7, జులై 2012, శనివారం

తెలుగు అధికార భాష కావాలంటే .. పుస్తకానికి ముందు మాటలు


తెలుగు అధికార భాష కావాలంటే .. 1 పుస్తకానికి  ముందు మాట
ఏ జాతి సమస్త వ్యవహారాలు ఆ జాతి మాతృ భాషలోనే జరుగుతాయో ఆ జాతి సుఖపడుతుంది.  అది ఎప్పటికీ విజేతగానే ఉంటుంది. ఇంగ్లీషు వాళ్ళ  దేశాలను పరిశీలిస్తే   వాళ్ళకున్న  దురాక్రమణతత్వం వల్ల  భౌతిక సంపదలు  సమకూరటమేగాక వారి భాష కూడా వాళ్ళు ఆక్రమించిన  దేశాల్లో  రాజ్యం  ఏలింది.  ఇకమీదట కూడా  ఏలుతుందని తెలుస్తోంది. తమ జీవితంలోని   అన్ని  రంగాల్లో   తమ  మాతృభాషే  వాడకంలో  ఉండేలా  వాళ్ళు  కృషిచేశారు.  ఇంట్లో, ఆఫీసులో, కోర్టులో చివరికి చర్చిలో కూడా వాళ్ళ మాతృభాషలోనే వ్యవహారాలు నడుస్తాయి. కాబట్టి వాళ్ళు ఎంతో సుఖపడుతున్నారు.
                తెలుగు ప్రజలు ఇంట్లో తెలుగు మాట్లాడుకున్నా , ఆఫీసులో ఇంగ్లీషు, కోర్టులో ఇంగ్లీషు, కొన్ని ప్రాంతాల్లో హిందీ లేదా ఉర్దూ మాట్టాడాల్సి వస్తుంది. చివరికి దేవుడి ప్రార్ధన చేసుకుందామన్నా సంస్కృతంలోనో అరబ్బీలోనో చేసుకోవాల్సి వస్తోంది. తెలుగు మనిషి మనసుతో పనిలేని ఓ యంత్రం లాగా మారాడు. తెలుగు క్రైస్తవులు తమ ఆధ్యాత్మిక వ్యవహారాలన్నీ తెలుగులోకి మార్చుకున్నందువల్ల కనీసం మానసిక ఆనందాన్ని పొందగలుగుతున్నారు.  తెలుగు హిందువులు, తెలుగు ముస్లింలు మొదట తమ  ఆధ్యాత్మిక  వ్యవహారాలను  తెలుగులోకి మార్చుకోగలిగితే తెలుగు హృదయం స్వేచ్ఛగా పలుకుతుంది.   దేవునితో  మాట్లాడే  భాష హోదా తెలుగుకు వస్తుంది. ఆ ఆనందం వర్ణించలేనిది.
                పూర్వకాలంలో మన దేశంలోని రాజులు చక్రవర్తులు తమ తమ మాతృ భాషలలో ప్రజలతో సంభాషించేవారు. అలాగే ధైనందిన జీవిత వ్యవహారాల పరిష్కారాల విషయంలో కూడా మాతృభాషని ఉపయోగించటం వలన ప్రజలకు రాజ్యపాలన దగ్గరైంది. ప్రజల భాషలోనే రాజ్యపాలన సాగింది. ఎవరైనా బాధితుడు వచ్చి ధర్మగంటను మ్రోగిస్తే, రాజు విచ్చేసి బాధితుడి మొర విని నిందితుడ్ని పిలిపించి అందరి సమక్షంలో విచారించేవాడు. అ విచారణలో ఇరు పక్షాల వాదోపవాదాలు మాతృ భాషలో జరిగేవి. తీర్పరి అయిన రాజుగారికి ఫిర్యాది-నిందితుడికీ మధ్య మధ్యవర్తిగా ఏ' ప్లీడరు' వుండేవాడు కాదు.
రాజు విచారణ జరిపేటపుడు ప్రజల భాషలోనే ప్రశ్నించి వివాద మర్మాన్ని పసిగట్టేవాడు. చివరకు ప్రజల భాషలోనే తీర్పు ప్రకటించే వాడు. ఈ మేరకు ఆటు విచారణ ఇటు తీర్పు ప్రజల సొంత భాషల్లో జరగటంతో మధ్యవర్తుల ఆవసరమే వుండేది కాదు. తీర్పు సొంతభాషలో రావడంతో ఫిర్యాదికిగానీ,  నిందితుడికిగాని అర్ధంకానిదంటూ ఏవిూ వుండేది కాదు. ప్రస్తుత న్యాయపరిపాలన విధానంతో అనాటి పద్థతులను పోల్చి చూసుకుంటే ఎంతో క్షోభ కల్గుతుంది.
ఈనాటికైనా పరిపాలనా విధానాలన్నీ ప్రజల భాషలోనే జరిగితే అనాటి ఆనంద కరమైన  పరిస్థితులు  తిరిగి  వస్తాయి.  ఆ పరిస్థితులు నా మాతృభాష తెలుగులో రావాలనే ఉద్దేశ్యంతో రెండు దశాబ్దాలనుండి అడపాదడపా పత్రికల్లో వ్యాసాలు రాశాను. వీటన్నింటిని ఒక పుస్తకంగా ముద్రిస్తే బాగుంటుందని కొందరు పెద్దలు సలహా ఇచ్చారు. ఆ సూచనల ఫలితమే ఈ పుస్తకం .     
                ఈ వ్యాసాలు అప్పుడప్పుడు రాసినవి కాబట్టి కొన్ని విషయాలు చెప్పినవే చెప్పటం,  కొన్ని  అంకెలు  ఆయా  సంవత్సరాల  నాటివి కావటం వలన ప్రస్తుత అంకెలతో పొంతన కుదరక పోవడం సంభవిస్తూంది. అందువల్ల ఆనాటి సంఖ్యల అధారంగా పరిస్థితుల్ని పాఠకులు అర్ధం చేసుకోవాలి. నా అనుభవంలోకి వచ్చిన  విషయాలను నాకు తోచిన  పరిష్కారాలతో వ్రాసిన ఈ  వ్యాసాలను ప్రచురించిన ఆంధ్రపత్రిక, గీటురాయి వార పత్రిక సంపాదకులకు నా ధన్యవాదాలు.
                  పుస్తకంపై   తమ   విలువైన   అభిప్రాయాలను  వెల్లడించిన దళిత నాయకులు, ప్రముఖ రచయిత, కవి, కత్తిపద్మారావుగారికి, 'విశాలాంధ్ర' విశ్రాంత సంపాదకులు పరకాల పట్టాభి రామరావుగారికి, 'నడుస్తున్న చరిత్ర' మాస పత్రిక సంపాదకులు డాక్టర్‌ సామల రమేష్‌ బాబు గారికి, తన గ్రంథాలలో  తెలుగును పరవళ్ళు తొక్కించిన సి.వి. (చిత్తజల్లు వరహాల రావు) గారికి , ఖురాన్‌ను తెలుగులోకి అనువదించిన ప్రముఖ రచయిత అబుల్‌ ఇర్ఫాన్‌గారికి, గత రెండు దశాబ్ధాల కాలంగా నేను పని చేసిన చోటల్లా  ''అధికార భాషగా తెలుగు ''  అనే  అంశంపై  నిర్వహించిన పలు కార్యక్రమాలలో కొన్నింటికి పెద్దగా  వ్యవహరించడమే కాకుండా,  ఈ పుస్తక ప్రచురణకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన  వి.జి.టి.యం.  ఉడా వైస్‌  ఛైర్మన్‌   వి.యన్‌.  విష్ణు ఐ.ఎ.ఎస్‌.  గారికి,    ఈ పుస్తకాన్ని రూపొందించటంలో తోడ్పడిన ప్రముఖ  రచయిత  సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ గారికి,  కవి  మిత్రులు సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారికి, ముద్ర ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌  అధినేత తుమ్మల సుబ్బారావుగారికి  నా కృతజ్ఞతలు.

                                                              - నూర్‌బాషా రహంతుల్లా                                        1-11-2004
తెలుగు అధికార భాష కావాలంటే .. 2  పుస్తకానికి  ముందు మాట
''తెలుగు అధికారభాష కావాలంటే...'' అనే ఈ పుస్తకం గత సంవత్సరం 19 అధ్యాయాలతో వెలువడింది. ఇప్పుడు మరో 7 అధ్యాయాలను అధికార భాషా సంఘం అధ్యక్షులు తదితర ప్రముఖుల అమూల్యాభిప్రాయాలను కలుపుకొని రెండవ ముద్రణ పొందింది.
మన తెలుగు భాషకు అధికార పీఠం నిజంగా దక్కే వరకూ ఈ పుస్తకం వెలువడుతూనే ఉంటుంది. ఆ అవసరాన్ని ప్రజలకు తెలియజేస్తూనే ఉంటుంది. తెలుగును రక్షించుకోవాలని తపించేవారి కోర్కెలను ఈ పుస్తకం ప్రతిఫలిస్తూనే ఉంటుంది. తెలుగుజాతి ఇంగ్లీషు, హిందీ, తదితర జాతులతో సమంగా తలెత్తుకొని తిరిగే వాతవరణం రాష్ట్రంలో కలగాలి. ఎవరి భాషను వారు గౌరవించటం, వారి భాషకు సర్వాధికారాలు కలగాలని కోరుకోవటం తప్పు కాదు కదా? 
తెలుగుకు రెండవ జాతీయ అధికారభాష హోదా, ప్రాచీన భాషా హోదా కల్పించాలని కోరుతుంటే.....గొంతెమ్మ కోర్కెలు మానుకోమనీ, ఉట్టికెక్క లేనమ్మ స్వర్గానికి ఎలా ఎక్కు తుందనీ, ఇంట గెలచి రచ్చ గెలవమనీ, అత్యాశ పనికి రాదని..... కొందరు తెలుగు పెద్దలే నాకు విడమరచి చెప్పారు. కాని వాళ్ళకు కూడా అంతరంగంలో వారి మాతృభాష ఉట్టికెక్కాలని, ఇంట గెలవాలని, రచ్చలో కూడా గెలవాలనే ఉంది. ఎంతైనా వారూ తెలుగు బిడ్డలే కదా! కాకపోతే ప్రస్తుత పరిస్థితిని చూసి ఇవి తీరే కోర్కెలు కావని నిరాశ. ఎప్పటికైనా ఈ కోర్కెలు తీరాలనీ, తెలుగు బ్రతకాలనీ, తెలుగు ఏలాలని, తెలుగుకు సరైన న్యాయం జరగాలనీ నా ఆశ. నేను ఆశావాదిని. ప్రజల భాషకు పట్టం కట్టడం ఏనాటికైనా తప్పదు.
''మద్రాసు లేని తెలుగు రాష్ట్రం తలలేని మొండెం లాంటిది'' అని అమరజీవి పొట్టి శ్రీరాములు ఎంతగానో వాపోయారు. తెలుగు విద్వాంసులు సంగీత సాహిత్య రంగాలలోనే గాక ఇతర రంగాలన్నింటిలో ఆనాటికే చెన్నైలో చేసిన అభివృద్ధిని మనం వదులుకున్నాం. బళ్ళారి, బరంపురం లాంటి తెలుగు ప్రాంతాలు కూడా కోల్పోయాం. ఆంధ్ర  రాష్రం  ఏర్పడిన  మరునాడే  తెలుగు  అసెంబ్లీ తరలి పోవాలని, తెలుగువారి రాజధాని మద్రాసులో ఉండటానికి ఒక్క రోజు కూడా ఆతిథ్యం ఇవ్వటం కుదరదని సి. రాజగోపాలాచారి తెగేసి చెప్పాడట.
దాంతో తెలుగు నాయకులు కర్నూలుకు వెళ్ళారు. మళ్ళీ అక్కడ్నుంచి హైదరాబా దుకు వెళ్ళారు. ఇలా నిరంతరం వలసలు వెళ్ళే శరణార్థులకు ఆశ్రయ మిచ్చేవాళ్ళ భాషే వస్తుంది కాని, వారి స్వంత భాష వికసించదు. ఏ భాషవారికైతే అత్యధిక సంఖ్యాకులు వారి భాషనే మాట్లాడే సుస్థిర రాజధాని నగరం ఉంటుందో, వారి  భాష కూడా సులభంగా రాజ్యమేలుతుంది. రెండు మూడు భాషలవాళ్ళు అధికార యంత్రాంగంలో ఉన్నపుడు ఒకరి భాష ఒకరికి అర్థంగాక, ఎవరి భాష పెత్తనం కోసం వాళ్ళు పెనుగులాడుతుంటే, ఇద్దరినీ సమర్ధించే మూడో భాష పెత్తనం చెలాయిస్తుంది.
''భాషను ఆధునిక శాస్త్ర సాంకేతిక పదాలతో పరిపుష్ఠం చేసినపుడే ఆ భాషలో చదివే చదువులు ఉపాధి చూపుతాయి'' అన్నారు రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం. మన భాషా పాటవంతో చదివినవారికి ఉపాధి రంగంలో రిజర్వేషన్లు ఇచ్చి ప్రోత్సహించినా ఎంతోమంది తెలుగు భాషలోనే శాస్త్ర సాంకేతిక విద్యలు చదవటానికి తరలి వస్తారు. కోటి విద్యలు కూటి కొరకే కదా!
ఈ పుస్తకాన్ని ముద్రించిన తెలుగు ఇస్లామిక్‌ పబ్లికేషన్స్‌ డైరెక్టర్‌ అబ్బాదుల్లా గారికి, గీటురాయి వారపత్రిక ఎడిటర్‌ మలిక్‌ గారికి, ఈ పుస్తకాన్ని తీర్చిదిద్దిన అబుల్‌ ఇర్ఫాన్‌ గారికి, వాహెద్‌ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కారణం ఈ పుస్తకంలోని వ్యాసాలన్నీ గతంలో వీరందరి సహకారంతో ''గీటురాయి'' పత్రికలో వచ్చినవే, కాబట్టి ఈ పుస్తకానికి నిర్మాత ''గీటురాయే''నని మరోసారి చెబుతున్నాను.      - నూర్‌బాష రహంతుల్లా 21.2.2006

8 కామెంట్‌లు:

  1. తెలుగు వెలుగులకు ఇదొక ముందడుగు –1
    కత్తి పద్మారావు ప్రముఖ కవి ,రచయిత. పొన్నూరు ఫోన్; 9849741695
    భాష ఒక సామాజిక జీవన ప్రతిఫలం. మనిషి గుంపుగా, గణంగా, గమనంగా, మారుతూ వెళ్ళినంత కాలం భాష ఒక సజీవ ప్రవాహంగా మనిషిని పునరుజ్జీవింప చేస్తూనే వుంటుంది. జాతికి భాషే ఒక తూనికరాయి. ప్రతిజాతి తమ భాషా మూలాల్ని వెతుక్కోవాలి. తమ చరిత్రను తామే నిర్మించుకోవాలి. ఈ దిశగా భాషా చరిత్రకారులు ఎంతో కృషి కొనసాగిస్తున్నారు. తెలుగు భాషా చరిత్రకారులలోకి నూర్‌బాషా రహంతుల్లా చేరటం ఒక నూతన ఆవిష్కరణ.
    రహంతుల్లా గారు తెలుగు భాష సజీవమైందని, సంపన్నమైందని స్వతంత్రంగా నిలబడగల శక్తి గలదని ఈ గ్రంథంలో నిరూపించారు. కులమత భేదం లేకుండా తెలుగు మాట్లాడేవారంతా ఒకే జాతి అని చెప్పటం, సంభాషణలోను తెలుగు భాషను సుసంపన్నం చేయాలనేది ఆయన అభిలాష. అందుకు సంబంధించిన మూలభూతమైన పదసంపద గురించిన చర్చ ఆయన చేశారు. ఈ విషయమై ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. ఈ గ్రంథాన్ని బట్టి ఆయన మంచి చదువరిగా కన్పిస్తున్నారు. భాష గురించిన ప్రతి విషయాన్నీ ఆయన ఉటంకిస్తూ వచ్చారు. నిఘంటువులు, సామెతలు, పలుకుబడులు, క్రియాపదాలు, వాక్య నిర్మాణానికి సంబంధించిన అనేక విషయాలు చెబుతూ వెళ్ళారు.
    రహంతుల్లాగారిలోని ప్రధాన దృక్పధం తెలుగు రాష్ట్రం తెలుగు బాషలోనే పరిపాలించబడాలనేది. అది ఒక ఉద్యమంగా సాగాల్సిన అంశం. అటువంటి విషయాన్ని ఓ అధికారిగా చెప్పటం ప్రత్యేకత. ఆయనలోని తపనలో ఒక ఉద్యమకారుడు కూడా ఉన్నాడు. ఆ ఉద్యమకారుడు ప్రజాస్వామ్యవాది. ఆలోచనాపరుడు కూడా. ఆ ఉద్యమకారుడ్ని ఆయన భాషలోనే చూద్దాం, భాషా ప్రాతిపదిక విూద తెలుగు రాష్ట్రం ఏర్పడి 43 ఏళ్ళు గడిచినా, తెలుగులో చట్టాలు చేయకపోవటం వల్ల అధికార భాషగా తెలుగు అధోగతి పాలయ్యింది. ఐ.ఎ.ఎస్‌ మొదలు అటెండర్‌ వరకు అందరికీ ఈ భాష విూద చిన్న చూపే, ప్రపంచంలో 15వ స్థానాన్ని, భారత దేశంలో రెండవ స్థానాన్ని పొందిన ఈ భాషకు విలువ లేదు. ఇప్పుడు కంప్యూటర్ల రాకతో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ తెలుగు వాడకాన్ని తుంగలో తొక్కాయి. పరిపాలనా పరంగా భాష విషయంలో ఆయనకున్న తపన ఈ మాటలు నిరూపిస్తున్నాయి.
    ప్రధానంగా తెలుగు భాషకు, ఉర్దూ భాషకు, ఆంగ్ల భాషకు ఉండే సంబంధ బాంధవ్యాల విూద ఈ రచయిత చర్చించారు. బ్రౌను నిఘంటువు విూద వీరికి సాధికారత ఉంది. తెలుగు భాష బ్రౌను నిఘంటువు తరువాత ఎదక్కపోవటం విూద ఆయన చారిత్రిక విశ్లేషణ చేశారు. ఇక్కడే ఈయనకు భాషా చరిత్రకారుని లక్షణాలు అనువర్తించాయి. భాషా చరిత్రకారుడు పూర్వ భాషాభివృద్ధిని చెప్పటమే కాకుండా, వర్తమానంలోను, భవిషత్తులోను భాష ఎలా అభివృద్ధి చెందాలో చెప్పవలసి ఉంది. ఆ పనిని నిజాయితీగా ఈయన చేశారు.
    ఉర్దూ భాష భారతీయ భాష, ఈ భాషలో భారతీయ భాషా శబ్ధాలతో పాటు పార్శీ, అరబిక్‌, తుర్కి శబ్ధాలు విరివిగా వచ్చి చేరాయి. ఉర్దూలో తెలుగు భాషాపదాలు పుష్కలంగా ఉన్నాయి. తెలుగులో ఎన్నో ఉర్దూ భాషాపదాలు ఒదిగి పోయాయి. ఉర్దూ భాషలో కవిత్వాన్ని అనుకరించి తెలుగు కవులు ఎందరో పైకివచ్చారు. కాని ఆ పదజాలానికి సంబంధించిన తులనాత్మక నిఘంటువు లేదు. ఈ విషయంలో రచయిత పట్టుదలగా ఉన్నారు. బ్రౌను తరువాత ఈ కృషిని రహంతుల్లా గారు కొనసాగిస్తే బాగుంటుంది. ఎందుకంటే బ్రౌను కూడా ప్రభుత్వాధికారే. ప్రభుత్వాధికారు లకు పరిపాలనా భాషకు సంబందించిన అవగాహన ఎక్కువ ఉంటుంది. రహంతుల్లా గారు చేసిన ప్రతిపాదనలు శాస్త్రీయంగా ఆచరణాత్మకంగా ఉన్నాయి.

    రిప్లయితొలగించండి
  2. తెలుగు వెలుగులకు ఇదొక ముందడుగు –2
    కత్తి పద్మారావు ప్రముఖ కవి ,రచయిత. పొన్నూరు ఫోన్; 9849741695రహంతుల్లా గారి మరొక చూపు ఆంగ్ల భాష గురించి. వేలాదిగా తెలుగు భాషలో వచ్చి చేరిన ఆంగ్ల భాషా పదాలను ఆయన పేర్కొన్నారు. రహంతుల్లా గారు లేవనెత్తిన ప్రధానాంశం ఆర్ధిక, సాంఘిక, భౌగోళిక శాస్త్రాలతోపాటు, రసాయనిక, భౌతిక, ఖగోళ శాస్త్రాల సంకేతపదాలు తెలుగులో రూపొందించాలని. అయితే దానికి ప్రత్యేక మైన కృషి కావాలి. ఆంగ్లభాషా నిఘంటువులు ఎలా పెరిగాయో ఆ ప్రణాళిక పద్ధతులను మనం అనుసరించాలి. లిపి పరమైన అంశాలలో కూడా ఆయన పారదర్శక సూత్రాలను చేశారు. తెలుగు భాషా లిపి చిత్రలేఖనా లిపి. దీనిలో సౌందర్యం ఉంది. అది ఆధునిక సాంకేతిక టెక్నాలజీకి అనుగుణంగా మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది.
    భాషకు మతానికి సంబంధం లేదు. అయితే తెలుగు రాష్ట్రం విూదకు వలస వచ్చిన మూడు మతాలు మూడు భాషలతో వచ్చాయి. వైదిక హిందూమతం సంస్కృతంతోను, ఇస్లాం అరబ్బితోను, క్రైస్తవం ఆంగ్లంతోను పురోహితులు మూలభాషనే ప్రచారంలో ఉంచుతున్నారు. ఈ కారణంగా తెలుగు జాతిలోనే కొన్ని అరలు ఏర్పడినాయి. ఏ మతం వారైనా, తెలుగు భాషను తమ కార్యకలాపాలలో వాడితే తెలుగు సంస్కృతి వర్ధిల్లే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మత, కుల సంస్కృతే గాని బాషాసంస్కృతి లేదు. ఈ దిశగా ప్రయాణం సాగాలంటారు రహంతుల్లా గారు. ఇది చాలా విశాల దృక్పదం. లౌకిక భాషావాదిగా మనకు ఇక్కడ ఈయన కన్పిస్తాడు. సాంప్రదాయక భాషా చరిత్రకారులకు ఇంత లోతు లేదు. కారణం వారు మతకోణం నుంచి తప్ప భాషను చూడలేకపోవటం. ఇక్కడే రహంతుల్లా గారి ఔన్నత్యం మనకు కన్పిస్తుంది.
    ఈ రచయిత భాషా బానిసత్వానికి వ్యతిరేకి. న్యాయం, వైద్యం, జ్ఞానం తెలుగు భాషలో ఉండాలని ఆయన ఆశయం. ఇదొక బృహత్‌ప్రణాళిక, జాతీయ దృక్పధం. అన్నీ ప్రభుత్వాలే చేస్తాయనుకోవడం అధికారులలో ఉన్న భ్రమ. ఈ భ్రమలు ఈ రచయితకు లేవు. ఏదైనా ఉద్యమంగానే నడవాలి. రాష్ట్రం సాధించటం వేరు, కులాధిపత్యాన్ని, మతాధిపత్యాన్ని భాష విూద తొలగించటం వేరు. ప్రజలు ఆ దిశగా కదలినప్పుడే ప్రభుత్వాలు ఆచరణకు తీసుకొస్తాయి. ప్రభుత్వ ఉత్తర్వులన్నీ తెలుగులోకి వస్తే చట్టం నల్లకోటు ముసుగులో దాగి ఉండదు. విద్యకు ఇన్ని కార్పొరేట్‌ కాలేజీలు అక్కరలేదన్న విషయం బహిర్గతమవుతుంది. పరిషత్తు నాటకాలు మూతపడతాయి. గ్రామాలలో ఉన్న కళారూపాలు వేదికెక్కుతాయి. గ్రామ స్వాతంత్య్రం వర్ధిల్లుతుంది. భాషా విప్లవం వల్ల సామాన్యుడు మాన్యుడవుతాడు.
    ఈనాడు మేధావులుగా వర్ధిలుతున్న వారిలో పరభాషాటోపమే తప్ప, అందులో మేధో విలువలు ఏమీలేవని అర్ధమైపోతుంది. అంటే ఒక గ్రామ పెద్దకే వ్యవహార దక్షత ఉందనేది బయటకు వస్తుంది. భాషా విప్లనం వెనుక ఇంత మర్మం ఉంది. ఇది ఒక సమాలోచన, ఒక చారిత్రక దృక్పధం, ఒక పరిపాలనా వ్యవహార సంబంధ పద సంపద అందించే పుస్తకం. రహంతుల్లా గారు ఒక నిర్ధుష్టమైన వ్యాస రచయిత. ఆయన రచనలు నేను చాలా కాలంగా పత్రికల్లో చదువుతున్నాను. ఆయనది వాస్తవిక దృక్పధం. వాక్యం సరళంగా చాలా స్పష్టంగా ఉంటుంది. ఆయన లౌకికవాది. ఈయన రచనలలో ప్రణాళికలు ఉంటాయి. ఈయన విూద బ్రౌను ప్రభావం ఉంది. ఆంధ్రులకు మాత్రం ఇప్పుడు ఓ బ్రౌను అవసరం. ప్రతి భాషాశాస్త్రకారుడికి, నిఘంటుకర్తకి బ్రౌను ఆదర్శమయ్యారు. రహంతుల్లా గారు కూడా తన కృషిని ఇలా కొనసాగిస్తే తెలుగువారికి మరొక బ్రౌను లభ్యం కాగలడు.

    రిప్లయితొలగించండి
  3. ఒక్కొక్క వ్యాసం ఒక్కో మణిపూస -1
    పరకాల పట్టాభి రామారావు స్వాతంత్ర సమరయోధులు విశాలాంధ్ర విశ్రాంత సంపాదకులు విజయవాడ ఫోన్ 0866-2474635
    భారతదేశ స్వాతంత్రోద్యమంలో భాగంగానే భాషా ప్రయుక్త రాష్ట్ర విభజనోద్యమం సాగింది. ఒకటి రెండు తరాలు గడిచేటప్పటికి తెలుగు మృతభాషగా దిగజారి పోయే పరిస్థితులు దాపురించాయి. 'అధికార భాషా సంఘం' అంటూ ఒకటి ఏర్పడినప్పటికీ ఈ నాటికీ పరిపాలన అంతా ఇంగ్లీషులోనే సాగిపోతున్నది.
    తెలుగు భాషా ఉద్యమం ఒక చారిత్రక కర్తవ్యంగా మనముందున్న నేటి పరిస్థితుల్లో, నూర్‌బాషా రహంతుల్లా గారురచించిన ''తెలుగు అధికార భాష కావాలంటే...'' అన్న ఈ గ్రంథం ఎంతో ప్రాధాన్యత సంతరించు కుంటుంది. రహంతుల్లా గారు అనేక ఉద్యోగాలలో అనేక ప్రాంతాలలో పనిచేసినప్పుడు ప్రజల సమస్యలకు సంబంధించిన ఫైళ్లు తెలుగులోనే నడవాలంటే ఎదురవుతున్న సమస్యలను స్వానుభవంతో తెలుసుకున్నారు. వారి జీవితానుభవం నుండే మరొక ఆశ్చర్యకరమైన ఉదంతం వారికి మాతృభాష యందు అభిమానం కల్గించింది. తెలుగు భాషలో నమాజు ఎందుకు చేయకూడదు? అరభ్బీ భాషలో ఖురాను ఉంది గనుక అరబ్బీలోనే నమాజు చేయాలనే నిర్బంధం దేనికి? అచ్చ తెనుగులో నమాజు చేస్తే ముస్లిమ్‌లకే కాక, సర్వ మతాలవారికి కూడా దైవప్రార్ధన అర్ధమవు తుందికదా! దేవుడే కదా అన్ని భాషలను సృజించింది? అటువంటప్పుడు అర్ధంకాని అరబ్బీని ఆంధ్ర ముస్లింలపై రుద్దేకంటే తెలుగులోనే వారిని ఖురాన్‌ చదువుకో నివ్వడం, నమాజు చేసుకోనివ్వడం, వివాహాలు జరుపుకోనివ్వడం మేలుకాదా? తెలుగుదేశంలో ముస్లిమ్‌లు గణనీయ సంఖ్యలోనే ఉన్నారు. ఇదివరకు ఈ ప్రశ్న ఎవరికైనా స్పురించిందో లేదో తెలియదు కాని రహంతుల్లా గారికి తోచడం వారి మాతృ భాషాభిమానాన్ని తెలుపుతుంది.
    రహంతుల్లా గారు తమ మాతృభాష తెలుగు అన్ని చెప్పుకొంటూ, వారి భాషాభిమానాన్ని మనసులోనే అట్టే పెట్టుకోలేదు. 1980 నుండి తెలుగు భాషా పరిరక్షణకు ఆంధ్రపత్రిక, గీటురాయి మున్నగు వివిధ పత్రికలలో లేఖలు, వ్యాసాలు వ్రాయడం ఒక ఉద్యమంగా కొనసాగించారు. ఈ వ్యాసాలన్నింటిని కలిపి ఈ గ్రంధంగా తెలుగు పాఠకులకు అందిస్తున్నారు. ఇందులో ఒక్కొక్క వ్యాసం ఒక్కో మణిపూస అని చెప్పవచ్చు. ఆంధ్రపత్రికలో 1988 జులైలో అధికార భాషగా తెలుగును అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వమూ, ప్రజలు చేయవలసిన కర్తవ్యాలను రహంతుల్లాగారు సవివరంగా తెలిపారు. ద్రావిడ భాషలన్నింటిలోకి తెలుగు మధురాతిమధురమైన భాష అని ప్రశంసించిన హెన్రీమోరిస్‌, ఇది సంస్కార యుతమైన భాష, భావాలను సొంపుగా, సౌలభ్యంతో వ్యక్తం చేయవచ్చునని చెప్పిన క్రైస్తవ మిషనరీ విలయమ్‌ కేరీ, అలాగే డి.కాంప్‌బెల్‌, ఆర్‌. కాలెట్టిల్‌ మున్నగు ఆంగ్ల భాషా కోవిదుల అభిప్రాయాలను ఈ వ్యాసాలలో రహంతుల్లాగారు ఉదహరించారు. మహోన్నతమైన తెలుగు భాషను ప్రజలు, ప్రభుత్వమూ కలిసి అభివృద్ధి చేయాలని రహంతుల్లాగారు చేసిన సూచనలు నేడు తెలుగు భాషా పరిరక్షణ ఉద్యమకారులందరూ శిరోధార్యంగా భావించవలసిన అవసరం ఉంది.

    రిప్లయితొలగించండి
  4. ఒక్కొక్క వ్యాసం ఒక్కో మణిపూస -2
    పరకాల పట్టాభి రామారావు స్వాతంత్ర సమరయోధులు విశాలాంధ్ర విశ్రాంత సంపాదకులు విజయవాడ ఫోన్ 0866-2474635
    ఇతర భాషలలోని అనేక పదాలు వచ్చి తెలుగులో చేరాయని, వాటినన్నింటిని చేర్చుకొని తెలుగుభాషను సుసంపన్నం చేసుకోవలసిన అవసరాన్ని కూడా రహంతుల్లా గారు సోదాహరణంగా ''తెలుగువారు పలికే ఉర్దూపదాలు'', ''తెలుగు + ఇంగ్లీషు = తెల్గీష్‌'' మొదలైన వ్యాసాలలో తెలియజేశారు. ''దాస్యం చేసే భాష అధికార బాష ఎలా అవుతుంది!'' అనే వ్యాసంలో పేద దేశాల భాషలు ధనిక దేశాల భాషలకు ఎలా ఊడిగం చేయవలసి వస్తున్నదో ప్రపంచబ్యాంకు అంతర్జాతీయ సంస్థలు తమ అంతర్జాతీయ భాషపేరుతో జాతీయ భాషలను ప్రాంతీయ భాషలను ఎలా అణగ ద్రొక్కుతున్నదీ రచయిత అనేక వివరాలను తెలిపి మన తెలుగు భాషను ఇటువంటి దాస్యాన్నుండి విముక్తి చేయాలని ఉద్ఘాటించారు. తెలుగు లిపిని సంస్కరించవలసిన ఆవశ్యకతను మరో వ్యాసంలో తెలిపారు.షెడ్యూలులో ఉన్న భాషలు, తెలుగు అకాడవిూ డైరెక్టర్లు, వివిధ విశ్వవిద్యాలయాల్లోని తెలుగు విభాగాల అధిపతులు మున్నగు సమాచారం గ్రంధం చివర చేర్చారు.
    ''తెలుగువారు పలికే ఉర్దూపదాలు'', ''తెలుగు నిఘంటువులో చేర్చాల్సిన ఇంగ్లీషుపదాలు'' మున్నగు వ్యాసాలలో సమాచార సేకరణకు రచయిత ఎంత పరిశోధన ఎంతశ్రమ చేశారో మనకు అర్ధమవుతుంది.
    తాను ఎక్కడ ఉద్యోగం చేస్తున్నప్పటకీ ప్రతిసారీ ఆంధ్రావతరణ దినోత్సవాలను జరుపుతూ తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటికీ, రాష్ట్రావతరణ లక్ష్యాలు నెరవేర లేదనీ, వాటిని నెరవేర్చాలనీ రహంతుల్లాగారు పదేపదే జ్ఞాపకం చేసిన తీరు చూసినప్పుడు వారి మాతృభాషాభిమానానికి, అంకిత భావానికి వారి శ్రద్ధాసక్తులకు ప్రతి తెలుగువాడు చేయెత్తి జైకొట్టాలి తప్పదు!
    భారతదేశంలో రెండవ పెద్ద భాష అయిన తెలుగును జాతీయ అధికార భాషగా చేయడం, అంతకన్నా ముఖ్యంగా ఈ నాటికైనా అన్ని స్థాయిల్లోను తెలుగును అధికార భాషగా చేయడం. టైప్‌మిషన్‌లకు కాలదోషం పట్టి కంప్యూటర్లు వచ్చిన నేటి దశలో తెలుగు సాప్ట్‌వేర్‌ను, కీ బోర్డును ఇంగ్లీషుకు దీటుగా అభివృద్ధి పరచాలని రహంతుల్లాగారు చేసిన సూచనను ప్రభుత్వము ప్రజలు గమనించడం నేటి తక్షణ కర్తవ్యం.
    తెలుగును విద్యారంగంలో, ప్రభుత్వ పరిపాలనా రంగంలో ఇప్పటికైనా ప్రవేశపెట్టాలని నేడు జరుగుతున్న ఆందోళనకు, ఎంతో విలువైన సమాచారాన్ని అందించడమే కాక అనేక నిర్ధిష్ట సూచనలను చేసిన ఈగ్రంధాన్ని అందించిన రహంతుల్లాగారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. తెలుగు భాషోద్యమ కారులందరూ ఈ గ్రంధాన్ని తప్పక చదవాలనీ, ప్రతి గ్రంధాలయంలోను ఈ గ్రంధాన్ని ఉంచాలనీ కోరుతున్నాను.

    రిప్లయితొలగించండి
  5. ఆచరణాత్మక సూచనలు అభినందనీయం
    డాక్టర్ సామల రమేష్ బాబు ప్రధాన కార్యదర్శి తెలుగు భాషోధ్యమ సమాఖ్య సంపాదకుడు నడుస్తున్న చరిత్ర విజయవాడ ఫోన్:0866–2439466,9848016136
    ఈ పుస్తక రచయిత నూర్‌బాషా రహంతుల్లాగారిని ప్రతి తెలుగువాడూ అభినందించాలి. ఆంధ్రపత్రిక(1987-91)లో ప్రచురింపబడిన వ్యాసాలను, 'గీటురాయి' (1996-2004) లో వచ్చిన వ్యాసాలను వరుస క్రమంలో గుది గ్రుచ్చి ప్రచురిస్తున్న వ్యాసమాలిక ఈ పుస్తకం.
    నూర్‌బాషా రహంతుల్లాగారు తన మాతృభాష తెలుగు అధికార భాషగా వికసించాలని స్థిరమైన అభిప్రాయం కలిగివున్నారు. ప్రజల మాతృభాష అధికార భాషగా ఎందుకుండాలో, అందుకోసం ఏంచేయాలో, ఏవిధమైన కృషి జరగాలో ఆయన తన వ్యాసాల్లో వివరించారు. తెలుగు రెండవ జాతీయ అధికార భాష కావాలని ఆయన కోరిక. ఇందుకోసం తెలుగువారి సంఖ్యావివరాలను ఆయన ఉటంకించారు. అయితే, ప్రభుత్వలెక్కల్ని ఆధారంగా తీసుకోవడం వల్ల ఆ సంఖ్యలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయి. తమిళనాడులో 42 శాతం తెలుగువారున్నారని అందరూ ఒప్పుకుంటున్న సత్యం. తమిళనాడులో ద్రవిడ పార్టీల పాలనలో క్రమబద్ధంగా జరుగుతున్న తమిళీకరణ వల్ల లెక్కలన్ని తారుమారయిపోయాయి. ఇది ప్రత్యేకించి చర్చించ వలసిన సంగతి. విశేషమేమిటంటే-ప్రభుత్వ లెక్కల ప్రకారం చూచినా, తెలుగే రెండవ పెద్దభాషగా కనిపిస్తుంది. అయినా, భాషా ప్రాతిపదికన ఏర్పడిన తొలిరాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో తెలుగును అధికారభాషగా రూపొందించడంలో ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలకు శ్రద్ధలేదు. అధికారం కోసం ఏర్పడిన ప్రత్యేకతే తప్ప, తెలుగువారి రాజకీయాలకు మాతృభాషా సంస్కృతుల భూమిక లేకపోవడం వల్ల-మన ప్రభుత్వాలు సామాన్య ప్రజల శ్రేయస్సుకు వ్యతిరేకంగా నడుస్తున్నాయి. తెలుగు భాషోద్యమం ఇటీవలి కాలంలో సరికొత్తగా ప్రారంభమై విస్తరిస్తుండడానికి కారణం ఇదే. ఈ పుస్తక రచయిత నూర్‌బాషా రహంతుల్లా వంటి వారు ప్రభుత్వ రంగంలో కొందరైనా ఉండబట్టే ఈ మాత్రమైనా తెలుగు అధికార భాషగా మిగిలివుందను కోవడం తప్పేవిూకాదు.
    అధికార భాషగా తెలుగును పటిష్టంగా, సమున్నతంగా చేయడానికి రచయిత చేసిన సూచనలు ఇప్పటి వరకు అనేక సందర్భాలలో వ్యక్తులు, సంఘాలు చేసినవే. అయితే ఇందులో చెప్పిన తీరును ఆయన అందించిన ఆచరణాత్మక సూచనలను అందరూ గమనించాలి. ప్రభుత్వ విద్యా విధానంలో తెలుగుపట్ల అనుసరించవలసిన సూత్రాల గురించి రచయిత స్పష్టంగా ఎన్నో విషయాలు సూచించారు.
    తెలుగు మాధ్యమాన్ని తొలగించి, ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రభుత్వ బడులలో ప్రవేశపెట్టాలనే ధోరణిని రచయిత ఖండించడం ముదావహం. అయితే, ఇంగ్లీష్‌ను అనుసంధాన భాషగా చేయాలనడంలో ఇంగ్లీష్‌లిపిని తెలుగులిపికి బదులుగా ఉపయో గిస్తూనే తెలుగులో కంప్యూటర్‌పైన పనులు సాగించవచ్చుననడం కంటే తెలుగు లిపిని సంస్కరించి, కంపూటర్లను అందుకు అనుగుణంగా తీర్చి దిద్దుకోవచ్చు. ఈ విషయంలో ఇప్పుడున్న స్థితి కంటె అభివృద్ధి చెందడానికి మరింత పట్టుదలగా కృషి చెయ్యాలి.
    ''తెలుగు అధికార భాష కావాలంటే...'' అనే ఈ వ్యాసమాలికను తెలుగు ప్రజలకు సమర్పిస్తున్న రచయిత నూర్‌బాషా రహంతుల్లాగారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ పుస్తకాన్ని ప్రభుత్వంలో అన్ని స్థాయిల్లోని బాధ్యులకు అందించాలి. భాషోద్యమంలో పనిచేస్తున్న కార్యకర్తలందరూ విధిగా చదవాలి. రహంతుల్లా గారి వంటి ఎందరో తెలుగుతల్లి ముద్దుబిడ్డలు తెలుగు భాషకు బంగరు భవిష్యత్తును సాధించడానికి దీక్షాకంకణులై ఉన్నారు. తెలుగు భాషోద్యమం దశదిశలా విస్తరిస్తుంది. రాష్ట్రంలో, దేశంలో తెలుగుకు రావలసిన స్థానం లభించితీరుతుంది.

    రిప్లయితొలగించండి
  6. ప్రతిపాదిత సూచనలు ప్రయోజనకరం
    అబుల్ ఇర్ఫాన్ ఖురాన్ బావామృతం అనువాదకుడు హైదరాబాదు ఫోన్ ; 040–55710795,9441515414
    నా మాతృభాష తెలుగువ్యాకరణం, తెలుగు పదాలతో సంయోగం చెందిన ఉర్దూ భాష. అంచేత నేను ఉర్దూలో ఎన్ని పుస్తకాలు చదివినా, ఉర్దూ ప్రజలున్న హైదరాబాద్‌ పాతబస్తీలో ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి నివశిస్తున్నా, ఇప్పటికీ నన్ను ఉర్దూ కంటే తెలుగే ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. దివ్య ఖుర్‌ఆన్‌ని ఉర్దూ నుండి తెలుగులో అనువదించి నప్పుడు నాకీ సంగతి మరింత స్పష్టంగా బోధపడింది. నూర్‌బాషా రహ్మతుల్లాకు ఇంగ్లీషు మీద గట్టి పట్టున్నా మాతృభాష గురించిన ఈ భావోద్రేకాలే ఆయనలో కూడా ఉన్నాయని నాకు అన్పిస్తోంది. మాతృభాష మీద అభిమానం ఉండటం సహజమే అయినప్పటికీ ఇతర భాషల కంటే మాతృభాష ప్రభావం ఎక్కువగా ఉంటుందనేది ఓ తిరస్కరించలేని యదార్థం.
    ఒక భాష ద్వారా విషయం అర్థం చేసుకోవడం వేరు; ఆ విషయాన్ని ఆచరణకై ప్రేరేపించేటంతగా ప్రభావితం కావడం వేరు. అలాంటి ప్రభావం మాతృభాషలోనే సాధ్యమవుతుంది. కాకపోతే ఆ మాతృభాషలో ఎన్ని పరభాషా పదాలున్నా అది ఉచ్చారణ సౌలభ్యం లేని కఠిన పదాలతో కలుషితం కాకుండా సవ్యంగా సాఫీగా సాగిపోయే శైలితో కూడినదయి ఉండాలి. తెలుగులో చేరిన ఎన్నో పరభాషా పదాలను ఇప్పుడు తీసేసి సంస్కరించడం కుదరదు. వాటిని అలాగే ఉంచి ప్రభుత్వం తెలుగును ఆచరణాత్మకంగా అధికారభాషగా చేసి, ఆంగ్లేయభాషా ప్రవాహానికి అడ్డుకట్ట వేసినప్పుడే మన మాతృభాష, దాని మాధుర్యం మనగలుగుతాయి.
    పాలకులు పరదేశీయులయినప్పుడు వారి భాషను రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రజలపై రుద్దడం సహజం. ఇప్పుడు మన దేశంలో పరదేశ పాలన లేకపోయినా వారు మన మీద రుద్దిపోయిన ఆంగ్లేయభాష ప్రభావం నుండి మనవాళ్ళు బయటపడ లేపోవడం ఎంతో విచారకరం. ఆంధ్రప్రదేశ్‌ భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుండి మన రాష్ట్ర పాలకులు తెలుగుకు అధికారభాషా స్థాయి ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నాలు ప్రకటనలకు, కాగితాలకే పరిమితమై పోతున్నాయి.
    ప్రభుత్వ కార్యకలాపాలలో ఇంగ్లీషు రోజురోజుకు పటిష్ఠమవుతూ తిష్ఠ వేసు కుంటోంది. ఇప్పుడు ప్రభుత్వం ప్రైవేటు విద్యాలయాలతో పోటీ పడలేక ప్రభుత్వ విద్యా లయాలన్నిటినీ ఇంగ్లీషు మీడియం విద్యాలయాలుగా మార్చడానికి కూడా తాపత్రయ పడుతోంది. తన దగ్గరున్న మంచి రంగుకు పొగడ్తలు లభించకపోవడంతో ఇతరుల దగ్గరున్న నాసిరకం రంగు తీసుకొని పులుముకున్నట్లుందీ వ్యవహారం. ఈ ధోరణి మారాలి. ప్రభుత్వం తలచుకుంటే ప్రైవేటు విద్యాలయాలలో సైతం ఇంగ్లీషు మీడియంను తీసేయించి తెలుగు మీడియంను నిర్బంధంగా ప్రవేశపెట్టించవచ్చు.
    మనవాళ్ళు ఆంగ్లేయభాషా వ్యామోహం నుండి బయటపడలేక పోవడానికి ముఖ్యంగా నాకు రెండు కారణాలు కన్పిస్తున్నాయి. ఒకటి: ఇంగ్లీషు అంతర్జాతీయ భాష గనుక ఆ భాష నేర్చుకొని అందులో మాట్లాడటం తమకు గర్వకారణంగా భావిస్తున్నారు అనేకమంది. ప్రభుత్వాధికారుల్లో, ధనికులలో, మధ్యతరగతి ప్రజలలో కూడా ఇంగ్లీషు మాట్లాడే వారికే గౌరవం లభిస్తుంది. పైగా అధికారులతో, ఉన్నత విద్యావంతులతో తెలుగులో మాట్లాడటం నామోషిగా భావిస్తున్నారు. తెలుగు వచ్చినా ఇంగ్లీషులో మాట్లాడటం, పాశ్చాత్య నాగరికతను అనుకరించడం మన భావదాస్యాన్నే ప్రతిబింబిస్తాయి కాని మన భాష, సంస్కృతుల ఔన్నత్యాన్ని ఇతరుల ముందు ఎన్నటికీ చాటుకోలేము.
    రెండు: సైన్సు సాంకేతిక రంగాలలోని ఇంగ్లీషు పదాలను తెలుగులో అనువదించడం సాధ్యంకాదని భావించడం. ఇది కొంతవరకు సమంజసమే అయినా మనసుంటే మార్గం లేకపోలేదు. ఇప్పటికే కంప్యూటర్‌ రంగంలోని సాంకేతిక ఇంగ్లీషు పదాలు వందల సంఖ్యలో పత్రికల ద్వారా యధాతథంగా తెలుగు లిపిలో వచ్చిచేరాయి. వాటిని అలాగే కొనసాగనివ్వడం మంచిది. సైన్సు సాంకేతిక రంగాలలోని ఇంగ్లీషు పదాలలో కొన్నిటిని వాటికి సమానార్థంగల తెలుగు పదాలను సృష్టించవచ్చు మిగిలిన ఇంగ్లీషు పదాలను తెలుగీకరణ చేయవలసి ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  7. రతిపాదిత సూచనలు ప్రయోజనకరం-2
    అబుల్ ఇర్ఫాన్ ఖురాన్ బావామృతం అనువాదకుడు హైదరాబాదు ఫోన్ ; 040–55710795,9441515414తెలుగు అధికార భాషగా చేయడానికి రహ్మతుల్లా గారు ప్రతిపాదించిన సూచనలు ఎంతో ప్రయోజనకరమైనవి. మన రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి సూచనలను దృష్టిలో పెట్టుకొని చిత్తశుద్ధితో కృషిచేస్తే తెలుగు అధికారభాష కావడం అసాధ్యమేమీ కాదు.
    ఈ పుస్తకంలో రహ్మతుల్లాగారు '' తెలుగుభాషలో నమాజు'' అనే శీర్షికతో ఒక జఠిల సమస్యను లేవనెత్తారు. హిందూమతంలో కూడా కొన్ని ఆచారాలు, సంప్రదాయాలలో సంస్కృత శ్లోకాలు తప్పనిసరిగా పఠించవలసి ఉంటుంది. కాని ఇవన్నీ మతవిశ్వాసానికి సంబంధించిన విషయాలు. వీటిని మతపండితుల నిర్ణయానికే వదిలేయాలి.
    నూర్‌బాషా రహ్మతుల్లా నాకు చిరకాల మిత్రులు. మాతృభాషాభిమానం ఆయన్ని ఈ రచనకు ప్రేరేపించింది. ఈ పుస్తకంలోని వ్యాసాలు కేవలం రచన కోసం రచించిన వ్యాసాలు కావు. ఇవి ప్రజలను, పాలకులను ఆలోచింపజేసి ఆచరణకై సమాయత్త పరచడానికి చేస్తున్న చిరుప్రయత్నాలు. తెలుగును అధికారభాషగా చేయడానికి వారు తీసుకునే చర్యలకు ప్రేరణనిచ్చే మౌలిక ఆలోచనాసరళి. కనుక పాఠకులు దీని గురించి ప్రశాంతంగా ఆలోచించి, తమ భావాలను ఇతరులతో పంచుకుంటారని, వాటిని ప్రభుత్వం దృష్టికి కూడా తీసికెళ్ళడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. ఈ కార్యసాధన కోసం నడుం బిగించిన రహ్మతుల్లా గారు ఎంతో అభినందనీయులు.

    రిప్లయితొలగించండి
  8. తెలుగు అధికార భాష కావాలంటే .. పుస్తకానికి అబ్బాదుల్లా గారి పరిచయ పలుకులు
    అభిప్రాయ మార్పిడి కోసం ఆవిర్భవించిన సాధనమే 'భాష.' అయితే ఈ సువిశాల ప్రపంచంలోని భౌగోళిక స్థితిగతుల కారణంగా ప్రజలు-వారి వ్యవహారాలు కూడా విభిన్న జాతులుగా, వర్ణాలుగా, భాషలుగా, సంస్కృతులుగా, జీవన విధానాలుగా మారిపోయాయి. ఇది సహజసిద్ధమైన మార్పే.
    కాని గత కొన్నేండ్ల నుంచి అమెరికా, దాని సోదర దేశమైన బ్రిటన్‌ తమ ఆయుధ బలంతో, రాజకీయ కుట్రలతో ఇలాంటి సహజసిద్ధమైన మార్పును ప్రపంచీకరణ పేరుతో సమూలంగా మార్చి తమ జాతిప్రజల భాష, సంస్కృతి, ఆర్థిక వ్యవహారాలు, జీవన విధానాలను ఇతర జాతులపై బలవంతంగా రుద్ది తద్వారా వాటిపై రాజకీయ పెత్తనం చెలాయించడానికి, అక్రమ ప్రయోజనాలు పొందడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. గ్లోబలైజేషన్‌ క్రింద ఇంగ్లీషును కూడా విశ్వవ్యాప్తం చేయడం ద్వారా స్థానిక భాషలను క్రమంగా అంతమొందించడం ఆ కుట్రలలోని భాగమే.
    తత్ఫలితంగానే మన తెలుగు భాష తన జన్మస్థానంలోనే తెలుగు బాలలకు అతి వేగంగా అపరిచితమైపోతోంది. నాలుగు దశాబ్దాలకు పూర్వం పట్టణాలకే పరిమితమై ఉండిన ఇంగ్లీషు మీడియం స్కూళ్ళు ఇప్పుడు తామరతంపరలా ప్రతి గ్రామానికి విస్తరించాయి. ఇలాంటి తరుణంలో మాతృభాషా శ్రేయోభిలాషులు కొందరు తెలుగు రక్షణ కోసం నడుం బిగించి రంగంలోకి దిగారు. వారిలో ఒకరు నూర్‌బాషా రహంతుల్లా . ఆయన గీటురాయి పత్రికలో ఈ విషయంపై ఇప్పటికే ఎన్నో వ్యాసాలు రాశారు. తెలుగు భాషను కాపాడడమే లక్ష్యంగా ఆయన వ్యాస పరంపర కొనసాగించారు.
    ఇది ఎవరికీ ఎలాంటి భేదాభిప్రాయం లేని సమిష్టి లక్ష్యం. ఇలాంటి సమిష్టి లక్ష్యం కోసం మనమంతా కృషి చేయవలసిందే. కనీసం కృషి చేసేవారిని సమర్థించడం కూడా ఆ యజ్ఞంలోని భాగమే. అందుకే రహంతుల్లా గారి ఈ పుస్తకాన్ని మేము తెలుగు ఇస్లామిక్‌ పబ్లికేషన్స్‌ తరఫున ప్రచురిస్తున్నాం.

    రిప్లయితొలగించండి