18, జులై 2012, బుధవారం

తెలుగు వారు పలికే ఉర్దూ పదాలు

7.తెలుగు వారు పలికే ఉర్దూ పదాలు
                తెలుగు ప్రజల మాటల్లో ఎన్నో సంస్కృత, ఆంగ్ల, ఉర్దూ పార్శీ భాషల పదాలు దర్శనమిస్తుంటాయి. ఈ అన్య దేశ్య పదాలను తెలుగు తనలో దాదాపు పూర్తిగా కలుపుకొని సుసంపన్నమయ్యింది. పరభాషా దురభిమానము, మొండితనములేని సరళమైన భాష తెలుగు. తెలుగు వారి కున్నంత పరభాషా సహనం, ఈ దేశంలో మరెవరికీలేదంటే అతిశయోక్తి కాదేమో. ఈ సహనం వలనే అనేక పరభాషా పదాలు తెలుగులోకివచ్చి స్థిరపడి దాని స్వంతమే అన్నట్లయిపోయాయి. సంస్కృత, ఆంగ్ల పదాలు మన అనుదిన జీవితంలో ఎన్నో వాడుతున్నాము. అవి మనకు తెలిసినవే. అయితే మనం రోజూ మాట్లాడే తెలుగులో దొర్లే కొన్ని పదాలు ఉర్దూ పదాలని మనకు తెలియదు. సి.పి.బ్రౌన్‌ గారి తెలుగు ఇంగ్లీషు నిఘంటువు నుండి సేకరించిన పదాలను  మాత్రమే ఇక్కడ ఇస్తున్నాను. చాలావాటి అర్థం మనకు తెలిసే ఉంటుంది. తెలియకపోతే నిఘంటువును సంప్రదించగలరు. అచ్చ తెలుగులో మాట్లాడబూనటం సాహసకార్యమే. తెలుగులో స్థిరపడిన ఈ క్రింది హిందూస్థానీ పదాలను గమనించండి:-
                అంగరకా, అంగరేకు, అంగిక, అంగీ, అంగుస్తాను, అంగూరు, అంజూరు, అండా, అందాజు, అందేషా, అంబారము, అంబారిఅకరం, అకస్వారీ, అకీకత్‌, అక్కసరి, అక్కసు, అక్షాయి, అగాదు, ఆగావు, అజా, అజమాయిషీ, ఆటకాయించు, ఆఠావణీీబంట్రోతు, అఠ్వాడా, అడతి, అడితి, అడిసాటా, అతలషు, అత్తరు, అదాపరచు, అదాలతు, అదావత్‌, అనీం అపరంజి, అబ్వాబు, అభిని, అమలు, అమాంతము, అమాదినుసు, అమానతు, అమానీ, అమానుదస్తు, అమీనా, అమ్రాయి, అయబు, అయివేజు, అర్జీ, అర్జు, అలంగము, అలకీహిసాబు, అలగా, అలాదా, అలాహిదా, అలామతు కర్ర , అల్కీ, అల్జడి, అల్మార, అలమారు, అల్లీసకర్ర, ఆవాజా,అవుతు, అవుతుఖానా, అవ్వల్‌, అవ్వాయిచువ్వలు, అసలు, అస్తరు, అహలెకారులు, అహషాంబంట్రోతులు. ఆఖరు, ఆజుబాజు, ఆజమాయిషీ, ఆబాదు, ఆబాలు, ఆబ్కారీ, ఆమిషము, ఆమీను, ఆరిందా, ఆలుగడ్డ, ఆవర్జా, అసరా, ఆసామీ, ఆసాయము, ఆసోదా,
                 ఇక్తియారు, ఇజారా, ఇజారు, ఇనాము, ఇరుసాలు, ఇర్సాలు ఇలాకా, ఇస్తిమిరారి, ఇస్తిరి, ఇస్తిహారుఉజాడ, ఉజయబోడ, ఉఠావుఠి (హూఠాహుటి), ఉడాయించు, ఉద్దారి, ఉపరిరయితు, ఉమేదు (ఉమేజు), ఉల్టా, ఏకరారు, ఓకు, కంకర, కంగాళీ, కంగోరీ, కచేరీ, కచ్చా, కజ్జా, కదపా, కదము, కదీము, కబాతుకోడి, కబాయీ, కబురు, కబేలా, కమాను, కమామిషు, కమ్మీచేయ, కరారు, కరుబూజుపండు, కలాలు ఖానా, కళాయి, కళాసి, కవాతు, కసరతు, కసాయి, కసుబా, కాగితము, కాజీ, కాతా, కామందు, కాయము, కాయిలా, కార్ఖానా, కాళీ, కాసా, కితాబు, కిఫాయతు, కిమ్మత్తుకిరాయి, కిస్తీ, కిస్తు, కుంజడా, కుంజరి, కుందా, కుంబీ, కుడతా, కుడితినీ, కుమ్మకు, కురింజ, కురిచీ, కుల్లాయి, కుశాలు కుస్తీ, కుషీ, (ఖుషీ) కూజా, కూనీ (ఖూనీ) కేపు, కైదీ (ఖైదీ), కైఫియ్యతు, కైరి, కైలు, కొజ్జా, కొఠీ, కొత్వాలు, కొర్నా  (కొర్నాసిగండు)కౌలు (కవులు) ఖజానా, ఖరాగా, ఖరారా (ఖరారు), ఖరీదు, ఖర్చు, ఖసిచేయు, ఖామందు, ఖాయము, ఖాయిదా, ఖాళీ (కాళీ), ఖాసా, ఖిల్లా, ఖుద్దున, ఖులాసా (కులాసా)
                గప్చిప్పు, గప్పాలు, గమ్మత్తు, గయాళీ, గలబ, గల్లా, గల్లీ, గస్లీ, గాగరా, గాడీ, గాబరా, గిరాకీ, గుంజాయిషీ, గుజరానీ, గుజరాయించు, గుజర, గుజిలి, గుజస్తీ, గుబారు, గుమాస్తా, గులాబి, గులాము, గైరు, గైరుహాజరు, గోడా, గోండు, గోరీ, గోలీ, గోషా, గోష్పారా, షూటీ, షూటు,
                చలాకి, చలానా, చలామణీ చాందినీ, చాకిరీ, చాకు, చిరునామా, చెలామణి, చందా, చందుకా, చోపుదారు, చౌరాస్తా, ఛాపా, ఛావు,
                జంజీరు, జంపఖానా, జంబుఖానా, జనాభా, జనానా, జమాదారుడు, జరిమానా, జవాబు, జవాహిరి, జాగ, జాగీరు, జాటి, జారీ, జాస్తిజిరాయితీ, జిల్లా, జిల్లేదారుడు, జెండా, జేబు, జేరుబందు, జట్టీ, జప్తీ, జమ, జమీను, జమీందారు, జముజాలి, జరబాజు, జరీ, జరూరు, జాబితా, జామీను, జుబ్బా, జుమలా, జుల్మానా, జూటు, జోడా, జోడీ, జోరు, ఝడితీ, ఝడ్తి, ఝాడాగా, ఝాటా.
                టపా, టలాయించు, టాకీ, రాణా, డలాయతు, డల్లీ, డవాలీ, డీలా, డోలి, తండేలు, తకరారు, తగాదా, తనఖా, తనిఖీ, తప్సీలు, తబ్దీలు, తరందారీ, తరద్దూదు, తరహా, తరీఖు, తర్జుమా, తవాయి, తస్రపు (తసరబు), తహశ్శీలు, తాకీదు, తాజా, తారీఖు, తాలూకా, తాలూకు, తాళాబందు, తివాసీ, తీరువ, తీరువజాస్తి, తుకిడీ, తుపాను, తైనాతీ, తోపరా, దంగా, దగా, దగుల్బాజీ, దఫా, దబాయించు, దబేనా, దమదమా, దమ్మిడీ, దరఖాస్తు, దరిమిలాసు, దరియాప్తు, దరుజు, దరోబస్తు, దర్జా, దర్జీ, దర్బారు, దలాలీ, దవుడు (దౌడు) దాణా, దామాషా, దారోగా, దాల్చిని, దాళా, దావా, దినుసు, దిమాకు, దివాణము, దివాలా, దివాలాకోరు, దుకాణము, దుప్పటి, దుబారా, దుబాసీ, దురాయీ, దుర్భిణి, దేవిడీ, దౌలత్తు, ధూకళి, నంజ (నంజి), నకలు, నకషా, నకీబు, నక్కీ, సఖరా, నగదు, నగారా, నగీషీ, నజరానా, నఫరు, నఫరు జామీను, నఫా (సభా), నమూదు (నమోదు), నమూనా (నమోనా), నమ్మకు, నవరసు, నవారు, నవుకరీ (నౌకరీ), నవుకరు, నాగా, నాజరు, నాజూకు, నాడా, నాదూరు, నామోషి, నారింజ, నిఘా, నిరుకు, నిలీను, నిశాని, నిషా, నిషిందా, నిసబు, నెజా, నౌబత్తు, పంఖా, పంచాయితీ, పకాళి, పకోడి, పచారు, పజీతి, పటాకి, పట్కా, పట్టా, పట్టీ, పత్తాపరంజు,పరకాళా గుడ్డ, పరగణా, ఫర్మానా, పరవా, పరారీ, పలాన, పల్టీ, పసందు, పస్తాయించు, పాంజేబు, పాజీ, పాపాచి, పాపోసు, పాయకట్టు.
                పాయకారీ, పాయమాలీ, పాయిఖానా, పారా, పారీఖత్తు, పాలకి (పల్లకి) పావు, పావులా, పిచాడీ, పిచ్చికారు, పితూరీ, ఫిరాయించు, ఫిర్యాదు, పీరు, పిరుసుడి, పుంజనేల, పుకారు, పులావు, పుసలాయించు, పూచీ, పూరా, పేరస్తు, పేషిగీ, పేష్కషు, పేష్కారు, పైజారు, పైమాయిషీ, పైలుమాను, ఫైసలా, పోరంబోకు, పోచాయించు, పోంచావణి, పోస్తకాయ, పౌజు, ఫకీరు, ఫక్తు, ఫయిసలా, ఫర్మానా, ఫలానా, ఫసలీ, షాయిదా, ఫిరాయించు, ఫిర్యాదు, బంగి (భంగి) బంజారి, బంజరు బందోబస్తు, బకాయి, బజంత్రీ (భజంత్రీ), బట్టువాసంచి, బట్వాడా, బడా, బడాయి, బత్తీస, బత్తెము (భత్తెము).
                బనాతు (బణాతు), బసాయించు,బయాన, బర్తరపు, బరమా, బరాబరి, బరాబరిక, బస్తా బస్తీ, బహద్ధర్‌ (బహద్దూర్‌), బాకా, బాకీ, బాకూ, బాజా, బాజారు, బాజు, బాజుబందు,బాతాఖానీ, బాతు, బాదము, బాపతు, బారా, బాలీసు, బావుటా, బావుడోరు, బిచానా, బిడాయించు, బినామీ, బిబ్చీ, బిల్మక్తా, బిసాతు, బస్తీ, బీమా, బుంగ, బురకా, బురుజు, బులాకీ, బూబు, బూర్నీసు, బేగి, బేజరూరు, బేజారు, బేడౌలు, బేపరాకు, బేబాకి, బేమరమ్మతు, బేరీజు, బేవారసు, బేషకు, బేషు (బేషు), బేసరి, బోణి, బోనాంపెట్టె, బోషాణం, బరవాసా, భర్తీ, బాట (బాట), భేటీ, భోగట్టా, మంజూరు, మండీ, మకాము, మక్తా, మఖమలు, మగ్దూరు, మజిలీ, మజ్కారు, మజుబూతు, మజుమూను, మజూరి, మజ్దూరు, మజా, మజాకా, మతలబు, మతాబు, మతించు, మద్ధతు, మిన్నా.
                మన్న, మరమ్మతు, మర్తబు, మలాము (మొలాము), మొహమల్‌, మల్పూవు, మషాకత్తు, మషాలు, మషాల్జీ, మసాలా, మసీదు, మహజరు, మహస్సూలు, (మసూలు), మాజీ, మాపుచేయు, మామూలు, మారీఫత్తు, మాలీసు, మింజుమల, మిజాజు (విూజాదు)మిఠాయి, మినహా, మిరాసీ, ముక్తసరు, ముక్త్యారు, ముగ్దరు, ముచ్చివాడు, ముచ్చలికా, ముఠా, ముదరా, (ముజరా), ముద్దతు, ముద్దాయి, మునసబు, మునిషీ, ముభావము, మురబ్బా, ముల్కీ, ముసద్దీ, ముసనాబు, ముసల్మాను, ముస్తాబు, ముస్తీదు, మెహదా, మెహనతు. యకాయకి (ఎకాయెకి), యదాస్తు యునాని, రకము, రజా, రద్దు రప్పు, రయితు (రైతు), రవాణా, రవేసు (రవీసు), రస్తా, రస్తు, రహదారీ (రాదారి), రాజీనామా, రాయితీ, రివాజు, రుజువు, రుమాలు, రుసుము, రేవల్చిని, రొట్టె, రోజు, రోదా, లంగరు, లగాము, లగాయతు, లడాయి, లడి, లమిడి (లమ్డి), లస్కరు, లాచారు, లాడము, లాయఖు, లాలు, లాలూచీ, లిఫాఫా, లుంగీ, లుగుసాను, లుచ్ఛా, లూటీ, లేవిడి, లోటా, లోటు, వకాలతు, వకీలు, వగైరా, వజా, వజీరు, వర్దీ, వసూలు, వస్తాదు, వహవ్వా, వాకబు, వాజివీ, వాపసు, వాయిదా, వారసుడు, వారీ, వారీనామా, విలియా, వేరియా, వేలము (వేలాము), వేలంపాట, శాబాసు (సెబాసు), శాయి, శాయిరు (సాయిరు), శాలువ, శకస్తు శికా, శిస్తు, విస్సాల, శెమ్మె (సెమ్మె), శేరు (సేరు), షరతు, షరా, షరాబు, షహా, షికారీ, షికారు, షుమారు, సంజాయిషీ, సందుగు, సకాలాతు, సక్తుచేయు, సగటు, సగతు, సగలాతు, సజావు, సజ్జనకోల, సదరు (సదరహీ), సన్‌వారు, సన్నదు, సన్నాయి, సన్నీ, సఫేదా, సబబు, నబరు, నబురు, సబ్జా, నబ్నివీను, సముద్దారుడు, సరంగుసరంజామ, సరదా, సర్దారు, సరకు, సరేసు, సర్కారు, సలహా, సలాము, సలిగ, సవాలు, సాంబా, సాకీన్‌, సాబా, సాదరు, సాదర్వారీ, సాదా, సాపు (సాపు), సాబకు, హుకుం, సామాను, సాలస్త్రీ, సాలు, సాలాబాదుగా, సాలీనా, సాలు బస్సాలు, సాళవాదాళవాలెక్క, సాహెబు, సిద్దీ, సిపాయి, సిరా, సిబ్బంది, సిలువ, సిసలు, సిస్తు, సిస్సాల, సీదా, సీసా, సుకారి, సుక్కాను (చుక్కాని), సునామణి (సుణామణీ), సున్నతి, సుమారు, సురమా, సుల్తాను, సుసారము, సుస్తీ, సెల్లా, సోదా, హంగామి, హండా, హంసాయి, హకీకత్తు, హ్కసుహక్కు, హజారము, (అజారము), హద్దు, హమేషా, హయాము, హరామి, హర్కారా, హల్కా (అల్కి), హవేలి, హాజరు, హమీతకావి, హాలు, హాలుసాలు, హశ్శీలు (హసీలు), హిజారు (ఇజారు), హుండీ, హుకుము, హుజారు, హురుమంజి, హురుమత్తు, హాషారు (ఉషారు), హేజీబు, హైరానా (హైరాను), హోదా, హోదా (హవుదా), హౌసు, హవుసుకాడు, హౌసుతోట.
                కీ.శే. గిడుగు రామమూర్తి పంతులుగారు తన ''బాల కవి శరణ్యము'' అనే గ్రంథంలో అన్యదేశ్యముల గురించి వివరిస్తూ ఇలా వ్రాశారు. ''మన తెలుగు భాషలో అన్యదేశ్యములు అనేకమున్నవి. కవులు కూడా వాడుతున్నారు. అట్టి శబ్దములు ఏయే భాషల నుండి ఎప్పుడెప్పుడు వచ్చి తెలుగులో చేరినవో, ఎలాగున మారినవో మన తెలుగు పండితులు విచారించ లేదు. శ్రీ వావిలి కొలను సుబ్బారావు పంతులు గారు తమ సులభ వ్యాకరణములో రోజు, ఖర్చు, జమ, జాబు, మొదలయిన తురకమాటలు ప్రయోగార్హములు కావని నిషేధించినారు గాని ఆయన రచించిన సుభద్రా విజయము (పుట 54)లో 'కంతుతేజీ' అని ప్రయోగించినారు 'తేజీ' అన్న పదమేభాషో? ...మన దేశమును ముసల్మాను ప్రభువులు చాలా కాలము పరిపాలించి యుండినందునను, ఆ మతము వారు తురుష్కులు, పఠానులు, అరబ్బులు మొదలగువారు కోటాను కోట్లుగా అన్ని మండలములలోను స్థిర నివాసము ఏర్పర్చుకొని మనకు తోడికాపులయి ఉన్నందున, వారి భాషలో చేరిన అరబ్బీ, పారసీ, తుర్కీ మాటలు ఒక్క మన తెలుగులోనే కాదు అన్ని భాషలలోను చేరినవి.
                ''తురక మాటలు'' అపరిహార్యములు. సరస కవితకు ఆలంబనములు, శ్రీనాధుడు అక్కడక్కడా ఒక్కొక్క మాట 'ఖుసి మీరన్‌అని ప్రయోగించాడు. నార్మను రాజులు ఇంగ్లాండు జయించి పాలించిన కాలమందు నార్మన్‌, ఫ్రెంచి శబ్దములు, ఇంగ్లీషులో కలసినట్లే, మన తెలుగులో ఉర్దూ మాటలు చేరి, భాషాభివృద్ధికి కారణము లయినవి. సాలాఖరువలెనే నెలాఖరు, మాసవారీ, బేమర్యాద, పెత్తనదారుడు, కలక్టరీ, నిజాయితీ, గుమాస్తాగిరి, బంట్రోతుగిరి ఎంత పొందికగలిగి యున్నవో చూడండి. హిందూస్తానీలో కుడౌల్‌ అంటారు. వేలకొలదిగా ఉన్న ఈ హిందుస్తానీ మాటలు నిత్యవ్యవహరములో ఆంధ్ర భారతి శరీరములోని అంగములయినవి. ఛేదిస్తే గాయములు పడకతప్పదు. ఆంధ్రనామ సంగ్రహము మొదలగు నిఘంటువులలో ఉర్దూ మాటలు తెలుగునకు పర్యాయపదాలుగా పూర్వులే చేర్చినారు. 'ఎకిమీడు పాదుసా యేలిక మన్నీడు సాహేబురాయడు' బ్రౌణ్య నిఘంటువులో ఇవి అనుబంధముగా ఉన్నవి. శబ్ద రత్నాకరమందు ''హిం'' అనే గుర్తుకలిగికొన్ని, మరికొన్ని అన్యదేశ్యములయినా దేశ్యములుగాను చాలా శబ్దములున్నవి. ఇంగ్లీషు మాటలు, సంస్కృత శబ్దములు, ఉర్దూ పదములు మన భాషలో కలిసిపోయిన వన్నీ మన మాటలే. అవి విడిచితే వ్యవహార హాని... తెలుగులో కలిసిపోయిన అనాంధ్ర శబ్దములన్నీ పూర్వము ఏ భాషలోనివైనా ఇప్పుడు తెలుగులే. నేటి వ్యావహారికాంధ్ర భాష అభినవాంధ్ర భారతి యొక్క వాజ్మయ శరీరము భాషలో చేరిన అన్యదేశ్యాలు ఆమె శరీరములో అంతర్భూతములే. అవి, అవసరమును బట్టి వేసే వేషాలు, పెట్టుకునే అలంకారాలు, పూసుకొనే మెరుగులు.'' (పుటలు 227 - 229)
                గిడుగువారు మరోచోట ఇలా అన్నారు. ''పండితులు పుస్తకాలు ఏ భాషలో వ్రాసినా శాస్త్రాలు ఎలాగు కల్పించుకున్నా లౌకిక భాషను నిర్మూలము చేయలేరు. అది వారి నోట్లోనే కాపురముంటుంది. నాలుక మీద నెక్కి నాట్యమాడుతూ ఉంటుంది. సలక్షణముగా వృద్ధి పొందుతుంది.'' (పుట 24) తెలుగులో మిళతమైపోయిన ఉర్దూ పదాలను పండితులు పుస్తకాల్లోంచి ఏరి పారవేయవచ్చు గాని జనం నోళ్ళలోంచి తీయలేరు.
                తెలుగు భాషలోకి వచ్చిన వేలాది ఉర్దూ పదాలను చూస్తే  ఈ ఉర్దూ పదాలను తెలుగు నుండి ఇక తొలగించలేమేమో అనిపిస్తుంది. అవి పూర్తిగా తెలుగు పదాలు అయినట్లుగా, తెలుగులో స్థిరపడిపోయినట్లుగా భావించే బ్రౌన్‌, తెలుగు-ఇంగ్లీషు నిఘంటువులో వాటి అర్థాలను ఇచ్చాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ రీడరు డాక్టర్‌. కె. గోపాలకృష్ణరావు గారు '' తెలుగుపై ఉర్దూ పారశీకముల ప్రభావము'' అనే తన గ్రంథంలో ఆదికవి నన్నయ మొదలు సి.నారాయణ రెడ్డి వరకు ఎందరో తెలుగు కవులు తమ రచనలలో ప్రయోగించిన ఉర్దూ, పార్శీ పదాలను సోదాహరణంగా వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ వారి బహుమతి పొందిన ఆ గ్రంధం ఆంధ్ర సారస్వత పరిషత్తు వారిచే 1968లో ప్రచురించబడింది. బ్రౌణ్య నిఘంటువులో కానరాని అనేక ఉర్దూ పదాలు, ఉర్దూతో మిళతమయిన తెలుగు పదాలు ఎన్నో ఈ గ్రంథంలో దర్శనమిస్తాయి. వాటన్నిటినీ వ్రాయాలంటే, వ్యాసంలో కుదరదు. మరో గ్రంథమే అవుతుంది. గోపాలకృష్ణారావుగారు ఆ గ్రంథానికి ' ప్రస్తావన 'లో,  '' బ్రౌను పండితుల మిశ్రభాషా నిఘంటువును ఆధారముగొని అరబీ, ఉర్దూ పారశీకములకు సంబంధించిన అన్యదేశ్యముల నిఘంటువును కూర్చుట అవసరము '' అని కోరారు. అయితే 20 ఏళ్ళ అనంతరం కూడా అలాంటి నిఘంటువు ఏదైనా ప్రచురించబడినట్లు కనబడటం లేదు.
                ' తెలుగుపై ఉర్దూ పారశీకముల ప్రభావము ' అను గ్రంథము యొక్క 'పరిశిష్టము' లో గోపాల కృష్ణారావుగారు ఇలా అన్నారు. ''ఇప్పుడు దేశమునందుకాని రాష్ట్రమునందు కాని ఉరుదూ పారశీకములకు అధికార భాషాస్థాయి లేదు. కొన్ని రాష్ట్రములలో మాత్రమే ఉరుదూ అనుబంధ అధికార భాషగా స్వీకరింపబడినది. ఇట్టి పరిస్థితులందును ఉర్దూ పారశీక ప్రభావము ప్రసరించుచున్న అంశము విస్మరింపరానిది. పత్రికల భాష, వివిధ సంస్థల ప్రకటనలు, ప్రభుత్వ శాసనములు, చట్టములు వ్యవహారభాష మున్నగు వానిని పరిశీలించినచో ఈ అంశము స్పష్టమగును... ఉరుదూ పారశీకములందు అరబీ భాష నుండి పెక్కు పదములు ప్రవేశించినవి. కనుక పరోక్షముగా అరబీ పదములు కూడా తెలుగులో చేరినవనుట నిశ్చయము. చారిత్రక దృష్టితో చూచినచో ద్రావిడ భాషలపై అరబీ భాష ప్రభావమే మొట్టమొదట కలిగినట్లు కన్పించును... నావికుల పదజాలమును పండితులు పరిశీలించినచో, అమూల్యమయిన అంశములు వెల్లడియగును, పారిభాషిక పదములను రూపొందించుకొనుటలో తెలుగు వారు ఉదారదృష్టి వహించుట అవసరమే. ప్రతిపదము కూడా అచ్చమయిన తెలుగు పదముగా మాత్రమే ఉండవలయునను నిర్భందమును పూనినచో కార్యము క్లిష్టతరమగును. సంకుచిత దృష్టితో మడిగట్టుకొని పారిభాషిక పదములను తెలుగు పదముల తోడనే బలవంతముగా నిర్మించుకొనినచో అవి బహుజన ఆదరపాత్రములు కాక వ్యవహారమును కష్టతరమొనర్చును. విధిలేనపుడు ఎంత గొలుసు పదములను, చిత్ర విచిత్రములైన పదములను నిర్మించుకొనుట శాస్త్రసిద్ధమైన మార్గము కాదు. జేబురుమాలు, గుండీ, అంగీ, కుడ్తా, టోపి, అమలు, వాయిదా వంటి పదములకు సమానార్థకములగు తెలుగు పదములను ప్రత్యేకముగా కృషి సలిపి నిర్మించుకొనుట వృధాశ్రమయని అనుభవజ్ఞుల అభిప్రాయము... నిత్య పరివర్తన శీలమయిన భాషకు నిర్భంధములు తగవు అన్యభాషల నుండి పదములు స్వీకరించినంత మాత్రమున తెలుగు భాష గౌరవ ప్రతిష్టల కెట్టి భంగము వాట్లిలదు. తెలుగు ఇంకను పరిపుష్టమగును...ఆదాన ప్రదాన పద్ధతి ఉభయ భాషా సాహిత్యములకు లాభదాయకము. దక్షిణాది భాషలపై ఉర్దూ పారశీకముల ప్రభావమును తులనాత్మకముగా పరిశీలించి తెలుగుపై ప్రసరింపజేసిన ప్రభావ వైశిష్ట్యమును కూడా నిరూపించుటకు పండితులు కృషి యొనర్పవలసియున్నది. ఇట్టి పరిశోధనకు కృషికి పునాదిగా పనికి వచ్చునది పదజాలము. ఈ పదజాలమును నిఘంటువు రూపమున సంతరించుట ఎంతయో అవసరము. ఇది ఒకరి వలన అగు కార్యము కాదు. బహుభాషజ్ఞులగు పండితుల సహాయముతో సాహిత్యసంస్థలు, అకాడమీలు బృహత్ప్రణాళికను సిద్దము చేసి సాధింపదగిన కార్యము. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అన్యదేశ్య నిఘంటువును కూడా నిర్మించుటకు సాహసింపవలయునని వినయపూర్వకముగా విన్నవించు కొనుచున్నాను.''
                రద్దయిన అకాడమీలలో పై అకాడమీ ఉందో లేదో నాకు తెలియదు గాని నిఘంటువు మాత్రం నిర్మించబడలేదని తెలుసు. ఉర్దూ ఉద్యమం అంటూ ఉపవాసాలు చేసే జనం ఉర్దూ-తెలుగు. తెలుగు-ఉర్దూ నిఘంటువుల నిర్మాణం కోసం కృషి చేస్తే ఇరువర్గాల మధ్య భాషా పరిజ్ఞానం పెరిగి పరాయితనం పోతుంది. సఖ్యత వెల్లివిరుస్తుంది. రానురాను మిశ్రమ భాషేమేలైన వారథి అవుతుంది. భాషాద్వేషం సమసిపోతుంది. ఇరు భాషలలోని జాతీయాలు, సామెతలు, లోకోక్తులు, యాస పదాలు క్రోడీకరించి పరస్పరం అనువదించి గ్రంథాలుగా వెలువరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. భాషాప్రియ సంస్థలీ పనికి పూనుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి పనులకు తగిన నిధులు కేటాయించి తెలుగు ఉర్దూ అకాడమీలను గ్రంథాల ప్రచురణకుపురమాయించాలి.                                                                                      (గీటురాయి 27-1-89, 20-12-96 )

2 కామెంట్‌లు:

  1. ఉర్దూ ముస్లిముల భాష కాదు (ఆంధ్రజ్యోతి 29.7.2015)
    ఉర్దూ ముస్లిముల మత భాష కాదు.ముస్లిముల సొంత భాష అంతకంటే కాదు. కొంతమంది ముస్లిములు మాత్రమే సొంతం చేసుకొని వాళ్ళ బడాయి కోసం బలవంతాన మతం రంగు పులిమారు.ఇదే అదనుగా అది వాళ్ళ భాషేనని కొందరు ఉర్దూను సాయిబులకే అంటగట్టి చేతులు దులుపుకున్నారు.వాస్తవానికి ఉర్దూ కూడా తెలుగు లాగానే భారతీయ భాష . పైగా సామాన్యుల వాడుక భాష. హిందుస్తానీ (కారి బోలీ ) భాష.ఇది భారతదేశంలో పుట్టిపెరిగి అభివృద్ధి చెందింది. 1947 వరకు మనదేశంలో రాజ భాష ఉర్దూనే.హైదరాబాద్ రాష్ట్ర హైకోర్టులో న్యాయ వ్యవహారాలు ఉర్దూలోనే జరిగేవి. న్యాయవాదులు వాదనలు ఉర్దూలో చేసేవారు. తీర్పులు ఉర్దూలో వచ్చేవి. ఉర్దూలో న్యాయశాస్త్ర పుస్తకాలు ఉండేవి.రెండు హైకోర్టుల విలీనం వల్ల ఉర్దూ బెంచిని ఏడు సంవత్సరాలు నడిపిస్తామని చెప్పి మధ్యలోనే ఆపేశారు.ఉర్దూను కొందరు ముస్లిములు తమ మత భాషగా వేరుచేసి చెలామణి చేసిన ఫలితంగా ఆ భాష పట్ల వ్యతిరేకత పెరిగింది.ఉర్దూ రానివాళ్ళు ముస్లిములే కాదు అని గతంలో కొందరు ఉర్దూ ముస్లిములు తెలుగు ముస్లిముల మీద పెత్తనం చేసేవారు.ముస్లిం అంటే ఉర్దూ మాట్లాడటం,బిరియానీ తినటం అనే వాళ్ళ కాలం పోయింది.క్రమేణా ముస్లిముల మతగ్రంధాలన్నీ తెలుగులోకి దిగి వస్తున్నాయి.ఏ భాషకూ మతం ఉండదు.మతస్తులే ఆయా భాషలను వారి అవసరాల కోసం వాడుకుంటారు.
    " హైదరాబాదు సంస్థానంలో ఉర్దూ నెత్తిన రుద్దారని అంధ్రోద్యమం నడువగా, ఆంధ్రప్రదేశ్‌గా ఆవతరణ చెందిన తర్వాత ఉర్దూ బదులు ఇంగ్లీషే పెత్తనం చెయ్యసాగింది. ఎరుగని మిత్రుడు కన్నా ఎరిగిన శత్రువు నయం అన్న సామెతగా ఉర్దూ స్థానంలో ఇంగ్లీషు రావడం సమైక్యానికి సహయపడక పోగా, భాషా రాష్ట్రాల ఆశయమే 20 సంవత్సరాలు అయినా అమలు జరుగదాయె '' అని 1977లో ఆనాటి అధికార భాషా సంఘం అధ్యక్షుడు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య అన్నారు. ( ' విశాలాంధ్రం ' పేజీలు 77, 78 )
    ఏ మనిషికైనా మాతృభాషలోని మాధుర్యం మరో భాషలో చిక్కదు. ఇది తెలుగు రాష్ట్రం గనుక ఉర్దూ కంటే మిన్నగా తెలుగును పాలనా భాషగా అధికారికంగా చెప్పి మరీ అమలు చెయ్యవచ్చు.తెలుగు భాషా పీఠాలకు ,విశ్వవిద్యాలయాలకూ నిధులిచ్చి ఎంతైనా అభివృద్ధి చెయ్యవచ్చు.దేశీయ భాషలన్నీ వికసించాలి.ప్రాంతీయ భాషలన్నిటినీ అభివృద్ధి చెయ్యాలి.ప్రాంతీయ భాషల వాళ్ళు భారీగా సివిల్ సర్వీసుల్లోకి అడుగుపెట్టే అవకాశాలు కల్పించాలి.భాషలకు సాంకేతికతను జోడించినప్పుడే ఉపాధి లభిస్తుందని అబ్దుల్ కలాం గారు చెప్పారు.ఉపాదినివ్వని భాషలను ప్రజలూ తిరస్కరిస్తున్నారు.ఈనాడు తెలుగుభాష ద్వారా ఉపాధి లేనట్లే ఉర్దూ ద్వారా కూడా ఉపాధి లేదు.అలాంటి భాషలకు నిధులు ఇచ్చి ప్రాణం పోస్తున్నారు కాబట్టి మన తెలుగుకు ఇంకా ఎక్కువగా నిధులు ఇవ్వాలి.

    రిప్లయితొలగించండి
  2. "ఉర్దూ.. సంస్కృతం భాషలు ఒక మతానికో, ప్రాంతానికో పరిమితం కాదు. అవి భారతీయ భాషలు.స్వాతంత్య్ర పోరాటంలో హిందూ ముస్లింలు ఏకమై చేస్తున్న తిరుగుబాటును ఎదుర్కొనే ప్రయత్నంలో భాగంగా బ్రిటిషు వాళ్లు 'విభజించు పాలించు' అనే విధానాన్ని అమలులో పెట్టి ఆయా వర్గాల మధ్య చిచ్చు పెట్టారు.అది నేటికీ రాజుకుంటూనే ఉంది.దేశంలో అనేక భాషలు ఉన్నప్పటికీ కాలక్రమంలో ఉర్దూ, సంస్కృతంల ఉనికికే ప్రమాదం ఏర్పడింది.ఉర్దూ అంటే ముస్లింల భాష అని, సంస్కృతం అంటే హిందువుల భాష అన్న అపోహలు ప్రజల్లో ఉన్నాయి కానీ అది వాస్తవం కాదు. మాది హిందూ కుటుంబమే అయినా ఆ రోజుల్లో మా తాతముత్తాతలు ఉర్దూలోనే చదువుకున్నారు. ఇప్పటికీ మన ప్రధాని మన్మోహన్‌సింగ్‌ కూడా తన ప్రసంగాన్ని ఉర్దూలోనే రాసుకుంటారు.మనది వ్యవసాయ ఆధారిత దేశం కావడం, పుష్కలమైన వనరులు ఉండటంతో కరువు పీడిత ప్రాంతాలుగా ఉన్న అఫ్గానిస్తాన్‌, బంగ్లాదేశ్‌ వంటి ప్రాంతాల నుంచి అప్పట్లో ఎందరో బతుకుతెరువు కోసం భారత్‌కు వలస వచ్చారు కానీ తిరిగి వెళ్లలేదు.ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది.వారంతా ఉర్దూ భాషను అక్కున చేర్చుకున్నారు."--మార్కండేయ ఖట్జూ ఈనాడు 6.4.2013

    రిప్లయితొలగించండి