్నా ఇంగ్లీషు రావాల్సిందే. హిందీ కూడా అందరికీ రాదు. ఆంగ్ల లిపి పిల్లలకు సులభంగా వస్తుంది.
5.            యవ్వనం వచ్చాక బాల్యావస్థకు తిరిగి వెళ్ళగలమా? ఇంగ్లీషొచ్చాక తెలుగెందుకు? ఆధునిక ప్రామాణిక తెలుగు భాష వచ్చాక ఎవరైనా ఇంటి భాషను కోరుకుంటారా? ఆంగ్ల పాలనలో ఎంతో ప్రావీణ్యం సంపాదించిన మన తెలుగుజాతి మళ్ళీ తిరిగి తెలుగుకు పరిమితమై కుంచించుకుపోవాలా? పడ్డచన్నులెత్త బ్రహ్మవశమే?
6.            కంప్యూటర్‌కు ఆంగ్లం అవసరం. ఇంగ్లీషు రానివాళ్ళు ఎందుకూ పనికిరాని వాళ్ళవుతారు. మనం విశ్వమానవులం. అధునాతన విశ్వచైతన్యాన్ని అందిపుచ్చుకోవాలంటే తెలుగును బలిచేసైనా ఇంగ్లీష్‌నేర్వాలి.
7.            అప్పడగా బోయిందీ అదీ ఒక తప్పా? ఇప్పుడు తెలుక్కొచ్చిన ముప్పేమీలేదు. మమ్మీ, డాడీ, ఆంటీ, అంకుళ్ళతో తెలుగు సంస్కృతికొచ్చే నష్టం ఏంటట? భాషోద్యమాలతో ఎందుకీ గోల? ఇదంతా ప్రాంతీయ దురభిమానంతో చేస్తున్న వేర్పాటువాదం. ఆంగ్లం వల్ల అధికారం, అధికారం వల్ల భాగ్యం కలుగుతాయి.
                ఇక ‘‘మనం తెలుగువాళ్ళం’’ అనీ, ‘‘మన తెలుగును రక్షించుకుందాం’’ అనీ పోరాడే తెలుగు వీరులు చెప్పే సమాధానాలు ఏమిటి?
1.            మాతృభాషను కాపాడుకోవటం భాషా దురభిమానం ఎలా అవుతుంది? అలాగయితే ఇంగ్లీషు వాళ్ళది భాషా సామ్రాజ్యవాదం కాదా? సొంతభాష కంటే మనకు ఇంగ్లీషే గొప్పగా కనబడటం బానిస మనస్తత్వం కాదా?
2.            మన  పాలకులు, అధికారులు డబ్బు సంపాదించటానికి మాత్రమే ఆంగ్ల విద్యను ప్రోత్సహించటం పడుపు కూడు తినటంతో సమానం. అత్యధిక జనాభా మాట్లాడేభాషను నాశనం చేస్తూ పరాయిభాషకు పట్టం గట్టడం అంటే పరస్త్రీ ముందు భార్యను అగౌరవపరచటం లాంటిది. ఇది భాషా వ్యభిచారం, అనైతికం, అసహజం, తెలుగు జాతి ప్రజల హక్కుల ూల్లంఘన.
3.            మన భాషను రక్షించుకోవాలంటే నిర్బంద చట్టాలు ఉండాల్సిందే. ఇంటి భాషకు సైతం చోటు కల్పిస్తూ పారిభాషక పదజాలం మనం సమకూర్చుకోవాలి. ఇంగ్లీషుకంటే తెలుగే సులువుగా వస్తుంది. మన లిపిని కంప్యూటర్‌కు అనుకూలంగా మార్చుకోవాలి. అవసరమయితే ఆంగ్లలిపినే తెలుగుభాషకు వాడుకుందాం.
4.            ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల మంది తెలుగు వాళ్ళున్నారు. 110 దేశాలకంటే మన తెలుగు నేల పెద్దది. ఎన్నో యూరోపియన్‌దేశాల భాషలు తెలుగుకంటే చిన్నవే. వాటికున్న గౌరవం మర్యాదకూడా తెలుగుకు రాదా? మనల్ని మనమే కించపరచుకోవటం ఏమిటి?
5.            తెలుగు పనికిమాలిన భాషా? దెబ్బ తగిలితే మమ్మీ అని కాకుండా అమ్మా అని ఎందుకరుస్తారు? వచ్చీరాని ఇంగ్లీషు నడమంత్రపు సిరి లాంటిది. బాల్యంలో తీరని కోరికల్ని యవ్వనంలోనైనా తీర్చుకోవాలి గానీ ఆంగ్ల ప్రావీణ్యం అనే యవ్వన గర్వంతో బాల్యాన్ని మరిచి, తల్లిభాషను అధోగతికి దిగజార్చటం ఏరుదాటాక తెప్ప తగలేసే లక్షణం.
6.            మన సాహిత్యం, చరిత్ర, విజ్ఞానం, విద్య, పరిపాలన మన భాషలోనే ఉండాలి. కంప్యూటర్‌కోసం తెలుగును బలిపెట్టటం ఎలుకలున్నాయని ఇంటిని తగులబెట్టడంతో సమానం. కంప్యూటర్‌నే తెలుగులోకి వంచుతాం. ఎన్నో భాషల గ్రంథాలు ఇంగ్లీషులోకి అనువదించుకున్నారు. అవసరం అటువంటిది.
7.            ఇక్కడ చదివి ఎక్కడికో వెళ్ళి సేవలు చేసే మనస్తత్వం స్వజాతికి ద్రోహం. తెలుగులోనే ఇంజనీరింగు, వైద్యశాస్త్రాలు చదివి తెలుగు ప్రజలకే సేవ చేయగలిగితే మన భాషతో పాటు మన జాతి  వికసిస్తుంది గదా? మీ భోగ భాగ్యాల కోసం తెలుగు ప్రజలందర్నీ ఇబ్బందులకు గురి చేస్తారా? వారి మీద మోయలేని భారం మోపుతారా? వారి భాషను నాశనం చేసి వాళ్ళను మూగవాళ్ళుగా చేస్తారా? మాతృభాషకు ప్రాథమిక విద్యలో కూడా స్థానం లేకుండా చేసే వాళ్ళది ఇంటి కూడు తిని ఎవరి వెంటో పడే తత్వం కాదా? ఇది ప్రజాద్రోహం కాదా?
                ‘‘మాతృభాషాతృణీకారం మాతృదేవీ తిరస్కారం’’ అన్నారు మహాత్మాగాంధీ. ‘‘మాతృభాష సరిగా నేర్చుకోని వాళ్ళకు ఇతర భాషలు కూడా సరిగా రావు’’ అన్నారు జార్జి బెర్నార్డ్‌షా. మన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంఫ్వీు ఇలా అన్నారు. ‘‘మాతృమూర్తికి ఎంతటి గౌరవం ఇస్తామో మాతృభాషకు అంతటి సమున్నత స్థానం దక్కాలి. నేను తల్లితో సమానంగా తల్లిభాషనే గౌరవిస్తాను. అందరూ మాతృభాషలో మాట్లాడండి. న్యాయస్థానాల్లో వాదనలు కార్యకలాపాలు ఆంగ్లంలో కొనసాగడమేంటి? ఇంకా ఎంతకాలం ఈ దారుణం? న్యాయస్థానాల్లో వ్యవహారాలు సామాన్యుడి భాషలో కొనసాగినపుడే సామాన్యుడికి న్యాయం అందివ్వగలం.’’
                                                                             (‘‘అమ్మనే మరుస్తారా!’’ ఈనాడు 27.2.2006)
                అమ్మ భాషను మనవాళ్ళు మరచిపోతుంటే ఫ్రాన్సు నుండి పెద్దాపురం వచ్చి బుర్రకథ మీద, తెలుగుభాష మీద పరిశోధన చేస్తున్న డాక్టర్‌ డానియల్‌ నెగర్స్‌ ఇలా అంటున్నారు. ‘‘తెలుగునేల మీద విదేశీ భాషలు నేర్చుకోడానికి సీఫెల్‌ వంటి సంస్థలు పనిచేస్తున్నాయి గానీ, తెలుగుపై మక్కువతో వచ్చే విదేశీయులకు తెలుగు నేర్పేసంస్థ ఏదీఇక్కడ కనిపించలేదు. అమెరికా పలుకుబడి, ఆంగ్లభాష ప్రపంచంలోని అన్ని భాషా సంస్కృతులకు నష్టం కలిగిస్తోంది. ప్రపంచీకరణ పేరుతో ప్రతి ప్రాంతానికీ ఈ ప్రమాదం విస్తరిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో రెండువేల భాషలున్నాయి. మరో వందేళ్ళు ప్రపంచీకరణ దాడి ఇలాగే కొనసాగితే 200 భాషలే మిగులుతాయి. భాషల సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవ అవసరం. ఫ్రెంచి, తెలుగు భాషలు దాదాపు ఒకే సమయంలో సాహిత్య బాషలుగా పరిణితి చెందాయి. అయితే ఫ్రెంచిభాషను ప్రపంచంలో ఎక్కడయినా నేర్చుకునే వీలుందికానీ తెలుగును తెలుగు నేలపై నేర్చుకోవడమే కష్టంగా ఉంది. ఎంతో ప్రాచీనమైన తెలుగుభాష ూనికిని కాపాడుకోవాలి. ఆంగ్లభాషను రుద్దడం వల్ల భాషల మధ్య ఘర్షణ తప్పదు.’’ (ఆంధ్రజ్యోతి 22.2.2006)
                ప్రపంచంలోని అన్ని భాషల కంటే ఎక్కువగా ఆంగ్లభాషలో 7,90,000 పదాలున్నాయట. వాటిలో 3 లక్షల పదాలు సాంకేతికమైతే, 4,90,000 పదాలు వాడుకలో ూన్నాయట. అయితే భాషాశాస్త్రజ్ఞుల లెక్క ప్రకారం ఏ ఒక్కరూ తమ జీవితకాలంలో 60 వేలకు మించి రాయడంలో కానీ, చదవడంలో కానీ ూపయోగించలేరట. అంటే అరవై వేల అవసరమైన పదాలను రాయడంలో, చదవడంలో పయోగిస్తూ ఉంటే భాషను సజీవంగా కాపాడుకోవచ్చు.
                మెదక్‌జిల్లా రాయికోడు మండలం షంషుద్దీన్‌పూర్‌గ్రామనివాసి ఏర్పుల కమలమ్మ 50 రకాల విత్తనాలు సాగుచేసి సరఫరా చేస్తోందట. విత్తనాల పేర్లు చూడండి : ‘‘తైదలు, లవలు, సజ్జలు, పచ్చజొన్నలు, తోక జొన్నలు, తెల్లమల్లెజొన్న, ఎర్రజొన్న, బుడ్డజొన్న, అత్తకోడళ్ళ జొన్న, నల్లతొగరి, ఎర్రతొగరి, తెల్లతొగరి, అనుములు, కొర్రలు, బొబ్బర్లు, పెసర్లు, వడ్లు, తెల్లనువ్వులు, ఎర్రనువ్వులు, గడ్డినువ్వులు, పుంట్లు, శనగలు, ఆవాలు, తెల్లకుసుమ, ధనియాలు, వాము, బటాని, సిరిశనగ, మిరప, కోడిసామలు, పల్లీలు, గోధుమ, సాయిజొన్న, నల్లకుసుమ, అవిశలు, లంకలు, సిరిశనగ’’ (వార్త 6.3.2006)
                ఈ తెలంగాణా తల్లికి ఏమి ఇంగ్లీషొచ్చు? అయినా ఈ తెలుగు ‘‘నేల తల్లులు’’ ఎన్నో వందల ఏళ్ళ నుండి మొక్కల పేర్లు, విత్తనాల పేర్లు మక్కువగా గుర్తు పెట్టుకొని వ్యవసాయం నడపలేదా? ఇంగ్లీషు, లాటిన్‌పదాలకిచ్చిన ప్రాముఖ్యత, ప్రాధాన్యత మన తెలుగు పదాలకు కూడా ఇవ్వలేకపోవటానికి కారణం ఏమిటి? మనం మనకి అర్థం కాకపోయినా, ఇంగ్లీషు వాళ్ళకు అర్థం కావాలి. ఈ బాబేలు దేశంలో భారతీయులంతా ఒకరికొకరు అర్థం కావాలంటే ఇంగ్లీషే మంచిదనే నిర్ణయానికొచ్చారు. భాషాప్రయుక్త రాష్ట్రాలన్నీ ప్రత్యేక దేశాలుగా ఉంటే మొగలులు, బ్రిటీష్‌వాళ్ళు రాకముందున్నట్లుగా ఉంటే, ఎవరి భాషకు వాళ్ళు పట్టం గట్టేవాళ్ళే. ఇప్పుడది సాధ్యంకాదు కాబట్టే మన భాషలకు ఇంగ్లీషు సారథ్యం వహిస్తోంది.
                తెలుగు భాషకు మూలపురుషులు ఎవరు? యానాదులు. తెలుగుభాషను నిత్యమూ వాడుతూ బ్రతికిస్తున్నది ఎవరూ? వివిధ కులవృత్తుల్లో ూన్న శ్రామికులు, గ్రామీణులు. అరవైవేలు కాదు దాదాపు 3 లక్షల పదాలు వీళ్ళంతా కలిసి వాడుతున్నారు. వీళ్ళందరూ వాడుతున్న పదాలలో కొంత వరకూ వివిధ పదకోశాల్లోకి ఎక్కాయి. ఇంకా రక్షించుకోవాల్సిన పదజాలం ఎంతో ూంది. మాటకు ప్రాణము వాడుక. వాడుక ఎప్పుడు జరుగుతుంది? మన పంచాయితీలు, న్యాయస్థానాలు, అసెంబ్లీ అన్నీ తెలుగులో నడిచినపుడు. కనీసం మన పిల్లలకు ప్రాథమిక విద్య అయినా తెలుగులో అందించినపుడు.
                ప్రైవేట్‌స్కూళ్ళు తెలుగు నేర్పవు. మార్కుల కోసం కళాశాల విద్యార్థులు సంస్కృతం రెండోభాషగా తీసుకుంటున్నారు. సంస్కృత పరీక్షలో జవాబులు తెలుగు, ఇంగ్లీషు లిపుల్లో దేంట్లోనైనా రాయొచ్చట. మార్కులు బాగా వేస్తారట. హిందీ పరీక్షకైతే 20 మార్కులు తెచ్చుకున్నా పాస్‌చేస్తున్నారు. మరి ఈ రకం రాయితీలు, ప్రోత్సాహకాలు మన తెలుగు భాషకే ఇవ్వవచ్చుగదా? కర్నాటకలో కన్నడ మాతృభాషకాని వాళ్ళైనా సరే కన్నడాన్ని మూడో భాషగానైనా చదవాల్సిందేనట. మరి మన రాష్ట్రంలో?
                కర్నాటకలో కన్నడం లేకుండా హైస్కూలు విద్య పూర్తికాదు. పైగా 15 శాతం మార్కులు కన్నడానికి ప్రోత్సాహకంగా ఇస్తున్నారు. తమిళనాడులో ఎనిమిదవ తరగతిదాకా తమిళాన్ని ఒక భాషగా నిర్భందం చేశారు. కోయ, గోండు, కొలామి, ఆదివాసి, ఒరియా, సవర, బంజారా, కొండ, కువి మొదలైన గిరిజనులకు వారి మాతృభాషల్లోనే మన రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు ముద్రించి బోధిస్తోంది.ఇదే పని తెలుగు పిల్లలకు కనీసం అయిదో తరగతి వరకు నిర్భందం చేస్తే బాగుంటుంది. ప్రైవేట్‌స్కూళ్ళమీద కర్నాటక, తమిళనాడు ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తున్నాయో మన ప్రభుత్వం కూడా అలానే వ్యవహరించాలి.
                ‘‘భాషను సాహిత్యానికీ కవిత్వానికీ పరిమితం చేస్తే భాషతోపాటు దాన్ని మాతృభాషగా కలిగిన వారు కూడా వెనుకబడిపోతారు. భాషను పాధితో ముడిపెట్టండి’’ అన్నారు మౌలానా అబుల్‌కలాం ఆజాద్‌.
                గిడుగు రామ్మూర్తి జయంతి ఆగస్టు 29ని ‘‘తెలుగు భాషా దినోత్సవం’’ గానూ, కాళోజీ జయంతి సెప్టెంబరు 19ని ‘‘తెలుగు మాండలిక భాషా దినోత్సవం’’ గానూ జరుపుకుంటున్నాము. ఇంటిభాస ఎసుంటిదైనా మందే కదా? ఆదరిచ్చుదాం. ఇంపుగా నేరుద్దాం. ఇంగిలీసు నేర్చుకోటల్లా? అట్టా.
               (31.3.2006, గీటురాయి వారపత్రిక)        

ww.andhrabhoomi.net/content/inti-bhasha    ఆంధ్ర భూమి 7.7.2012)


6 కామెంట్‌లు:

 1. http://blaagu.com/chandamamalu/category/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81-%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B7/

  రిప్లయితొలగించు
 2. https://www.facebook.com/photo.php?fbid=655533284478665&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater&notif_t=photo_comment

  రిప్లయితొలగించు
 3. https://www.facebook.com/photo.php?v=874234955925046&comment_id=900994986582376&offset=0&total_comments=720

  రిప్లయితొలగించు
 4. రహమతుల్లా గారి వ్యాసం చాలా బాగున్నది. రచయితకు ధన్యవాదములు

  రిప్లయితొలగించు
 5. https://www.facebook.com/photo.php?fbid=458883240810338&set=a.233025936729404.60739.100000659993594&type=3&theater

  రిప్లయితొలగించు
 6. https://www.facebook.com/photo.php?fbid=508644582500870&set=a.233025936729404.60739.100000659993594&type=3&theater

  రిప్లయితొలగించు